విధాత, నిజామాబాద్: మున్సిపల్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ పార్టీల కౌన్సిల్లర్లకు రాజీనామా గడువు పరీక్షగా మారింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు ఆందోళనలో భాగంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఈ నెల 20 వ తేదీలోగా విలీన గ్రామాలకు చెందిన కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేయాలని గడువు విధించింది.
దీంతో 8 విలీన గ్రామాల్లో ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు వుండగా వారు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఇక మిగిలింది టిఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్లు. ఇప్పుడు అందరి దృష్టి టిఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్లపైనే వుంది.
గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు చీటికి మాటికీ రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలిపారు. పదవులను తృణప్రాయంగా వదులుకున్న నాటి టిఆర్ఎస్ స్ఫూర్తి ఇప్పుడు మళ్ళీ చిగురిస్తుందా అన్నది ఆ పార్టీ వైఖరిని సూచిస్తుంది.
టిఆర్ఎస్ కౌన్సిల్లర్లకు అదే విధంగా రాజీనామా చేసే అవకాశం ఇప్పుడు వచ్చింది. ప్రతి రాజకీయ పార్టీ నిర్దిష్ట లక్ష్యం కోసం పని చేస్తుంది. ఇప్పటి వరకు రైతులకు టీఆర్ఎస్, టీడీపీ, సీపీఐ (ఎం) మినహా అన్ని పార్టీలు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ప్రకటించాయి.
అయితే మాస్టర్ ప్లాన్ లో దాగివున్న కుట్రలను మొదట బీజేపీ గుర్తించి రైతులను జాగృతం చేసింది. ఆ పార్టీ నాయకుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రోజు రోజుకు ఆందోళన ఉదృతం కావడం, ఒక రైతు తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడడంతో మాస్టర్ ప్లాన్ మంటల సెగ రాష్ట్ర రాజధానికి తాకింది. దీంతో కేటీఆర్ స్పందించినట్లు వార్తలు వచ్చాయి.
అదే విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాక రైతు ఉద్యమానికి కాక పుట్టించింది. కాంగ్రెస్ కూడా ఉడతాభక్తి లాగా రైతులకు మద్దతు తెలిపింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిల, ప్రజా శాంతి పార్టీ కేఏ పాల్, పౌరహక్కుల సంఘం, తెలంగాణ జన సమితి పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఆలస్యంగా రైతులకు సీపీఐ కూడా మద్దతు ప్రకటించింది.
ఇదిలా వుండగా ఇప్పటి వరకు మద్దతు ప్రకటించని పార్టీల్లో టిఆర్ఎస్ ముఖ్యమైనది. అయితే టిఆర్ఎస్ అధికారంలో ఉన్నందున సమస్యను పరిష్కరించే బాధ్యత ఆ పార్టీ నేతలపైనే ఉందన్నది నిర్వివాదాంశం. రాష్ట్రంలోనే కాదు కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ లో కూడా టిఆర్ఎస్ పార్టీ మెజారిటీలో వుంది.
చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు వారివే. కౌన్సిల్‌లో తీర్మానం చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేయవచ్చుననే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. సరిగ్గా అక్కడే వుంది ట్విస్ట్… గత మూడు దశబ్దాలుగా మున్సిపల్ ను సిక్స్ మెన్ కమిటీ అనే ఒక ‘కరప్షన్ గ్యాంగ్’ బయటి నుండి నడిపిస్తున్నట్లుగా పట్టణ ప్రజల్లో ప్రాచుర్యం పొందింది.
మాస్టర్ ప్లాన్ తయారు వెనుక కూడా దాని ప్రభావం వున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ గ్యాంగ్ కు తోడు పట్టణంలో ఒక ప్రైవేట్ ఇంజినీర్ కుమ్మక్కు కావడం వల్లనే రైతులు రోడ్డెక్కాల్సి వచ్చిందని పలువురు పేర్కొంటున్నారు.
ఏ పార్టీ అధికారంలో వున్నా, ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ మున్సిపల్ వ్యవహారాల్లో సదరు గ్యాంగ్ దే పైచేయిగా నడుస్తోంది. ఇందులో ప్రస్తుత టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రమేయం ఉండడంతో మాస్టర్ ప్లాన్ రద్దు విషయంపై ప్రభుత్వం నుండి స్పష్టంగా ప్రకటన రాకపోవడం కారణంగా పేర్కొనవచ్చు.
ఇక రాజీనామాల విషయంలో బీజేపీ పార్టీ విధానం స్పష్టంగా ఉండడంతో టీఆర్ఎస్ పైనే అందరి దృష్టి పడింది. ఇంతకు విలీన గ్రామాల్లో టిఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కౌన్సిలర్లు రాజీనామా చేస్తారా.. అంటే అందరి దృష్టి ‘సార్’ వైపు చూస్తున్నారు.
ప్రస్తుతం మున్సిపల్ పాలకవర్గం మనుగడలో ఉన్నప్పటికీ అంతా ‘సార్’ కనుసన్నల్లోనే కార్యకలాపాలు సాగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ విషయమై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంప గోవర్దన్, జాజాల సురేందర్ చేసిన ప్రకటనల పట్ల రైతులకు నమ్మకం లేకుండా పోయింది.
ప్రభుత్వం, పార్టీ, ఎమ్మెల్యే అనుమతి కోసం ఎదురు చూస్తారో లేక రైతులు, ప్రజల పక్షాన నిలుస్తారో టిఆర్ఎస్ కౌన్సిలర్లు తేల్చుకునే సమయం ఆసన్నమైంది. కామారెడ్డి చుట్టూ వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి వుండగా వాటిపై రాబంధుల నీడ పడింది.
దాంతో అమాయక రైతులు సాగు చేసుకుంటున్న పచ్చని పంట పొలాలను ఇండస్ట్రియల్ జోన్‌లో చేర్చి రైతు బతుకును పొగసూరేలా చేస్తున్న కుట్రల వైపున వుంటారో… లేక భూమిని నమ్ముకొని బతుకుతున్న రైతన్నకు అండగా నిలుస్తారో.. ఇప్పుడు టీఆర్ఎస్ కౌన్సిలర్ల రాజకీయ విచక్షణ, వారికున్న సామాజిక స్పృహపై ఆధారపడి ఉందని పలువురు పరిశీలకులు భావిస్తున్నారు.