విధాత, ఉమ్మడి నల్గొండ: జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికి మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట మినహా మిగతా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ నాయకులతో టికెట్ల పంచాయతీ జోరుగా సాగుతుంది. ముఖ్యంగా నకిరేకల్(ఎస్సీ రిజర్వుడ్) నియోజకవర్గంలో బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశల మధ్య సాగుతున్న వైరం రోజురోజుకు తీవ్ర మవుతుంది.
లింగయ్య, వీరేశంలు మధ్య సాగుతున్న మాటల యుద్ధం బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వర్గ పోరుకు మరింత ఆజ్యం పోస్తుంది. తాజాగా లింగయ్య ఒక అడుగు ముందుకేసి అసలు వేముల వీరేశంకు బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వమే లేదని, ఇక ఆయనకు టికెట్ ఎట్లా వస్తుందంటూ ఘాటు వాఖ్యలు చేశారు. మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ ఒకసారి, ఎంపీగా పోటీ చేస్తానని ఇంకోసారి, మంత్రి అవుతానంటూ మరోసారి కేడర్‌లో గందరగోళం రేపుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.
సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ఆశీస్సులు తనకే ఉన్నాయని, వారి సహకారంతో నియోజక వర్గంలో తాను చేస్తున్న అభివృద్ధి పనుల పట్ల ప్రజల్లో ఆదరణ లభిస్తుందన్నారు. అదే సమయంలో వీరేశం ఎమ్మెల్యేగా ఉన్న నాలుగేళ్ల కాలంలో సాగించిన అవినీతి, భూకబ్జాలు, అరాచకాలు నియోజకవర్గ ప్రజలు మర్చిపోలేదంటూ జనానికి మరోసారి గుర్తు చేస్తూ లింగయ్య పదేపదే చేస్తున్న వాఖ్యలు వీరేశంకు రాజకీయంగా మింగుడుపడనివిగా మారాయి.
తనపై చిరుమర్తి చేసిన వాఖ్యలను దీటుగా తిప్పికొట్టేందుకు వీరేశం కూడా అదునుకోసం ఎదురు చూస్తూ ఉండడంతో వీరి మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు మునుమందు మరెంత దూరం వెళుతుందోనన్న ఆందోళన కేడర్లో వినిపిస్తుంది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న వీరేశంకు సభ్యత్వం లేదంటూ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే చిరుమర్తి వ్యాఖ్యానించడం పట్ల వీరేశం వర్గీయులు భగ్గుమంటున్నారు. సభ్యత్వం లేకపోతే పార్టీ ప్లీనర్ కి వీరేశంను ఎలా ఆహ్వానిస్తారని, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లు ఎలా కలుస్తారంటూ లింగయ్య వ్యాఖ్యలను తిప్పి కొడుతున్నారు.
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన చిరుమర్తి లింగయ్య 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం చేతిలో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ నుండి పోటీ చేసి వేముల వీరేశంపై గెలిచిన లింగయ్య ఎన్నికల అనంతరం బిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇక్కడి నుంచి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నిట్టనిలుగా వీరేశం, లింగయ్య వర్గాలుగా చీలిపోయింది. వారిద్దరూ నియోజకవర్గం పార్టీ రాజకీయాల్లో ఆదిపత్యం కోసం సాగిస్తున్న పోరాటంతో ఒకే పార్టీకి చెందిన కార్యకర్తలు రెండు గ్రూపులై ప్రత్యర్థులుగా మారిపోయారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎవరికి నకిరేకల్ టికెట్ ఇస్తారన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొనగా టికెట్ కోసం లింగయ్య, వీరేశలు ఇద్దరు కూడా ఇప్పటినుంచే బలప్రదర్శనలకు దిగుతుండటంతో నియోజకవర్గ బీఆర్ఎస్ రాజకీయాలు నిత్యం హాట్ హాట్ గా సాగుతున్నాయి. తీవ్రవాద ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వేముల వీరేశం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించారు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక నేరుగా 2014ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన వీరేశం సహజ ధోరణిలో తనదైన దూకుడు వైఖరితో రాజకీయాలలో వేసిన తప్పటడుగులతో వివాదస్పదమయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి పిదప తన రాజకీయ గమనంపై అంతర్మధనం చేసుకున్న వీరేశం గతానికి భిన్నంగా దూకుడు రాజకీయాలను పక్కన పెట్టి వ్యూహాత్మక రాజకీయాలపై దృష్టి పెట్టారు.
అయినప్పటికీ గతంలో ఆయన అనుసరించిన విధానాలను చిరుమర్తితో పాటు ఇతర రాజకీయ ప్రత్యర్థులు పదేపదే గుర్తు చేస్తూ ఉండడం వీరేశంకు సమస్యాత్మకంగా తయారవుతుంది. కాగా మంత్రి జగదీష్ రెడ్డి 2018 ఎన్నికల దాకా తనకు అత్యంత సన్నిహితుడైన వేముల వీరేశంకు జిల్లా రాజకీయాల్లో పెద్ద దిక్కుగా నిలిచారు. గత ఎన్నికల్లో వీరేశం ఓటమిపాలవ్వడం, చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్‌లో చేరిన పరిణామాల క్రమంలో నెమ్మదిగా లింగయ్య మంత్రి జగదీశ్ రెడ్డికి దగ్గరయ్యారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మరోసారి నకిరేకల్ టికెట్ కోసం పోటీపడుతున్న వీరేశం, లింగయ్యలలో మంత్రి జగదీష్ రెడ్డి ఏవరికి మద్దతుగా నిలుస్తారన్న అంశంతో పాటు సీఎం కేసీఆర్ టికెట్ ఎవరికి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ టికెట్ దక్కని వారు అదే పార్టీలో ఉంటారా లేక మరో పార్టీ నుంచి టికెట్ సాధించి పరస్పరం మళ్లీ ఎన్నికల్లో తలపడతారో లేదోనన్న విషయంపై వేచిచూడాల్సివుంది.
ఇదిఇలా ఉండగానే ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ కావడం నకిరేకల్ రాజకీయాలను మరింత వేడెక్కిస్తుంది. లింగయ్య ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా నియోజకవర్గంలోని బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తికి, ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లుగా వెల్లడించారు. అయితే ఈ భేటీలో నియోజకవర్గంలో తనకు వేముల వీరేశం తో ఎదురవుతున్న పంచాయితీ ని కూడా సీఎం కేసీఆర్ దృష్టికి లింగయ్య తీసుకెళ్లి ఉండవచ్చు అన్న చర్చ సైతం గులాబీ వర్గాల్లో వినిపిస్తుంది.