విధాత, హైదరాబాద్: ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లుగా నేతలు ఫీలవుతున్నారా? విజయంపై అతి విశ్వాసానికి పోయిన కాంగ్రెస్ నేతలు అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారా? ప్రతి ఓటూ, ప్రతి సీటూ అత్యంత కీలకమైన తరుణంలో వామపక్షాల పొత్తును కాంగ్రెస్ కాలదన్నుకుంటున్న తీరుపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. కలిసి వచ్చే శక్తులను కలుపుకొని పోకుండా.. చేతులారా దూరం చేసుకుంటున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే ప్రమాదం ఏర్పడిందని చెబుతున్నారు. ఇది అంతిమంగా బీఆరెస్‌కు ఉపయోగపడినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. బీఆరెస్‌కు రాష్ట్రంలో ఎదురు లేదని అంతా భావిస్తున్న సమయంలో ఉన్నట్టుండి వివిధ రాజకీయ పరిణామాలు, పేపర్ లీకేజీ వంటి సందర్భాలు, సంఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. దానికి పలువురు కీలక నేతల చేరికలు తోడయ్యాయి.
దీంతో నువ్వానేనా? అనే స్థాయిలో సవాలు విసిరే పరిస్థితిలో ఉన్నది. అయితే.. వివిధ సర్వేలను గమనిస్తే.. కాంగ్రెస్‌కు గుండుగుత్తా విజయాలు ఉండబోవని, హంగ్ ఏర్పడేందుకు కూడా అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ తరుణంలో ప్రధాన శతృవును ఎదుర్కొనే ప్రధాన పక్షంగా కలిసొచ్చే ప్రతి శక్తిని కలుపుకొని పోవాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. కానీ.. ఎవరు వచ్చినా రాకున్నా గెలిచేది తామే అన్న భావనలో కాంగ్రెస్ ఉండటం ఈ నిర్ణయానికి కారణం అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే తమకు ఎవరూ వద్దు.. తాము ఎవరికీ సీట్లు ఇవ్వం అనే ధోరణి కనిపిస్తున్నదని చెబుతున్నారు.
పొత్తు పెట్టుకుందామని..
కమ్యూనిస్టులు ముందుగా కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్దం కాలేదు. కమ్యూనిస్ట్ పార్టీలు బీఆరెస్‌తో పొత్తుకు ప్రయత్నించాయి. మునుగోడు ఉప ఎన్నికలో పొడిచిన పొత్తును సాధారణ ఎన్నికల్లో కొనసాగించాలని భావించిన కమ్యూనిస్ట్‌లకు బీఆరెస్ అధినేత కేసీఆర్ 115 నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించి షాక్ ఇచ్చారు. కనీసం కమ్యూనిస్ట్‌లను ఒక్కసారి కూడా పిలిచి మాట్లాడిన దాఖలాలు లేవు. బీఆరెస్ షాక్ తరువాత కమ్యూనిస్ట్‌లను వెంటనే కాంగ్రెస్ పార్టీ కాంటాక్ట్ చేసింది. సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే తదితరులు సీపీఐ, సీపీఎం అగ్రనేతలతో మాట్లాడారు.
ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని ప్రతిపాదించారు. పొత్తుల విషయం చర్చిస్తున్నామని, వామపక్షాలకు ఇవ్వాల్సిన సీట్లపై మాట్లాడుతున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతూ వచ్చారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్‌లు కలిసి పోటీ చేస్తారన్న ప్రచారంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మరింత పెరిగింది. ఈ సమయంలో క్షేత్రస్థాయిలో టికెట్లు పోతాయని భావించిన కాంగ్రెస్ ఆశావహులు ఎదురు తిరిగారు. వారికి సర్దిచెప్పే పేరుతో కొంత కాలం కరిగిపోయింది. దీంతో కమ్యూనిస్ట్‌లకు సీట్లు కేటాయించకుండా తాత్సారం చేసింది.
మాటలే కానీ..
కాంగ్రెస్ నేతలు తాము అడిగిన అన్ని సీట్లు ఇవ్వలేమని మొదట చెప్పారని సీపీఎం నేతలు చెబుతున్నారు. చెరో రెండు సీట్లలో పోటీ చేయడానికి సర్దుకోవాలని కోరారని వార్తలు వచ్చాయి. ఈ మేరకు అంగీకారం తెలిపిన కమ్యూనిస్టులు మిర్యాలగూడ, కొత్తగూడెం, వైరా, చెన్నూరు స్థానాలు కోరుకున్నారు. అయితే ఈ సీట్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధపడలేదు. దీంతో పొత్తు విషయం ముందుకు వెళ్లలేదు. దీనిని తీవ్రంగా పరిగణించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నవంబర్ 2వ తేదీ వరకు డెడ్ లైన్ విధించారు. అయితే తొందర పడి ఏ నిర్ణయం తీసుకోవద్దని నవంబర్1వ తేదీన కోరిన సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క డెడ్‌లైన్ ముగిసినా కూడా ఏ నిర్ణయం చెప్పలేదు. దీనిని తీవ్ర అవమానంగా భావించిన సీపీఎం నేతలు ఒంటరి ప్రయాణం చేయడానికి సిద్దమయ్యారు.
కానీ సీపీఐ నేతలు ఇంకా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియా సమావేశం నిర్వహించి 17 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నామని వెల్లడించారు. సీపీఎం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే పలు స్తానాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బతీసే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ పరిశీలకుల్లో జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు భావాజాల వ్యాప్తి కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలన్న ఉద్దేశంతో కోదండరామ్ తో చర్చించారు. వారికి పలు సీట్లలో పోటీ చేసే బలం లేక సీట్లు వద్దనుకున్నారు. ఇదే తీరుగా కమ్యూనిస్ట్‌లతో మాట్లాడి చెరో రెండు సీట్లు ఇస్తే మిగిలిన సీట్లలో కలిసి వస్తుంది కదా? ఇలా పొత్తు వద్దనుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీకే నష్టమన్న చర్చ కూడా జరుగుతోంది.