Site icon vidhaatha

అభయహస్తంతో పేదల ఇండ్లలో వెలుగులు


విధాత: పేదల ఇండ్లలో వెలుగులు నింపేందుకే అభయ హస్తం ఆరు గ్యారంటీలను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారని, ఆమె ఇచ్చిన హామీలన్నింటిని తమ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో అభయ హస్తం పథకంలోని మరో రెండు గ్యారంటీలైన మహిళలకు 500రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌, 200యూనిట్ల గృహ జ్యోతి గ్యారంటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించి ఐదుగురు లబ్ధిదారులకు అందించారు.


ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మహాలక్ష్మి పథకం, 10లక్షల ఆరోగ్య శ్రీలను ఇప్పటికే అమలు చేశామని, ఇవాళ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభించుకుంటున్నామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పథకాలను సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించుకుంటున్నామన్నారు. మహిళల కళ్లలో ఆనందం చూడాలనే రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు.


నిజమైన లబ్ధిదారులకు, అర్హులకు పథకాలను అందించడమే ప్రజా పాలన ఉద్దేశమన్నారు. పేదలకు పథకాలు చేరేలా అధికారులు విధి విధానాలు రూపొందించారన్నారు. ఆర్ధిక నియంత్రణ పాటిస్తూ పేదలకు ఇబ్బంది కలగకుండా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం మా నెత్తిన మోపిపోయిన అప్పుల భారాన్ని అధిమించుకుంటు సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ముందుకు నడిపిస్తామన్నారు. హామీలు అమలు చేయడంలో మా ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్నారు. సోనియాగాంధీపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారన్నారు.


సోనియమ్మ మాట ఇచ్చారంటే అది శిలాశాసనమని, సోనియా గాంధీ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామన్నారు. ప్రతిపక్ష బీఆరెస్‌కు చెందిన తండ్రీ కొడుకులు, మామా అల్లుళ్లు తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి విమర్శలు పిల్లి శాపనార్ధాల వంటివని పరోక్షంగా కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులను ఎద్దేవా చేశారు. ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళని నమ్మడం లేదన్నారు. అందుకే వారు నిత్యం రకరకాల తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజాపాలన నాకు దరఖాస్తు చేసుకున్న వారు అభయ హస్తం పథకంకు అర్హులని, గత మూడేళ్ల సిలిండర్ల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని పథకం అమలవుతుందన్నారు.

Exit mobile version