ఇనుము వాడకుండానే అయోధ్య ఆలయం నిర్మాణం..! గుడి పూర్తి విశేషాలివే..!

అయోధ్య రామ మందిరంలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మరికొద్ది గంటల్లో వైభవంగా జరుగనున్నది.

  • Publish Date - January 22, 2024 / 05:10 AM IST

Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరంలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మరికొద్ది గంటల్లో వైభవంగా జరుగనున్నది. ఈ ఘట్టంతో ఎన్నో ఏళ్ల భారతీయుల చిరకాల స్వప్నం సాకారంకా బోతున్నది. శ్రీరాముడి జన్మభూమిలో నిర్మించిన ఆలయంలో బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొని ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు.


ఆ తర్వాత పురాతన శివుడి ఆలయాన్ని పునరుద్ధరించిన కుబేర్ తిలాకు ప్రధాని వెళ్లనున్నారు. అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో దేశంలోని అన్ని మతాలకు చెందిన, ఆధ్మాతికవేత్తలు, సాధువులు హాజరుకానున్నారు. పలువురు విదేశీ ప్రతినిధులు సైతం హాజరుకానుండగా.. దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం వేడుకలో పాల్గొననున్నారు.


 


రామ్‌లల్లా ఆలయం..


శ్రీరాముడి ఆలయాన్ని రామ జన్మభూమి ఆలయం నాగర్‌ శైలి సంప్రదాయంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ నిర్మించింది. ఆలయం పొడువు పొడవు (తూర్పు-పడమర) 380 అడుగులు ఉంటుంది. వెడెల్పు 250 అడుగులు కాగా.. 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయంలో 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. ఆలయ స్తంభాలు, గోడలపై హిందూ దేవుళ్లు, దేవతల చిత్రాలను తీర్చిదిద్దారు. రామ మందిరం ప్రధాన ద్వారం తూర్పు దిశలో ఉంటుంది.


సింగ్ గేట్ నుంచి 32 మెట్లు ద్వారా ప్రధాన ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయంలో మొత్తం ఐదు మండపాలు (హాల్స్) ఉంటాయి. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మండపం, కీర్తన మండపలాలను నిర్మించారు. రామ మందిరానికి సమీపంలో సీతా కూప (బావి) ఉంటుంది. దీనికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నది. ఆలయ సముదాయం నైరుతి భాగంలోని కుబేర్ తిల వద్ద, జటాయువు విగ్రహంతో పాటు పురాతన శివుడి ఆలయాన్ని పునర్మించారు.


 


గర్భగుడిలో బాలరాముడి విగ్రహం


ప్రధాన ఆలయంలో గర్భగుడిలో బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. బాల రాముడి విగ్రహం 51 అంగుళాల పొడువు ఉంటుంది. బాలరాముడి విగ్రహం పక్కన మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాల విగ్రహాలు ఉంటాయి. బాలరాముడి విగ్రహం పైభాగంలో ఓం, గణేశ, చక్రం, శంఖం, గద, స్వస్తిక్‌ గుర్తులుంటాయి. కమల నయనాలను పోలినట్లు బాలరాముడి కళ్లను తీర్చిదిద్దారు. బాలరాముడి విగ్రహం కింద భాగంలో ఒకవైపు హనుమ, మరొకవైపు గరుడుడు ఉంటారు.


ఇనుము వాడకుండానే..


ఆలయ పునాది 14 మీటర్ల మందంతో రోలర్ కాంపాక్ట్ కాంక్రీటు (RCC)తో నిర్మించారు. ఆలయం వంద సంవత్సరాలు ఉండేలా నిర్మించారు. రిక్టర్‌ స్కేల్‌పై 8 తీవ్రతతో భూకంపం వచ్చినా తట్టుకునేలా పటిష్ఠంగా ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణంలో ఇనుమును ఏమాత్రం వినియోగించలేదు. తేమ బారి నుంచి నేలను రక్షించేందుకు గ్రానైట్ ఉపయోగించి 21 అడుగుల ఎత్తయిన ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించారు. ఆలయ సముదాయంలో నీటి శుద్ధి కర్మాగారం, అగ్ని రక్షణ కోసం నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కర్మాగారం నిర్మించారు.


 


ఈ ఆలయాన్ని సంప్రదాయ, స్వదేశీ టెక్నాలజీతో నాగర్‌ శైలిలో నిర్మించారు. ఆలయం కోసం ప్రత్యేకంగా ఓ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం 25వేల మంది సామర్థ్యంతో ఉన్న ఓ ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటు చేశారు. రాముడి దర్శనం కోసం వచ్చే భక్తులు లగేజీని భద్రపరుచుకునేందుకు ప్రత్యేక లాకర్లు ఏర్పాటు చేశారు. మూత్రశాలలు, బాత్‌రూమ్‌లు, కుళాయిలు ఏర్పాటు చేయగా.. 70 ఎకరాల విస్తీర్ణంలో చెట్లపెంపకం చేపట్టనున్నారు.

Latest News