" /> " /> " /> " />

CM Jagan | చంద్రబాబు అష్ట దిగ్బందం.. జగన్‌ ఎన్నికల సేన! 11.63 ల‌క్ష‌ల మందితో భారీ ప్ర‌చార‌ సైన్యం – vidhaatha

CM Jagan | చంద్రబాబు అష్ట దిగ్బందం.. జగన్‌ ఎన్నికల సేన! 11.63 ల‌క్ష‌ల మందితో భారీ ప్ర‌చార‌ సైన్యం

'జ‌గ‌న‌న్న సుర‌క్ష' పేరిట ఎన్నికల ప్ర‌చారంలోకి జూలై 1 నుంచి నెల‌పాటు గ్రామాల్లో క్యాంపులు చంద్ర‌బాబు అష్ట‌ దిగ్బంధానికి పక్కా ప్రణాళిక సింహం సింగ‌ల్‌గా అంటూనే భారీ సైన్యంతో ఢిల్లీలోని ప్రభుత్వ పెద్ద‌ల‌తో అదే విన‌యం ఐదు ద‌శ‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లకు ప్రయత్నం రెండోసారి అధికారం కోసం ఎందాకైనా రె'ఢీ' "ఈ రోజు యుద్ధం జ‌రుగుతా ఉన్న‌ది. మాట ఇస్తే, మాట మీద నిల‌బ‌డే మీ బిడ్డ ఒక‌ వైపు.. వెన్నుపోట్లు, మోసాలు మ‌రోవైపు ఉండే యుద్ధం […]

  • Publish Date - June 27, 2023 / 01:58 AM IST
  • ‘జ‌గ‌న‌న్న సుర‌క్ష’ పేరిట ఎన్నికల ప్ర‌చారంలోకి
  • జూలై 1 నుంచి నెల‌పాటు గ్రామాల్లో క్యాంపులు
  • చంద్ర‌బాబు అష్ట‌ దిగ్బంధానికి పక్కా ప్రణాళిక
  • సింహం సింగ‌ల్‌గా అంటూనే భారీ సైన్యంతో
  • ఢిల్లీలోని ప్రభుత్వ పెద్ద‌ల‌తో అదే విన‌యం
  • ఐదు ద‌శ‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లకు ప్రయత్నం
  • రెండోసారి అధికారం కోసం ఎందాకైనా రె’ఢీ’

“ఈ రోజు యుద్ధం జ‌రుగుతా ఉన్న‌ది. మాట ఇస్తే, మాట మీద నిల‌బ‌డే మీ బిడ్డ ఒక‌ వైపు.. వెన్నుపోట్లు, మోసాలు మ‌రోవైపు ఉండే యుద్ధం జ‌ర‌గ‌బోతా ఉంది. ఇవాళ్టి యుద్ధంలో మీ బిడ్డ‌కు ఉన్న‌ద‌ల్లా దేవుడి ద‌య‌, మీ అంద‌రి చ‌ల్ల‌ని దీవెన‌లే. మీ బిడ్డ‌కు పొత్తుల్లేవు. మీ బిడ్డ వాళ్ల‌మీద వీళ్ల మీద నిల‌బ‌డ‌డు. మీ బిడ్డ ఒక్క‌డే సింహంలా నిలుస్తాడు‘.. ఇదీ ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి (CM Jagan) ఇటీవ‌ల బ‌హిరంగ‌స‌భ‌ల్లో త‌ర‌చూ చెబుతున్న మాట‌. కానీ రెండోసారి అధికారంలోకి రావ‌డానికి తెర‌వెనుక జ‌గ‌న్ పెద్ద మాస్టర్‌ ప్లానే వేశార‌ని తెలుస్తున్నది. ఒక్కడు కాదని.. ఏకంగా 11.63 లక్షల మందితో ఎన్నికల యుద్ధానికి వెళ్లబోతున్నారని సమాచారం.

(విధాత ప్రత్యేక ప్రతినిధి)

తెలుగుదేశం పార్టీని రాజ‌కీయంగా స‌మాధి చేయ‌డానికి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది క్రితం నుంచే ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఉన్నారా? ఒక‌వైపు కేంద్రంతో స‌యోధ్య‌గా ఉంటూనే, మ‌రోవైపు రాష్ట్రంలో బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షాన్ని దెబ్బ‌కొట్టేందుకు భారీ స్కెచ్ వేశారా? అంటే.. రాజకీయ పరిశీలకులు అవుననే అంటున్నారు. 2024 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడుని అష్ట‌దిగ్భంధ‌నం చేసి, తిరిగి అధికారం చేప‌ట్టేందుకు ‘ఎందాకైనా’… రె “ఢీ” అయిపోయిన‌ట్లు జ‌గ‌న్ ఇటీవల ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పిన లెక్క‌ల‌ను బ‌ట్టి అర్థ‌మైపోతోందని చెబుతున్నారు.

చంద్ర‌బాబు అష్ట‌దిగ్భంధ‌నం!

తెలుగుదేశం పార్టీని, చంద్ర‌బాబును 2024 ఎన్నిక‌ల్లో నిలువ‌రించేందుకు వైఎస్ జ‌గ‌న్ అష్ట‌దిగ్బంధ‌నం అమ‌లు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇందుకోసం ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల స‌హ‌కారం, ఆశీస్సులు కూడా తీసుకున్న‌ట్లు ఢిల్లీ నుంచి స‌మాచారం అందుతోంది. ఏపీలో ఒకేసారి ఎన్నికలు జ‌ర‌గ‌కుండా, ఐదు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే చంద్ర‌బాబును అన్ని విధాలుగా దెబ్బ‌కొట్టేందుకు వీలుంటుంద‌ని జ‌గ‌న్ బీజేపీ పెద్ద‌ల భేటీలో చెప్పిన‌ట్లు స‌మాచారం.

గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌టీఫ్ చేసుకున్నందుకు చంద్ర‌బాబుకు భారీ దెబ్బే త‌గిలింది. టీడీపీకి కార్పొరేట్ ఎన్నిక‌ల విరాళాలు అంద‌కుండా కేంద్ర నిఘా సంస్థ‌ల‌ను రంగంలోకి దింపార‌ని, అధికారంలో ఉండి కూడా ఓటర్ల‌కు డ‌బ్బు, మ‌ద్యం పంపిణీల‌కు టీడీపీ బాగా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింద‌ని ఆ పార్టీ నేత‌లు చాలా సంద‌ర్భాల్లో ఏక‌రువు పెట్టారు. ‘త‌న‌కు బాగా ద‌గ్గ‌రైన పారిశ్రామిక‌వేత్త‌లు, త‌న ప్రభుత్వంలో వివిధ ర‌కాలుగా ల‌బ్ధిపొందిన‌వారు నాతో మాట్లాడాలంటే భ‌య‌ప‌డే వాతావ‌ర‌ణం క‌ల్పించారు.

కేంద్ర ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు. సీబీఐ, ఈడీ వంటి ద‌ర్యాప్తు సంస్థ‌ల అధికారుల‌తో వారికి ఫోన్ చేయించి చంద్ర‌బాబుకు సాయం చేస్తే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని బెదిరించారు. ఒక ఆత్మీయ పారిశ్రామిక వేత్త‌కు స్వ‌యంగా నేనే 24 సార్లు కాల్ చేశాను. ఆయ‌న కాల్ ఎత్త‌క‌పోగా, ఈ నాలుగేళ్ల‌లో కనీసం తిరిగి కాల్ చేయ‌లేదు.. మెసేజ్ కూడా ఇవ్వ‌లేదు.

2024 ఎన్నిక‌ల్లో కూడా ఇలాగే అష్ట‌దిగ్బంధ‌నం చేయాల‌ని కేంద్రానికి మొర‌పెట్టుకున్నార‌ని మ‌న‌కు ప‌క్కా స‌మాచారం ఉంది’ అంటూ చంద్ర‌బాబు ఆ మ‌ధ్య‌ ఒక సీనియ‌ర్ పాత్రికేయుడితో చెప్పారని తెలిసింది. అది నిజ‌మే అన్న‌ట్లే 2019 ఎన్నిక‌లు జ‌రిగాయి.

ప్ర‌తిపక్షంలో ఉన్న‌ వైసీపీ సునాయాసంగా ఎల‌క్ష‌నీరింగ్ చేసుకుందని, దీంతో 23 సీట్ల‌కు ప‌రిమిత‌మ‌య్యామ‌ని టీడీపీ నేత‌లు వాపోయారు. ఈసారి కూడా టీడీపీకి ఇలాంటి అడ్డంకులే సృష్టించాల‌ని, కాక‌పోతే అవి మ‌రింత క‌ఠినంగా ఉండాల‌న్న‌ది జ‌గ‌న్ ఆలోచ‌న‌గా చెబుతున్నారు. ఇందుకు కేంద్రం మద్ద‌తు కోరిన‌ట్లు, వారు కూడా ప‌రోక్షంగా అభ‌య‌మిచ్చిన‌ట్లు తెలుగుదేశం వ‌ర్గాలు ఆరోపిస్తున్నాయి.

ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ చెప్పిన వ్యూహం ఇదీ!

ఇటీవ‌ల వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పార్టీ ఎమ్మెల్యేల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈసారి ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌నే ల‌క్ష్యంతో ఈ స‌మావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ గెల‌వ‌డానికి ఏమేమి చేయాలో, ఎవ‌రెవ‌రికి ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ ఉందో, ఎవ‌రెవ‌రికి టికెట్లు ఇవ్వ‌డం లేదో చెప్ప‌డానికి 151 మంది పార్టీ ఎమ్మెల్యేల‌తో విజయవాడలో ప్రైవేటు స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలోనే జ‌గ‌న్ ప్ర‌స్తుతానికి 18 మంది ఎమ్మెల్యేల‌కు టికెట్ ఇవ్వ‌డం లేద‌ని కరాఖండీగా చెప్పేశారని తెలిసింది.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యేల‌ను ఉద్దేశించి జ‌గ‌న్ మాట్లాడిన వీడియో ఒక‌టి లీక్ అయింది. ఆ వీడియో ప్ర‌కారం.. జూలై ఒక‌టి నుంచి ఏపీలో మొద‌లుపెట్ట‌బోయే జ‌గ‌న‌న్న సుర‌క్ష కార్య‌క్ర‌మంతో వైసీపీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని మొదలుపెట్టేయ‌నుంది.

ఈ కార్య‌క్ర‌మం పేరుతో 2 ల‌క్ష‌ల 60 వేల‌మంది వాలంటీర్లు, ల‌క్షా 50 వేల మంది స‌చివాల‌య సిబ్బంది, 3వేల మంది మండ‌ల స్థాయి అధికారులు, 7 ల‌క్ష‌ల 50 వేల‌ మంది వైసీపీ గృహ సార‌థులు, వీరికి మార్గ‌ద‌ర్శ‌నం చేయ‌డానికి వీలుగా 26 మంది ఐఏఎస్ అధికారులు జ‌గ‌న‌న్న సుర‌క్ష పేరుతో 30 రోజుల పాటు ప్ర‌జ‌ల్లో ఉండబోతున్నారు.

11 ర‌కాల సేవ‌ల‌తో మొత్తం 11 ల‌క్ష‌ల‌ 63 వేల మంది భారీ సైన్యంతో రాష్ట్రంలోని కోటీ 60 ల‌క్ష‌ల కుటుంబాల‌ను ప్ర‌త్య‌క్షంగా క‌లుసుకోబోతున్నారు. వీరితోపాటు ఎమ్మెల్యేలు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, వైసీపీ నాయ‌కులు ప్ర‌తి కుటుంబాన్ని జ‌ల్లెడ‌ప‌ట్ట‌నున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం చేసిన ‘మేళ్లు’ గురించి వివ‌రించ‌బోతున్నారు.

మొత్తంగా ప్ర‌భుత్వ డ‌బ్బుతో పార్టీ ప్ర‌చార కార్య‌క్ర‌మం నెల‌రోజుల‌పాటు దిగ్విజ‌యంగా జ‌ర‌గ‌బోతోంది. ‘స‌రిగ్గా ఈ ప‌ద్ధ‌తిలోనే వైసీపీ ఎన్నిక‌ల ప్ర‌చారం, పంపిణీ కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్నాయి. తెలుగుదేశం పార్టీ జ‌న‌సేన‌తో క‌లిసి అధికారం చేప‌ట్టాల‌ని క‌ల‌లు కంటోంది. జ‌గ‌న్ ఏమో త‌న భారీ సైన్యంతో ఇప్ప‌టికే రంగంలోకి దిగిపోయారు’ అని ఒక రాజ‌కీయ ప‌రిశీల‌కుడు విశ్లేషించారు.

ఏమిటీ జ‌గ‌న‌న్న సుర‌క్ష కార్య‌క్ర‌మం?

సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు సంతృప్త స్థాయిలో పరిష్కారించే లక్ష్యంగా.. నెలరోజుల పాటు రాష్ట్రంలోని ప్ర‌తి ఊర్లో ఒక క్యాంపు ఏర్పాటు చేసే కార్య‌క్ర‌మ‌మే జ‌గ‌నన్న సుర‌క్ష. జూలై ఒక‌టి నుంచి అంటే శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1.6 కోట్ల కుటుంబాలతో మమేకం కావ‌డానికి 15,004 సురక్ష క్యాంపుల నిర్వహిస్తున్నారు.. ‘1902’తో హెల్ప్‌ డెస్క్‌ కూడా ఏర్పాటు చేశారు.

ప్రభుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌కు ఏ ఒక్క‌రైనా అర్హ‌త ఉండి అవ‌కాశం పొంద‌క‌పోతే, ఈ క్యాంపుల్లో న‌మోదు చేసుకోవ‌చ్చు. అర్హులై ఉండి ఏ ఒక్కరూ లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదన్న ల‌క్ష్యంతో చేప‌ట్టిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ‘జగనన్న సురక్ష’ కార్య‌క్ర‌మాన్ని రూపొందించిన‌ట్లు సీఎం జ‌గ‌న్ చెబుతున్నారు.

ఈ ప్రత్యేక క్యాంపుల ద్వారా ఆదాయం, కులం, జ‌న‌న‌, మ‌ర‌ణ‌ ధ్రువీకరణ పత్రాలు, కొత్త రేషన్‌ కార్డులు, సీసీఆర్సీ కార్డులు, ఆధార్‌కు బ్యాంక్‌ లింకేజీ, ఆధార్‌ కార్డుల్లో మార్పులు వంటి 11 రకాల సేవ‌లు ఉచితంగా అందించనున్నారు. ఈ పేరుతో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులతో కూడిన టీమ్‌ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటినీ సందర్శిస్తుంది.

ప్ర‌జ‌ల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు. ఈ దరఖాస్తులను సచివాలయానికి తీసుకెళ్లి న‌మోదు చేస్తారు. టోకెన్‌ నంబర్, సర్వీస్‌ రిక్వెస్ట్‌ నంబరు తీసుకుని వాటిని తిరిగి ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తారు. దేశ చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ చూడని విధంగా పేదల పట్ల ఇంతగా ప్రేమ చూపిస్తున్న ప్రభుత్వం ఏదీ లేదంటున్న సీఎం జ‌గ‌న్‌… ఈ పేరుతో ఎన్నిక‌ల ప్ర‌చారం మొదలు పెట్టబోతున్నారని పరిశీలకులు అంటున్నారు.