Site icon vidhaatha

KCR And Jagan | సరిపోయారు ఇద్దరూ.. సాగుతుంది మీకలా..!

KCR And Jagan | అధికార పక్షంగానే కాదు.. ప్రతిపక్ష పాత్రలోనూ అటు ఏపీలో జగన్‌.. ఇటు తెలంగాణలో కేసీఆర్‌ తగ్గేదే లే.. అంటున్నారు. తమది ఒకటే దారి అని చాటుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై మీద ఒంటికాలిపై లేచి, మైకులు ఇవ్వకుండా.. వారిని చీడపురుగుల్లా పరిగణిస్తూ రాజ్యం చేశారు! కట్‌ చేస్తే.. ఇప్పుడు రాజ్యం పోయింది. తెలంగాణలో బీఆరెస్‌కు కనీసం ప్రతిపక్షం హోదా అయినా దక్కింది. కానీ.. ఏపీలో జగన్‌ అందుకు కూడా నోచుకోలేదు! ఇంద్రభవనాన్ని తలపించేలా సచివాలయం కట్టుకున్నా.. అందులో కూర్చొనే భాగ్యం కేసీఆర్‌కు దక్కలేదు. ప్రతిపక్షంగా నిలిచినా.. ప్రతిపక్ష నేత హోదా జగన్‌కు దక్కలేదు. ఇప్పటికీ కేసీఆర్‌ కానీ, జగన్‌ కానీ కిందపడ్డా తమదే పై చేయి అన్నట్టు వ్యవహారం కనిపిస్తున్నదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తమ ప్రత్యర్థులను గుర్తించేందుకు కూడా ఇంకా వారికి మనసొప్పడం లేదని చెబుతున్నారు. ‘ఠాఠ్‌.. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేకానీ అసెంబ్లీకి రాను.. అని జగన్‌ మొండికేశారు. ఇటు కేసీఆర్‌ సైతం నేనేంటి? అసెంబ్లీకి వచ్చి మీ మాటలు వినేదేంటి? అన్న ధోరణిలో ఉన్నారు. ఆయన కొడుకు కేటీఆర్‌ అయితే.. ఆ మాట నేరుగానే చెప్పేశారు. ఇది ప్రజలిచ్చిన తీర్పును గౌరవించడమా? అవమానించడమా?’ అని ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.

మొన్నటిదాకా తాను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన చంద్రబాబు ముందు కూర్చొనేందుకు ఇష్టం లేకనే అసెంబ్లీకి జగన్‌ డుమ్మా కొడుతున్నారన్న వాదనలు ఉన్నాయి. ‘తెలంగాణలో మొన్నటిదాకా రేవంత్‌రెడ్డిని బుడ్డర్‌ఖాన్‌ అంటూ ఆఖరుకు బాడీ షేమింగ్‌కు కూడా నాటి బీఆరెస్‌ నాయకులు పాల్పడ్డారు. రేవంత్‌రెడ్డిని అర్ధరాత్రి ఆయన బెడ్‌రూమ్‌ తలుపులు పగలగొట్టుకొని అరెస్టు చేసిన వీడియోను ఫన్నీగా మార్చేసి సోషల్‌ మీడియాలో దారుణ ట్రోలింగ్‌ చేశారు. అక్కడ ఏపీలో కళ్ల నిండా కసి, ద్వేషం, అహంకారం నింపుకొని అసెంబ్లీలో జగన్‌ సహా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కంట కన్నీరు తెప్పించేంత దుస్సాహసానికి పాల్పడ్డారు. వ్యక్తిత్వ హననాలకు తెగించారు. నోరు తెరిస్తే బూతులే తప్ప మాటలు రాని ఎమ్మెల్యేలతో నానా మాటలు అనిపించారు’ అని ఆయన గుర్తు చేశారు. ‘ఇప్పుడు సీన్‌ తిరగబడిన తర్వాత అసెంబ్లీకి మొహం చూపించేందుకు సైతం అటు జగన్‌, ఇటు కేసీఆర్‌ ఇష్టపడటం లేదు. అలాగని కంప్లీట్‌గా అసెంబ్లీని బాయ్‌కాట్‌ చేశారా? అంటే అదీ కాదు! శాసనసభ సభ్యత్వం పోకూడదు.. కానీ.. అసెంబ్లీకి మాత్రం వచ్చేది లేదు.. అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అంటే ఇది దృఢ నిశ్చయం కానేకాదని తేలిపోతున్నది. ఇదో పెద్ద డ్రామాలానే కనిపిస్తున్నది. మధ్యమధ్యలో అటెండెన్స్‌ వేయించుకుంటే చాలన్న ధోరణితో మేకపోతు గాంభీర్యాలు ఒలికిస్తున్న పరిస్థితిని రెండు రాష్ట్రాల ప్రజలు నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోతున్నారు’ అని ఆయన చెప్పారు.

కేసీఆర్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత 2024 ఫిబ్రవరిలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అప్పటి నుంచి కేవలం రెండుసార్లు ఆయన సభకు హాజరయ్యారు. అటు ఏపీలో జగన్‌ 2024 మధ్యలో పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారే సభకు హాజరయ్యారు. ఫిబ్రవరి 25, 2025న గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగం సమయంలో కాసేపు వచ్చి వెళ్లిపోయారు. వైసీపీ గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్యతో జగన్‌ సభలో ఉన్న సమయాన్ని టీడీపీ నేతలు పోల్చుతూ సెటైర్లు వేశారు.

ఇటు తెలంగాణలో ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్‌కు ఒక గది, దాని బయట నేమ్‌ ప్లేట్‌ కూడా ఉంటుంది. అయితే.. తగిన సంఖ్యాబలం లేని కారణంగా ఏపీలో జగన్‌కు ఆ అదృష్టం దక్కలేదు. ఒక సాధారణ ప్రతిపక్ష పార్టీగానే ఉండాల్సి వస్తున్నది. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా.. అధికార పక్షం నుంచి బలవంతంగానైనా దానిని సాధించుకునే ప్రయత్నాలను వైసీపీ ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు కూడా చేరింది. జగన్‌ను ప్రతిపక్ష నేతగా గుర్తించేలా స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఫ్యాన్‌ పార్టీ నేతలు పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే అధిక సమయం మాట్లాడే అవకాశం వస్తుందని, అది గిట్టకే చంద్రబాబు తనకు ఆ హోదా ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని, తద్వారా తమ గొంతును అణచివేయాలనుకుంటున్నారని జగన్‌ కారాలు మిరియాలు నూరుతున్నారు. అయితే.. ప్రతిపక్ష హోదా ఉండాలంటే కనీసం పదిశాతం సభ్యులను కలిగి ఉండాలనే సంప్రదాయాన్ని అధికార టీడీపీ ప్రస్తావిస్తున్నది. గతంలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 11కు పరిమితమైంది. దీనిని టీడీపీ ప్రభుత్వం సావకాశంగా తీసుకున్నది.

కేసీఆర్‌, జగన్‌ ఇటీవల ముగిసిన బడ్జెట్‌ సమావేశాల్లో ఒక్కసారి మాత్రమే వచ్చారు. దీని వెనుక అనర్హత వేటును తప్పించుకోవడం అనే వ్యూహం ఉన్నదనే చర్చ నడుస్తున్నది. సభకు రానివారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ చేసిన హెచ్చరికలతో అంతదాకా పరిస్థితిని తెచ్చుకోవడం ఇష్టం లేకనే జగన్‌ బడ్జెట్‌ సమావేశాలకు హాజరైనట్టు కనిపిస్తున్నది. సభా కార్యక్రమాలకు వరుసగా 60 రోజులు దూరంగా ఉంటే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 190 ప్రకారం అనర్హత వేటు పడుతుందని డిప్యూటీ సీఎం రఘురామకృష్ణం రాజు ప్రకటించడంతో జగన్‌ సహా డుమ్మా ఎమ్మెల్యేలకు సురుకు తగిలినట్టుంది. మరోవైపు తెలంగాణలో కేసీఆర్‌ సభ్యత్వాన్ని తొలగించాలంటూ ఏకంగా ఫిర్యాదులు చేసేదాకా వెళ్లింది. ప్రభుత్వ డబ్బుతో పదవిని అనుభవిస్తూ అసెంబ్లీకి రాని కేసీఆర్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ విషయం కూడా కోర్టులకు చేరింది. కేసీఆర్‌ అసెంబ్లీకి హాజరై తన విధులను నిర్వర్తించని పక్షంలో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్స్‌కు చెందిన విజయ్‌పాల్‌ రెడ్డి పిల్‌ దాఖలు చేశారు. అయితే.. బీఆరెస్‌ వర్గాలు మాత్రం సమయం కోసం చూస్తున్నారని, తగిన సమయం చూసుకుని రేవంత్‌పై అస్త్రశస్త్రాలతో దాడికి సిద్ధమవుతారని చెబుతున్నాయి. ఇవన్నీ గమనిస్తున్న రెండు రాష్ట్రాల ప్రజలు.. సరిపోయింది మీ ఇద్దరికీ.. సాగుతుంది మీకలా.. అంటూ మూతి వంకర్లు తిప్పుతున్నారు.

Exit mobile version