Site icon vidhaatha

CM Jagan | ప్రారంభమైన సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర

గుడివాడలో సిద్ధం సభ
దాడులు ఆపలేవన్న సీఎం జగన్‌

విధాత : ఏపీ అసెంబ్లీ , పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర తిరిగి ప్రారంభమైంది. సింగ్‌నగర్‌లో బస్సుయాత్రలో జగన్‌పై జరిగిన రాయి దాడిలో కంటిపై భాగాన గాయానికి చికిత్స తీసుకున్న జగన్ ఒక రోజు బస్సుయాత్రకు బ్రేక్ ఇచ్చారు.

అనంతరం సోమవారం నుంచి బస్సుయాత్ర తిరిగి కొనసాగుతుండగా, జగన్‌ను చూసేందుకు ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున బస్సుయాత్ర మార్గంలో తరలివస్తున్నారు. కంటిపై భాగన తగిలిన గాయానికి ఫ్లాస్టర్‌తో జగన్ బస్సుయాత్రలో కొనసాగిస్తున్నారు. కేసరపల్లికి భారీగా వచ్చిన అభిమానులు జగన్‌కు ఘన స్వాగతం పలికారు. బస్సు మెట్ల కూర్చుని ప్రజల సమస్యలు విన్నారు. సాయంత్రం గుడివాడ వద్ధ బస్సుయాత్ర సభ నిర్వహించనున్నారు.

జగన్ బస్సు యాత్రకు భారీ బందోబస్తు

మొన్న విజయవాడలో దాడి జరిగిన నేపథ్యంలో సీఎం బస్సు యాత్రకు మూడు అంచెల పోలీస్ భద్రతా ఏర్పాటు చేశారు. సీఎం వెళ్లే మార్గాలు మూడు సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టార్‌కు ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్‌ఐలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు జగన్‌పై దాడికి పాల్పడిన వారి వివరాలు తెలియచేసే వారికి 2లక్షల నగదు బహుమతిని పోలీస్ శాఖ ప్రకటించింది. దాడికి సంబంధించిన వీడియోలు, సెల్‌ఫోన్ రికార్డింగ్‌లు ఏమున్నా తమకు అందించాలని, వివరాలు అందించే వారి పేర్లు గొప్యంగా ఉంచుతామని, నిందితులను పట్టుకునేందుకు సహకరించాలని పోలీసులు తెలిపారు.

దాడులు నన్ను ఆపలేవు

తనపై జరిగిన దాడి పట్ల జగన్ పార్టీ నేతల వద్ధ తొలిసారి స్పందించారు. కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల నేతలతో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతోనే దాడి నుంచి తప్పించుకున్నానని, ఇలాంటి దాడులు నన్ను ఆపలేవని, మనకు దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉందని, ధైర్యంగా అడుగులు ముందుకేద్దామని, ఎవరు అధైర్యంగా పడాల్సిన అవసరం లేదన్నారు. బస్సుయాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి ఒర్వలేని వారే ఈ దాడికి పాల్పడ్డారన్నారు.

Exit mobile version