విధాత: నాగుపాము పేరు వినగానే గుండెలు హడలిపోతాయి. ఆ పాము కంట పడిందంటే చాలు.. ఆ దరిదాపుల్లో ఉండకుండా పరుగెడుతాం. అవసరమైతే పాము వెంటాడే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి ఓ నాగుపాము నడిరోడ్డుపై నాట్యం చేసి వాహనదారులను ఆకర్షించింది.
ఏదో ఒకట్రెండు నిమిషాలు కాదు.. ఏకంగా అర గంట పాటు పడగవిప్పి నడిరోడ్డుపై నాట్యం చేస్తూనే ఉండిపోయింది ఆ నాగుపాము. ఈ దృశ్యం ఖమ్మం జిల్లాలోని ఎరుపాలెం – పెగళ్లపాడు మధ్య ఆర్‌వోబీ రహదారిపై ఆవిష్కృతమైంది.
ఇక వాహనదారులు తమ వాహనాలను ఆపి నాగుపాము నాట్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు. నాగుపాము నాట్యం చేస్తున్నంత సేపు వాహనదారులు ముందుకు కదల్లేదు. పాము రోడ్డు మీదనుంచి చెట్ల పొదల్లోకి వెళ్లిన అనంతరం వాహనదారులు తమ ప్రయాణాన్ని కొనసాగించారు.