హిందూ ధర్మ ప్రచార విస్తృతికే ధార్మిక సదస్సులు

సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్టు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు

  • Publish Date - February 3, 2024 / 12:47 PM IST

  • ధార్మిక సదస్సులో టీటీడీ చైర్మన్ కరుణాకరెడ్డి


విధాత : సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్టు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుమల ఆస్థాన మండపంలో మూడు రోజుల పాటు జరుగనున్నవేంకటేశ్వర ధార్మిక సదస్సు శనివారం ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మఠాధిపతులు, పీఠాధిపతుల హాజరయ్యారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడారు.


హిందూ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయడంలో భాగంగా పీఠాధిపతులు, స్వామీజీలు, భావసారూప్యం గల ఇతర హిందూ మత సంస్థల నిర్వాహకుల నుంచి సముచితమైన సూచనలను, సలహాలను స్వీకరిస్తామన్నారు. భారతదేశం పవిత్రభూమి అని, ఇక్కడే వేదాలు ఆవిర్భవించాయని, సాక్షాత్తు విష్ణుమూర్తి, శ్రీరామ, శ్రీకృష్ణ రూపాల్లో అవతరించారని చెప్పారు. ఈ దేశంలోనే ధర్మాచరణకు దిక్సూచిగా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా అవతరించారని అన్నారు.


స్వామివారి ఆశీస్సులతో అనేక ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. స్వామివారికి సంకీర్తనల సేవ అందించిన అన్నమాచార్యులు, పురందరదాసు , కనకదాసు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పేర్లతో ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. తాను తొలిసారి చైర్మన్‌గా ఉన్న సమయంలో దళిత గోవిందం, మత్స్య గోవిందం, గిరిజన గోవిందం లాంటి కార్యక్రమాలను నిర్వహించామని, భగవంతుడిని భక్తుల చెంతకే తీసుకువెళ్లామని వివరించారు.


స్వామీజీల సూచనలతోనే ఎస్వీబీసీ ఛానల్ ఏర్పాటు చేసి ధర్మ ప్రచారానికి కొత్త అధ్యాయం ప్రారంభించామని గుర్తు చేశారు. వేద పరిరక్షణ కోసం వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామన్నారు. అంతకుముందు తిరుమల శ్రీవారిని చినజీయర్ స్వామి, కుక్కే సుబ్రహ్మణ్య పీఠాధిపతి విద్యాప్రసన్న తీర్థులు, వ్యాసరాజ మఠం పీఠాధిపతి విద్యాతీర్థ స్వామి, సత్యానంద ఆశ్రమం శ్రీహరి తీర్ధానంద స్వామి, విశ్వగురు ఆశ్రమం విశ్వయోగి స్వామి, కడప బ్రహ్మంగారి మఠం విరజానంద స్వామి తదితరులు దర్శించుకుని ధార్మిక సదస్సులో పాల్గొన్నారు.

Latest News