విధాత: భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేశారు. బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ రాజీనామాను ఆమోదించారు కూడా. ఓ ప్రముఖ టీవీ చానల్ స్టింగ్ ఆపరేషన్‌లో టీమిండియా ప్లేయర్ల ఫిట్నెస్‌కు సంబంధించి చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఈ నెల 14న విడుదలైన ఈ వీడియోలో టీమిండియా ప్లేయర్లు ఫిట్నెస్ లేకపోయినప్పటికీ ఇంజెక్షన్లు వేసుకుని ఆడుతున్నారని శర్మ అన్నారు. ఈ విషయం బీసీసీఐ పెద్దలకూ తెలుసని, అయినప్పటికీ చూసీచూడనట్టు ఊరుకుంటున్నారని చెప్పారు. జట్టులోని అగ్రశ్రేణి ఆటగాళ్లూ ఇంజెక్షన్లతోనే ఫిట్నెస్ తెచ్చుకుంటారని శర్మ పేర్కొనడం గమనార్హం.
అలాగే టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మధ్య గొడవలు, జస్ప్రిత్ బుమ్రా గాయం తదితర అంశాల గురించీ ఈ స్టింగ్ ఆపరేషన్‌లో శర్మ మాట్లాడారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం పెద్ద దుమారాన్నే రేపుతున్నది.
ఈ ఏడాది జనవరిలోనే చీఫ్ సెలెక్టర్ పదవిలోకి 57 ఏండ్ల శర్మ వచ్చారు. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో ఓటమి నేపథ్యంలో గత ఏడాది నవంబర్‌లో మొత్తం సెలక్షన్ కమిటీని రద్దు చేసిన సంగతి విదితమే. కాగా, 1984 నుంచి 1994 మధ్య భారత్ తరఫున 23 టెస్టు మ్యాచ్‌లు, 65 వన్డే మ్యాచ్‌లను శర్మ ఆడారు.