ప్రారంభమైన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర

ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఒకవైపు, టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌.చంద్రబాబునాయుడు మరోవైపు పోటాపోటీగా బస్సుయాత్రలు చేపట్టారు

  • Publish Date - March 27, 2024 / 12:52 PM IST

  • జోరుగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రజాగళం యాత్ర


విధాత: ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఒకవైపు, టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌.చంద్రబాబునాయుడు మరోవైపు పోటాపోటీగా బస్సుయాత్రలు చేపట్టారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సుయాత్రను సెంటిమెంట్‌గా ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం ప్రారంభించారు.


అక్కడే తల్లి వైఎస్‌.విజయమ్మ ఆశీర్వనాలు తీసుకుని బస్సుయాత్రలో పొద్దుటూరు మేమంతా సిద్ధం బహిరంగ సభకు వెళ్లారు. అక్కడ తన పాలనా విజయాలను ప్రజలకు ఏకరవు పెట్టిన జగన్‌, ప్రతిపక్ష టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపైన, కాంగ్రెస్‌పైన విమర్శలు గుప్పించారు. 21రోజుల పాటు సాగనున్న జగన్ బస్సు యాత్ర ఇచ్చాపురంతో ముగియ్యనుంది.


పుత్తూరు, పలమనేరులో బాబు ప్రజాగళం సభలు


టీడీడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు బుధవారం పుత్తూరు, పలమనేరు ప్రజాగళం ప్రచార యాత్ర సభల్లో మాట్లాడారు. వైసీపీ సర్కారుపై చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు. ఎన్నికలు వస్తుండడంతో ముసుగు వీరుడు జగన్ మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి తాడేపల్లి దాటి వస్తున్నాడని జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్ద ఆస్తి.. ఒక్క జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉందని మండిపడ్డారు.ఈయన తాను పేదవాడు అని చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మార్చే తేదీ మే 13 అని, జగన్ అహంకారం కూలిపోయి, తాడేపల్లి ప్యాలెస్ ను బద్దలు కొట్టేది ఆ రోజేనని బాబు పేర్కోన్నారు.


సొంత తోబుట్టునే అవమానించిన రాక్షసుడని, అన్నా క్యాంటీన్’ రద్దు చేసినవాడు పెత్తందారా? పేదవాడా? అని ప్రశ్నించారు. విదేశీ విద్య పథకాన్ని, టిడ్కో ఇళ్లను రద్దు చేసిన పెత్తందారుడు జగన్ అని విమర్శించారు. విద్యుత్ చార్జీలను 9 సార్లు పెంచాడని, నేరస్తులు కరుడుగట్టిన వాళ్లతో ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రజలను ఐదేళ్ల పాటు జగద్‌ మోసం చేశారన్నారు. రాయలసీమ అభివృద్ధికి జగన్ చేసిందేమి లేదన్నారు. అనంతపురానికి నీళ్లు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. కియా పరిశ్రమను అనంతపురం జిల్లాలో ఏర్పాటయ్యేలా టీడీపీ ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు.

Latest News