విధాత: సీపీఎం నేత కామ్రేడ్ జూలకంటి రంగారెడ్డికి మెగాస్టార్ చిరంజీవి నుండి అభినందనలు అందాయి. జూలకంటి రంగారెడ్డి రాసిన ‘ప్రజల గొంతుక’ అనే పుస్తకాన్ని చదివిన చిరంజీవి రంగన్నను అభినందిస్తూ సోమవారం లేఖ విడుదల చేయడం విశేషం. లేఖలో చిరంజీవి రంగన్నను అభినందిస్తూ రంగారెడ్డి ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగాలతో పాటు పలు దిన పత్రికలలో ప్రజా సమస్యల పైన, ప్రభుత్వ విధానాల పైన రాసిన వ్యాసాలను సంకలనంగా తేవడం అభినందనీయమన్నారు.
చరిత్రను డాక్యుమెంట్ చేయడం ఎంతో ముఖ్యమని, అప్పుడే ఆ చరిత్రలో ఎవరెవరు ఏ విధమైన పాత్రను పోషించారో భవిష్యత్ తరాలకు తెలియజేయడానికి ఇటువంటి పుస్తకాలు ఉపయోగపడతాయన్నారు. రంగన్న తన పుస్తకానికి ప్రజల గొంతుక అనే పేరు పెట్టడం సముచితంగా ఉందని, జూలకంటి రంగారెడ్డి భవిష్యత్తులో కూడా ప్రజల గొంతుకగా ప్రజలకు అండగా నిలబడాలని, చట్టసభలలో మళ్లీ ఆయన గొంతుక వినబడాలని చిరంజీవి అభిలాషించారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న అతికొద్దీ మంది రాజకీయ నాయకుల్లో జూలకంటి రంగారెడ్డి ఒకరని, 2009లో ప్రజారాజ్యం తరఫున తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రంగారెడ్డి తో పరిచయం ఏర్పడిందని, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై సూటిగా విశ్లేషణాత్మకంగా ఆయన మాట్లాడే వారని గుర్తు చేసుకున్నారు.
కర్షకులు, కార్మికుల సమస్యలతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో చోటుచేసుకుంటున్న లోసుగులపై అసెంబ్లీలో గళమెత్తారని, సామాన్య ప్రజలపై పడే ధరల భారం మొదలుకొని రాజ్యాంగ స్ఫూర్తిగా భిన్నంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపై సూటిగా ప్రశ్నించే వారని చిరంజీవి తన లేఖలో రంగన్నను అభినందించారు.