విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గత జనవరిలో నర్సంపేట ప్రాంతంలో వచ్చిన వడగళ్ల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎట్టకేలకు ఏడాది తర్వాత ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వడగండ్లవాన కురిసినప్పటికీ నర్సంపేట ప్రాంతంలో రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో సుమారు 18,500 ఎకరాలలో పంట నష్టపోయినట్లు అధికారిక లెక్కల్లో తేలింది.
ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించిన సీఎం నియోజకవర్గంలో 18వేల500 ఏకరాలకు (మిర్చి, మొక్కజొన్న పంటలకి సంబంధించి) ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేశారు.
మరో వారంలో ఈ చెక్కులను రైతు వేదికల ద్వారా అందించనున్నారు. జీవో ప్రకారంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించనున్నారు. హెక్టారుకు రూ. 13,500, ఎకరాకు రూ.5,400 ఇచ్చారు.
సబ్సిడీ పైపులు, మోటార్లు
అదనంగా రైతులందరికీ ఉపయోగపడే పివిసి పైపు 400 మీటర్లు ఒక యూనిట్ కాస్ట్ 30 వేల రూపాయలు అందులో రూ.15 వేలు సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. మిగిలిన రూ.15 వేలు రైతు కట్టుకోవాల్సి వస్తుంది. ఈ పైలెట్ ప్రాజెక్టును త్వరలోనే మంజూరు చేయనున్నారు.
రైతులు సబ్సిడీ వ్యవసాయ కరెంటు మోటారుల కోసం హార్టీకల్చర్ డిపార్ట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. 2600 యూనిట్ల సబ్సిడీ మోటార్ల కోసం నిధులు మంజూరై కలెక్టర్ వద్ద ఉన్నందున నష్టపోయిన రైతులకి మొదట ప్రాధాన్యత ఉంటుంది.
రోడ్ల అభివృద్ధికి నిధులు
వడగళ్ల వల్ల రైతులకు ఎలా నష్టం జరిగిందో, నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయి. వీటిలో ఇంటర్నల్ రోడ్లు, ఎక్స్ టర్నల్ రోడ్లకు సంబంధించి వేరువేరుగా సీఎం కార్యాలయానికి నివేదిక అందించారు.
వరద నష్టానికి సంబంధించి ముఖ్యమంత్రి అదేశానుసారం G.O.No. 35 ద్వారా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు రూ.63 కోట్ల 88 లక్షల 60 వేలను రోడ్ల మరమత్తుల కోసం మంజూరు చేశారు. 74 రోడ్లను గుర్తించారు. ఇందులో రూ. 36 కోట్లు BT రోడ్లకు, రూ.27 కోట్ల 50 లక్షలు సీసీ రోడ్లకు కేటాయించారు.
సీఎం, మంత్రులకు ధన్యవాదాలు: ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
వడగండ్ల వానలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పంట నష్టపరిహారం ప్రకటించడం పట్ల నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. పరిహారంతో పాటు కరాబైన రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించిన సీఎం, మంత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు.