విద్యుత్తు అవకతవకలపై జ్యూడిషియల్ విచారణ

గత ప్రభుత్వ హాయంలో విద్యుత్తు శాఖలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం జ్యూడిషియల్ విచారణకు ఆదేశిస్తుందని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

  • Publish Date - December 21, 2023 / 07:43 AM IST
  • అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన
  • 24గంటల విద్యుత్తు సరఫరా నిగ్గు తేల్చేందుకు అఖిల పక్ష కమిటీ



విధాత: గత ప్రభుత్వ హాయంలో విద్యుత్తు శాఖలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం జ్యూడిషియల్ విచారణకు ఆదేశిస్తుందని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. చత్తీస్ ఘడ్ నుంచి విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపైన, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ఫ్లాంట్ల నిర్మాణ అవకతవకలపైన జ్యూడిషియల్ విచారణకు ఆదేశిస్తున్నామని, దీనిపై విధి విధానాలను డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రకటిస్తారని తెలిపారు.


విద్యుత్తు శాఖ శ్వేత పత్రంపై జరిగిన చర్చలో మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి చర్చను ప్రారంభించారు.చర్చ సందర్భంగా 24గంటల ఉచిత విద్యుత్తును తాము ఇచ్చామని, విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా పెంచామని చెప్పడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోక్యం చేసుకుని అదంతా పచ్చి అబద్ధమని వ్యాఖ్యానించారు. 24గంటల ఉచిత విద్యుత్తు సరఫరా బూటకమని ఇప్పటికే లాగ్ బుక్స్ ద్వారా తాను వెల్లడించానన్నారు. విద్యుత్తు శాఖ మంత్రిగా జగదీశ్ రెడ్డి, సీఎండి ప్రభాకర్‌రావులు భారీ కుంభకోణాలకు పాల్పడ్డారన్నారు.


యాదాద్రి థర్మల్ పవర్ ఫ్లాంటుకు టెండర్ లేకుండా బీహెచ్‌ఈఎల్‌కు ఇచ్చి, సబ్‌కాంట్రాక్టులు అప్పగించారని వెంకట్‌రెడ్డి విమర్శించారు. సబ్ కాంట్రాక్టులలో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు కూడా ఉన్నారన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ఫ్లాంటులో జగదీశ్‌రెడ్డి 20వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని 10వేలు కోట్లు దోచుకుతిన్నాడని, అదంతా తమ ప్రభుత్వం కక్కిస్తుందన్నారు.


మంత్రి వెంకట్‌రెడ్డి ఆరోపణలను ఖండించిన జగదీశ్‌రెడ్డి విద్యుత్తు శాఖలో అవినీతిపై నిరాధారణ ఆరోపణలతో బురద చల్లడం మాని మీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందునా జ్యూడిషియల్ విచారణ జరుపుకోవచ్చని, అందుకు తాము సిద్ధమన్నారు. ఆరోపణలు అబద్ధాలని తేలితే వెంకట్‌రెడ్డిని శిక్షించాలని డిమాండ్ చేశారు.


దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ విద్యుత్తు అనే సెంటిమెంట్‌ను గత ప్రభుత్వం ఆర్ధిక అవసరాలకు వాడుకుని అవినీతికి పాల్పడిందని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో ఇదే సభలో చత్తీస్ ఘడ్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందంపై విపక్షాలుగా మేం ప్రశ్నించినప్పుడు మార్షల్స్‌తో గెంటేశారన్నారు. గుజరాత్ ప్రైవేటు కంపనీ నుంచి కాలం చెల్లిన సబ్‌క్రిటికల్ టెక్నాలజీతో ప్రభుత్వం భద్రాద్రి థర్మల్‌ పవర్ ఫ్లాంట్ నిర్మించి ఒక్కో మెగా యూనిట్ ఉత్పత్తి వ్యయాన్ని పెంచిందని, అలాగే యాదాద్రి థర్మల్ పవర్ ఫ్లాంట్‌ను ఓపెన్ టెండర్ వేయకపోవడంపైన, మెగా యూనిట్ కాస్టు పెరిగిపోవడంపైన, నిర్మాణ వ్యయాలు పెరిగిన తీరుపైన, ఫ్లాంటు నిర్మాణ జాప్యంపైన ప్రభుత్వం అనేక తప్పిదాలకు పాల్పడిందన్నారు.


వీటన్నింటిపై జ్యూడిషియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తుందన్నారు. బీఆరెస్ ప్రభుత్వం స్వరాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తిని 7,700మెగావాట్ల నుంచి 19,400కోట్లకు పెంచామని ప్రచారం చేసుకుంటుందని, నిజానికి పదేళ్ల బీఆరెస్ ప్రభుత్వం ఒక్క మెగా యూనిట్‌ను కూడా ప్రభుత్వ రంగంలో పెంచలేదన్నారు. ఇక 24గంటల ఉచిత విద్యుత్తుపై ఇప్పటికే మా మంత్రి వెంకట్‌రెడ్డి నిజాలు రుజువు చేశారని, అయినా బీఆరెస్ సభ్యులు వాస్తవాలను అంగీకరించడం లేదని, 24గంటల ఉచిత విద్యుత్తు సరఫరాలో వాస్తవాల నిగ్గు తేల్చేందుకు అఖిల పక్ష కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.


సీఎం రేవంత్ రెడ్డి జ్యూడిషియల్ విచారణను స్వాగతిస్తున్నామని జగదీశ్‌రెడ్డి చెప్పగా, పాపం ఆ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి ఏం తెలువదని, అన్ని సీఎండి ప్రభాకర్‌రావుతో కేసీఆర్ చేయించారని, జైలుకెళ్లినాక జగదీశ్‌రెడ్డికి అర్ధమవుతుందని మంత్రి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 24గంటల ఉచిత విద్యుత్తు నిజమైతే రాష్ట్రంలోని అన్ని సబ్ స్టేషన్ల లాగ్‌బుక్‌లను తాను పరిశీలించిన వెంటనే హైద్రాబాద్‌కు ఎందుకు తెప్పించారని వెంకట్‌రెడ్డి నిలదీశారు.