Site icon vidhaatha

కుడి చేతి బ్యాటింగ్ చేసిన డేవిడ్ వార్న‌ర్.. ప్ర‌యోగం ఫ‌స‌క్!

వ‌ర‌ల్డ్ కప్‌కి ముందు ఆస్ట్రేలియా ఇండియా టూర్‌లో భాగంగా భార‌త్‌తో మూడు వ‌న్డే మ్యాచ్‌లు ఆడుతుంది. ఇప్ప‌టికే రెండు వ‌న్డేలు పూర్తి కాగా, రెండింట ఘోర ప‌రాజ‌యం చ‌వి చూసింది. రెండో వన్డేలో అయితే టీమిండియా ఘన విజయం సాధించి త‌ర్వాతి మ్యాచ్‌తో సంబంధం లేకుండానే 2-0తో సిరీస్ కైవ‌సం చేసుకుంది. ఆదివారం రోజు ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 99 పరుగుల తేడాతో భార‌త్ విజ‌య‌దుంధుబి మోగించింది.

భార‌త బ్యాట్స్‌మెన్స్ శుభ్‌మన్ గిల్(97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 104), శ్రేయస్ అయ్యర్(90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 105) సెంచరీలతో అద్భుత‌మైన భాగ‌స్వామ్యం నెల‌కొల్ప‌డం, కెప్టెన్ రాహుల్(38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52) మరోసారి నిల‌క‌డ‌మైన ఇన్నింగ్స్, మిస్ట‌ర్ 360 సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 72 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్ తో భార‌త్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోర్ చేసింది.

భార‌త బ్యాట్స్‌మెన్స్ జోరుని ఏ ఒక్క ఆస్ట్రేలియా బౌల‌ర్ కూడా అడ్డుకోలేక‌పోయాడు. కామెరూన్ గ్రీన్ అయితే 103 పరుగులు స‌మ‌ర్పించుకున్నాడు. అయితే గ్రీన్ 2 వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ తీసారు. ఇక 400 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియా కేవ‌లం 28.2 ఓవర్లలో 217 పరుగులకు కుప్పకూలింది.

డేవిడ్ వార్నర్(39 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 53), సీన్ అబాట్(36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఆ మాత్రం స్కోరు అయిన సాధించ‌గ‌లిగింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్‌తో ఆసీస్‌ని ముప్పు తిప్ప‌లు పెట్టారు. ఆ ఇద్ద‌రు మూడేసి వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ రెండు వికెట్లు , మహమ్మద్ షమీకి ఓ వికెట్ దక్కింది.

400 పరుగుల భారీ లక్ష్యచేదనలో ఆసీస్‌ ఇన్నింగ్స్‌కు వర్షం మ‌ధ్యలో అంతరాయం కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఆసీస్‌కు 33 ఓవర్లలో 317 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు అంపైర్లు. ఒక‌వైపు వికెట్స్ ప‌డుతుండ‌డం, ల‌క్ష్యం చాలా పెద్ద‌దిగా ఉండ‌డంతో డేవిడ్ వార్న‌ర్ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ అవ‌తారం ఎత్తాడు.

బౌల‌ర్స్‌ని కన్ఫ్యూజ్ చేసేందుకు ఆసీస్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ సందర్భంగా వార్న‌ర్ తన బ్యాటింగ్ శైలినే మార్చుకున్నాడు. లెఫ్టాండర్ అయిన వార్నర్.. అశ్విన్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు రైట్ హ్యాండర్‌గా గాడ్ తీసుకొని ఓవ‌ర్‌లో మూడో బంతిని ఫోర్‌కి త‌ర‌లించాడు. వార్న‌ర్ బ్యాటింగ్ చూసి ఆస్ట్రేలియా టీం మెంబ‌ర్స్ కూడా న‌వ్వుకున్నారు. అయితే అదే ఓవ‌ర్ ఐదో బంతికి లబుషేన్‌(27)ను ఔట్ చేసిన అశ్విన్.. మరుసటి ఓవర్‌ తొలి బంతికే వార్నర్‌ను కూడా ఎల్బీగా ఔట్ చేసి పెవీలియ‌న్‌కి త‌ర‌లించాడు.

Exit mobile version