- పార్టీలో ఏం జరుగుతున్నదని ఆరా తీసిన అమిత్ షా, నడ్డా
- వేగుల ద్వారా రహస్య నివేదిక తెప్పించుకున్న నేతలు
- పార్టీని గాడిలో పెట్టకపోతే కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం చేసిన నేతలు
Crisis in Telangana BJP । రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. ఎమ్మెల్సీ కవితపై సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే తప్పుపట్టి ఆయనపై విమర్శనాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొన్నది.
విధాత : ఎన్నికల ఏడాది కావడంతో తెలంగాణ బీజేపీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith Sha) , ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) వేగులతో సమాచారం సేకరించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని, అందుకు అందరూ కలిసి పనిచేయాలని కొన్నిరోజుల కిందటే అమిత్ షా రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేశారు. అధికారంలోకి రావాలంటే క్రమశిక్షణ ముఖ్యమని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నది. కానీ పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్మలాటలతో కార్యకర్తలు, శ్రేణుల్లో అయోమం నెలకొన్నది. దీంతోపార్టీని గాడీలో పెట్టే పనిలో బీజేపీ అధిష్ఠానం ఉన్నట్టు తెలుస్తోంది.
సంజయ్ వ్యాఖ్యలపై అసంతృప్తి
ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యల విషయంలో బండి సంజయ్‌పై ఎంపీ ధర్మపురి అర్వింద్, పేరాల శేఖర్‌రావు, అంజన్నఅసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. కవితపై సంజయ్ చేసిన వ్యాఖ్యలను సమర్థించబోమని, ఆయన వెనక్కి తీసుకోవాలని అర్వింద్ సూచించారు. ఇతర నేతలు కూడా ఆయన వ్యాఖ్యలను తప్పుపట్టారు. స్వపక్ష నేతల విమర్శలను అధికార పార్టీ ఆయుధాలుగా మలుచుకున్నది.
అలాగే పార్టీలో తమకు గాని, ఈటల తదితరులకు తగిన ప్రాధాన్యం లేదని ఆపార్టీని వీడి తిరిగి గులాబీ గూటికి చేరిన నేతలు బహిరంగంగానే వెల్లడించారు. మొన్న కవితపై సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత బీజేపీ చేరికల కమిటీకి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఈటల ఖండించారు. అయినప్పటికీ రాష్ట్ర నాయకత్వ ఏకపక్ష వైఖరి, బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన వారిని సంజయ్ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
బండి వ్యాఖ్యలతో ఇబ్బందే!
మద్యం కేసులో బీఆర్‌ఎస్‌పై, అదానీపై హిండెన్‌బర్గ్ నివేదిక ఉదంతంపై జేపీసీ వేసి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ రెండు పార్టీలు ప్రజాసమస్యలను పక్కదోవ పట్టించడానే నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ విమర్శిస్తున్నది. దీనికితోడు సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు తమకు నియోజకవర్గాల్లో ఇబ్బందికరంగా మారుతున్నాయని కొంతమంది నేతలు వాపోతున్నారట.
ఇదే పార్టీలోనే ఉంటూ గెలువడం అంత ఈజీ కాదు అని కార్యకర్తుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ పరిణామాలు తమకు ప్రతికూలంగా మారుతాయని అందుకే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకత్వం ఒత్తిడి చేస్తున్నదట.
ఈ నేపథ్యంలోనే అసలు రాష్ట్ర బీజేపీలో ఏం జరుగుతున్నది? క్రమశిక్షణ లేకుంటే పార్టీని పటిష్టపరచడం, ఎన్నికలను ఎదురుకోవడం సాధ్యం కాదని ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి వచ్చిందట. ఈ మేరకు వేగుల ఒక రహస్య నివేదికను తెప్పించుకున్నదట. పార్టీని ప్రక్షాళన చేయకపోతే కష్టమని కమలం పార్టీ జాతీయ నేతలు భావిస్తున్నారట.