విధాత: గతంలో ప్రతి ఎన్నికల సభల్లోనూ, ప్రతి సమావేశంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్ప తనాన్ని గురించి, తాను మెదడు రంగరించి, ఇంజినీర్‌గా మారి దానిని రీడిజైన్ చేసిన సంగతుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా చెప్పేవారు. ఇతర మంత్రులు, పార్టీ నేతలు కూడా రాష్ట్రమంతా కాళేశ్వరం నీళ్లే పారుతున్నాయనేంత స్థాయిలో దానిని ప్రచారం చేసేవారు. కానీ.. గురువారం మూడు సభల్లో ముఖ్యమంత్రి పాల్గొంటే.. ఒక్కదాంట్లోనూ కాళేశ్వరం ప్రస్తావన చేయకపోవడం రాజకీయంగా ఆసక్తి రేపింది. ముఖ్యమైన మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సైతం దాని ఊసెత్తడం లేదు.
మేడిగడ్డ పిల్లర్ కుంగిన తర్వాత సీఎం కేసీఆర్ పాల్గొన్న తొలి బహిరంగ సభ అచ్చంపేటలో నిర్వహించినదే. తదుపరి వనపర్తి, మునుగోడులో సైతం కేసీఆర్ మాట్లాడినా.. కాళేశ్వరం ఘనతను చాటేందుకు సిద్ధపడలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. రాహుల్ ఇటీవలి తన పర్యటన సందర్భంగా లక్ష కోట్ల అవినీతి జరిగిందని పునరుద్ఘాటించారు. దీనిపై ఆ మరుసటి రోజే కేటీఆర్ స్పందిస్తూ… అద్భుతమైన ప్రాజెక్టు అని, వెళ్లి కాళేశ్వరాన్ని చూడాలని రాహుల్‌కు సూచించారు. దురదృష్టవశాత్తూ.. మర్నాడే బరాజ్ కుంగింది. ఇది బీఆరెస్‌కు ఊహించని పరిణామంగా మారింది.
ప్రాజెక్ట్ ఎరియల్ సర్వేతో పాటు నిర్మాణ సమయంలో అనేక సార్లు అక్కడికి వెళ్లి పరిశీలించారు. ప్రతి రోజు ప్రగతి భవన్ నుంచి పర్యవేక్షిస్తున్నానని చెప్పే వారు. ప్రగతి భవన్‌కు ఎవరు వెళ్లినా కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేసి చూపించే వారని ప్రచారంలో ఉంది. సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించి నిర్మించిన ప్రాజెక్ట్ 5 ఏళ్లలోనే కుంగిపోయింది. ఈ బ్యారేజీ కుంగి పోవడం అధికార బీఆరెస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లైంది. ఎన్నికల్లో దీనిని కాంగ్రెస్ పెద్ద ఇష్యూ చేసేందుకు సిద్ధపడుతున్నది.
ఈ సమయంలో దానిని అనవసరంగా లేవనెత్తడం కొత్త సమస్యలను తీసుకొస్తుందనే ఉద్దేశంతోనే సీఎం ఈ విషయంలో మౌనం దాల్చి ఉంటారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే క్రమంలో మంత్రులు, పార్టీ నేతలెవరూ దానిపై స్పందించొద్దని ఆదేశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆ విషయాన్ని అధికారులే చూసుకుంటారని, మనం దాని జోలికి పోవద్దని చెప్పినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే దానిని పాటించిన కేసీఆర్ కాళేశ్వరం ఘనతపైన లేదా జరిగిన ఉదంతంపైన ప్రస్తావన తేలేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.