కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నం

కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా మారిందని రూ. లక్ష బిల్లు చెల్లించాలంటే ఆలోచించే పరిస్థితి నెలకొందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి అన్నారు

  • Publish Date - February 29, 2024 / 08:43 AM IST

  • రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి బాధ్యతల స్వీకరణ

విధాత, హైదరాబాద్‌ : కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా మారిందని రూ. లక్ష బిల్లు చెల్లించాలంటే ఆలోచించే పరిస్థితి నెలకొందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి అన్నారు. గురువారం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడిన నిరుద్యోగ యువతను కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. ఉద్యోగ నియామకాల విషయంలోనూ బీఆరెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు.


రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ తన వ్యక్తిగత ప్రతిష్టకు పోయి, కమిషన్లు లక్ష్యంగా ఖజానాపై భారం మోపే పనులు చేపట్టి ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారన్నారు. గతంలో జరిగిన పనులకు సంబంధించి సుమారు రూ.40.వేల కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్నారు.


గొర్రెలు, ఆవుల పంపిణీ పథకాల్లో సైతం బీఆరెస్ నేతలు చేతి వాటం ప్రదర్శించారని విమర్శించారు. గతంలో ప్రతిపాదించి ఆచరణకు నోచుకోని ప్రాజెక్టులను మా ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. ప్రాజెక్టుల పేరుతో భారీ అవినీతికి పాల్పడిన బీఆరెస్ నేతలు ఏముఖం పెట్టుకుని కాళేశ్వరం సందర్శనకు వెళ్తున్నారని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా దక్కడంలేదన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు పూర్తి కాకముందే నాలుగు గ్యారంటీలను అమలు చేశామని.. లోక్‌సభ ఎన్నికల కోడ్ రాకముందే మిగిలిన హామీలనూ అమలు చేస్తామని తెలిపారు. తమ సమస్యలను ప్రజావాణిలో చెప్పేందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు అవకాశం కల్పించారని చిన్నారెడ్డి తెలిపారు. ప్రజావాణి ఇంచార్జీగా తనపై సీఎం గురుతర బాధ్యత ఉంచారన్నారు. ఇప్పటి వరకు 4.90లక్షల అర్జీలు వచ్చాయని చెప్పారు. వీటిలో నాలుగు లక్షలు సమస్యలను పరిష్కరించే దిశగా ఉన్నాయన్నారు.

Latest News