ఏపీ ఎమ్మెల్యేల్లో గుబులు.. తాడేపల్లి క్యాంపు ఆఫీస్‌కు పరుగులు

పలువురు సిటింగ్‌లను మార్చడంతోపాటు.. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఏపీ సీఎం జగన్‌ భావిస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టింది.

  • Publish Date - December 27, 2023 / 03:50 PM IST
  • టికెట్ల కోసం ఆశావహుల యత్నాలు
  • జగన్ పిలుపుతో నాయకుల క్యూ

విధాత : రానున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే దిశగా పలువురు సిటింగ్‌లను మార్చాలని వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌. జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న కసరత్తు వైసీపీలో అంతర్గత రాజకీయాలను హీటెక్కిస్తున్నది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల ఇంచార్జీలను మార్చిన జగన్.. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ మార్పు చేయాలని నిర్ణయించకున్నారు. సిటింగ్‌లపై వ్యతిరేకతతో పార్టీ నష్టపోరాదన్న ఆలోచనతో ఇంచార్జీలను, ఎమ్మెల్యేలను మార్చే ఆలోచనకు వచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం నుంచి పిలుపు రావడంతో పలువురు ఎమ్మెల్యేలు బుధవారం తాడేపల్లి క్యాంఫు ఆఫీస్‌కు పరుగులు పెట్టారు. సీఎం కార్యాలయానికి వచ్చిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిలు ఉన్నారు.


సీటు మార్పు విషయంపై ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు కొందరు సీఎంఓ అధికారి ధనుంజయరెడ్డిని కలుస్తున్నారు. మరోసారి తమకు అవకాశం ఇవ్వాలని పలువురు ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఎమ్మెల్యేల గ్రాఫ్ వివరించి, సీట్ల మార్పుపై వారితో వైసీపీ ముఖ్య నేతలు చర్చిస్తున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బొత్స, అయోధ్య రామిరెడ్డి, తిప్పేస్వామిలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావును రాజ్యసభకు పంపించాలని జగన్ నిర్ణయించారని సమాచారం. వచ్చే ఫిబ్రవరిలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నందున ఒక దాన్ని బాబురావుతో భర్తీ చేయాలని జగన్ యోచిస్తున్నారని తెలుస్తున్నది. ఇదే పద్ధతిలో నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, సిటింగ్‌ల మార్పులతో తలెత్తనున్న అసమ్మతిని చల్లార్చేందుకు, అసంతృప్తులను బుజ్జగించేందుకు ఎంపీలుగా, ఎమ్మెల్సీల పదవులతో సర్దుబాటు చేయాలని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు.

పార్టీలో రేగుతున్న నిరసన సెగలు

వైసీపీ పార్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల మార్పునకు సీఎం జగన్ సీరియస్‌గా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఆశావహులు తమ డిమాండ్లను అధినేత ముందు పెట్టేందుకు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు తమకు టికెట్ దక్కన్న ఆలోచనతో పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గొల్ల బాబూరావు, బియ్యపు మధుసూధన్, కదిరి, పెనుగొండ, రాజాం ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. తన కుమారుడు హితేశ్‌కు చీరాల బరిలో నిలుపాలన్న ఆలోచనకు వైసీపీ నుంచి మొండిచేయి ఎదురవుతుందన్న ఆలోచనతో దగ్గుబాటు వెంకటేశ్వర్‌రావు వైసీపీకి వ్యతిరేకంగా గొంతెత్తారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముందు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి వ్యతిరేక వర్గం ఆందోళనకు దిగింది. ఈ ఎమ్మెల్యే మాకు వద్దు అంటూ నినదించారు. మరోవైపు ప్రకాశం జిల్లా నేతలకు బుజ్జగింపుల పర్వం కొనసాగుతున్నది. జిల్లా నేతలు, పలువురు కొత్త, పాత ఇన్‌చార్జ్‌లతో సైతం విజయసాయిరెడ్డి సమావేశం అయ్యారు. సమన్వయం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టే యోచనలో వైసీపీ అనంతపురం సత్యసాయి జిల్లా నేతలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. జగ్గంపేట వైసీపీ టికెట్ తనకే వస్తుందని, సర్వేల ఆధారంగా టికెట్ల కేటాయింపులు ఉంటాయని తోట నరసింహం చెబుతున్నారు. పార్టీ ఆదేశిస్తే జ్యోతుల చంటిబాబుతో కలిసి పని చేస్తానన్నారు. కాగా అనారోగ్య కారణాలతోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు ప్రకటించడం చర్చనీయాంశమైంది. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేనలో చేరడంతో వైసీపీ నుంచి ఎన్నికల ముందు వలసల పర్వం మొదలైందని ప్రతిపక్షాలు సంబర పడుతున్నాయి. మరోవైపు రాజకీయ పార్టీలో అంతర్గత అసంతృప్తులు మామూలేనని, అసంతృప్తులు, పోటీలు, ఆందోళనలు లేకపోతే అది చెల్లని పార్టీ అనుకుంటారని వైసపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ అంతర్గత అసమ్మతిని కొట్టిపారేశారు.