- అంతర్గత తగాదాల నుంచి కాంగ్రెస్ బయట పడగలదా?
- పార్టీ వీడుతున్న నేతలకు సమాధానం ఇవ్వగలదా?
విధాత: కాంగ్రెస్ పార్టీ చాలా ఏళ్ల తరువాత పోరుబాటకు సిద్ధమైంది. వరుసగా ఎదురు దెబ్బలు తింటున్న కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం మొదటి సారిగా ఆందోళనలకు పిలుపునివ్వడం చీకట్లో చిరుదీపం లాగా కనిపిస్తుంది. నేతల మధ్య విభేదాలు, అంతర్గత తగాదాలు ఎన్ని ఉన్నా వాటన్నింటిని పార్టీ ఇచ్చిన ఆందోళనా కార్యక్రమాలు అధిగమించి, క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపుతాయని పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఏ తేదీన ఎక్కడ..
ఇందులో భాగంగానే రైతులను పట్టి పీడిస్తున్న ధరణి సమస్యలపై ఈ నెల 24న మండల కేంద్రాల్లో, తాసీల్దార్ కార్యాలయాల ముందు నిరసనలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. 30న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, డిసెంబర్ 5న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఆందోళనలు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. నిరసన కార్యక్రమాల్లో పార్టీ అగ్రనేతలంతా ఎక్కడికక్కడ పాల్గొనాలని పిలుపునిచ్చింది.
రాష్ట్ర ఏర్పాటు తరువాత వరుస దెబ్బలు
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు ప్రజల్లో గుర్తింపు ఉన్నప్పటికీ నాయకత్వం ఈ పాజిటీవ్ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ల లేక పోయింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు అధికారాన్ని కోల్పోయింది. అంతేకాదు రాష్ట్రంలో నేతల మధ్య ఐక్యత లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
దీనికి తోడు 2018 ఎన్నికల తరువాత కాంగ్రెస్ నుంచి గెలిచిన నేతలు టీఆర్ ఎస్‌లో చేరడం కూడా ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఆ తరువాత రాష్ట్రంలో వరుసగా వచ్చిన ఉప ఎన్నికల్లో ఓటమి పాలు అయింది. ముఖ్యంగా హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవడం పార్టీకి పెద్ద దెబ్బగా మారింది.
నమ్మకాన్ని కోల్పోయి పార్టీ మారిన నేతలెందరో..
వరుసగా రెండు సార్లు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ నేతలు కొంత మంది పార్టీపై నమ్మకాన్ని కోల్పోయారు. దీంతో వరుసగా 12 మంది ఎమ్మెల్ల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు. ఆతరువాత వరుసగా పార్టీ నేతలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్, తాజాగా మర్రి శశిధర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. కొంత మంది బీజేపీలో చేరారు. మిగతా నేతలు కూడా బీజేపీలో నేడో, రేపో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.
వీరంతా దాదాపుగా పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిని వెలుబుచ్చి బయటకు వెళుతున్న వారే. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందా? అన్న సందేహాలు సర్వత్రా వెలువడ్డాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోవడం మరింతగా దెబ్బ తీసింది. కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ పూర్తి చేయనుందా? అన్న చర్చ కూడా ప్రస్తుతం జరుగుతోంది.
ఆశలు కల్పించిన రాహుల్ జోడో యాత్ర
పూర్తి నిరాశ, నిస్పృహలో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో రాహుల్ గాంధీ తన జోడో యాత్ర ద్వారా జోష్ నింపారు. రాష్ట్రంలో 12 రోజుల పాటు యాత్ర జరగగా, ప్రతి రోజు యాత్రలో భాగంగా జరిగిన సభలకు భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన పాదయాత్రలో ప్రతి చోటా దాదాపు 50 వేల మంది వరకు పాల్గొన్నారు. ఈ యాత్ర క్యాడర్‌కు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. యాత్ర జరిగిన తరువాత వరుసగా జరుగుతున్న పరిమాణామాలు ఎలా ఉన్నా.. ఈ జోష్‌కు కొనసాగింపుగా నిరంతరం ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా నిరసన కార్యక్రమాల షెడ్యూల్ ప్రకటించింది.
ఆందోళనలతో వలసలకు చెక్
తీవ్ర అసంతృప్తితో పాటు మరోసారి అధికారంలోకి వస్తామన్న ఆశలు సన్నగిల్లడంతో ప్రత్యామ్నాయంగా చాలా మంది నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇలా పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వలస వెళ్లే వారికి చెక్ పెట్టి, క్యాడర్‌ను నిరంతరం ప్రజల్లో ఉంచే విధంగా చాలా కాలం తరువాత పార్టీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చింది. ప్రధానంగా ధరణిని రద్దు చేయాలన్న డిమాండ్‌తో ముందుకు వెళుతుంది. ఈ ఆందోళన కార్యక్రమాల ద్వారా ప్రత్యామ్నాయ ఎజెండాను రాష్ట్ర ప్రజల ముందుకు తెచ్చే ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి మరి.