విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజాస్వామ్యన్నీ ఖూనీ చేసి రాచరిక వ్యవస్థ నడుపుతున్నారని బీజేపీ నేత, చేరికల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. గురువారం జహీరాబాద్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రులు, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి ముందస్తు కార్యక్రమాలు, పర్యటనలు చేయకుండా ముందస్తు అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన వ్యవసాయ రుణ మాఫీ, నిరుద్యోగ భృతి , పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు లాంటి హామీలను అమలు చేయకుండా, మ్యానిఫెస్టోను తుంగలో తొక్కారని మండి పడ్డారు. ప్రజలను ఎన్నడూ కలవని ముఖ్యమంత్రి, ఏ మంత్రి సొంతంగా నిర్ణయాలు తీసుకొనివ్వని ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన విమర్శించారు.
2014 లో 10,700 ఉన్న ఆబ్కారీ శాఖ ఆదాయాన్ని, బెల్ట్ షాపుల ద్వారా అమాంతంగా పెంచి రాష్ట్రాన్ని కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ ఎస్ ప్రభుత్వం నడుపుతోందన్నారు. ధనిక రాష్ట్రమని చెప్తున్న కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో నెంబర్ వన్, తాగుట్లో నెంబర్ వన్, ప్రజలను మోసం చేయడంలో నెంబర్ వన్ గా నిలిపారని ఆరోపించారు.
చెరుకు, వరి లాంటివి కొనుగోలు చేయకుండా రైతాంగాన్ని ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని, ఎన్నికల వేడి పుట్టగానే తమ పార్టీ బీఆర్ ఎస్ పార్టీకి బొంద పెట్టడం ఖాయమని ఒక ప్రశ్నకు సమధానమిచ్చారు.
తమ పార్టీకి తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అసెంబ్లీ కన్వీనర్ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి జగన్నాథ్, నాయకులు సుధీర్ బండారి, శ్రీనివాస్ గుప్తా, సుధీర్ కుమార్, సి.బాల్ రాజ్, పూల సంతోష్, విశ్వనాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.