విధాత: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, తెలంగాణలో మాదిరి ఏపీలోనూ అధికారమార్పిడి తథ్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన మోసాల కంటే, ఆంధ్రాలో సీఎం జగన్ చేసిన తప్పులే ఎక్కువని ఆరోపించారు.
బతికుండగానే జగన్ సమాధి కట్టుకున్నారని హాట్ కామెంట్స్ చేశారు. పట్టాదారు పాసుపుస్తకాలపైనా సీఎం జగన్ ఫొటో ముద్రించడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్రానికి జగన్ శాశ్వత ముఖ్యమంత్రి కాదుకదా? అని ప్రశ్నించారు. ప్రతి గ్రామంలోనూ జగన్ సమాధి రాయి వేసుకున్నారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉంటే.. సీఎం జగన్ వారితో అంటకాగుతున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణలో సీపీఐతో పొత్తు వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగిందని అన్నారు. మూడు రాష్ట్రాల్లోనూ సీపీఐతో పొత్తు లేకపోవడం వల్లనే కాంగ్రెస్ ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని, దీన్ని ఆపార్టీ గుణపాఠంగా తీసుకోవాలని సూచించారు.
రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ వ్యవహరించిన ఒంటెద్దు పోకడే ఆపార్టీకి తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని చెప్పారు. ఇండియా కూటమి ఎంత ముఖ్యమో.. అందులోని భాగస్వామ్య పక్షాలను కలుపుకుపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత కావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక్కో పార్లమెంట్ స్థానం చొప్పున సీపీఐ బరిలోకి దిగనున్నట్లు తెలిపారు.