రైతు బంధు రాలేదని దళిత రైతు ఆత్మహత్య

  • Publish Date - November 3, 2023 / 02:34 PM IST

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: రైతు బంధు పథకం దళిత రైతు ఉసురుతీసింది. ఈ పథకం లబ్ధి అందలేదని మనస్తాపం చెందిన ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం బోరజ్ గ్రామానికి చెందిన దళిత రైతు రమాకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ ప్రభుత్వం దళిత జాతి ఉద్ధరణ కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్తున్న మాటలకు ఆచరణలో ఏమాత్రం అమలు కావడం లేదని ఈ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది.


ఓ దళిత రైతు రైతు బంధు రాలేదని ఆత్మస్థైర్యం కోల్పోవడం దయనీయ దుస్థితికి అద్దం పడుతోంది. ‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రైతుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు కోసం దరఖాస్తు చేసినప్పటికీ పథకం తమకు అందలేదు’ అని దళితుడైన రమాకాంత్ సూసైడ్ నోట్ రాసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రమాకాంత్ రైతుబంధు కోసం పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. రైతు బంధు రాకపోవడంతో సూసైడ్ నోటు రాసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.


ఆత్మహత్యకు కారణం తెలంగాణ ప్రభుత్వం అని, సీఎం కేసీఆర్ అని, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాదు.. అవి క్షేత్రస్థాయిలో రావడంలేదని ఆత్మహత్యకు పాల్పడుతున్నానని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.