విధాత, బ్యూరో మెదక్ ఉమ్మడి జిల్లా: జిల్లాలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని లబ్ధిదారులకు గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ, విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. క్రిస్మస్ పండుగ నిర్వహణను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీ, విందు భోజనం ఏర్పాట్లకు చేపట్టాల్సిన చర్యలపై మైనార్టీ సంక్షేమ అధికారి, ఆర్డీవోలు, తాసిల్దారులతో బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి డాక్టర్ శరత్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని అర్హులైన లబ్ధిదారులకు గిఫ్ట్ ప్యాకెట్లు అందించి విందు కార్యక్రమం నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.8 లక్షలు, 4 వేల గిఫ్ట్ పాకెట్లు ఇచ్చిందని తెలిపారు. జిల్లాలోని సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్ , ఆందోల్ నియోజకవర్గాలలో గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీకి గాను ప్రతి నియోజకవర్గానికి 1000 గిఫ్ట్ ప్యాకెట్లు, అలాగే విందు భోజనాల నిమిత్తము నియోజకవర్గానికి రూ. 2 లక్షల చొప్పున నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
గిఫ్ట్ పాకెట్ల పంపిణీకి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని తెలిపారు. ఎంపికలో అనాథలు, వితంతువులు, దివ్యాంగుల కుటుంబాలకు, హెచ్ఐవి ప్రభావిత వ్యక్తులకు, నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా క్రిస్మస్ వేడుకల నిర్వహణ కమిటీ సభ్యులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. క్రిస్మస్ వేడుకల విందు నిర్వహణ, గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ సాఫీగా జరిగేలా ముందస్తుగా తాసిల్దార్లు చర్చిల పాస్టర్లతో సమావేశాలు నిర్వహించుకొని ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.
పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీలో ప్రోటోకాల్ ను తప్పక పాటించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆర్డీవోలు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి, తహసీల్దారులు తదితరులు పాల్గొన్నారు.