విధాత: బాలీవుడ్ నటి దీపిక పదుకొనే తిరుమలలో సందడి చేశారు. తన సోదరి, ప్రొఫెషన్ గోల్ఫర్ అయిన అనిష పదుకొనేతో కలిసి గురువారం రాత్రి అలిపిరి కాలిబాటన సామాన్య భక్తులతో కలిసి తిరుమల చేరుకున్నారు. శ్రీవారి దర్శనార్థం సుమారు మూడున్నర గంటలపాటు చెప్పులు లేకుండా నడిచి వచ్చారు.
దీపిక వెంట ఆమె సిబ్బంది ఉన్నారు. ఫొటోలు, సెల్పీలు తీసుకొనేందుకు భక్తులు పోటీ పడగా, సిబ్బంది వారిని వారించారు. గురువారం రాత్రి తిరుమలలోని రాధేయం అతిథి గృహంలో బస చేసిన దీపిక.. శుక్రవారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ సిబ్బంది తీర్థ ప్రసాదాలు అందించారు. దీపిక తిరుమల పర్యటన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది