విధాత, వరంగల్: ప్రజాస్వామ్యం నాలుగు స్తంభాలు ఎప్పుడో కూలి పోయాయని, వాటిని సామాజిక మాధ్యమాలే తిరిగి నిలబెట్టాలని సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాశం యాదగిరి పిలుపునిచ్చారు. యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ పేపర్స్ నిర్వాహకుల రౌండ్ టేబుల్ సమావేశం హన్మకొండ హంటర్ రోడ్ లోని ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డ్ భవన్ లో శుక్రవారం జరిగింది.
కార్యక్రమానికి తెలంగాణ ఆన్ లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి వేముల సదానందం నేత అధ్యక్షత వహించగా రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ముఖ్య అథితిగా హాజరయి, మాట్లాడారు.
ఉన్నది ఉన్నట్టు చూపిస్తే సరి..
ప్రజలు మనకు అండగా ఉండాలంటే ప్రజలకు మనం అండగా నిలవాలని, నోరు లేని వారికి నోరుగా, గుండె లేని వారికి గుండెగా, ఆత్మ లేని వారికి ఆత్మగా సోషల్ మీడియా నిలవాలని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల ప్రజల నిట్టూర్పు సమాజానికి చూపించాలని పాశం ఉద్ఘాటించారు.
సోషల్ మీడియా ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ చుట్టు తిరగాలని, ప్రజల భావోద్వేగాలను ప్రపంచానికి తెలియ జేయాలని పాశం కోరారు. శ్రీశ్రీ చెప్పినట్లు పత్రికలు గోరంతలను కొండంతలు చేసి చూపిస్తాయని, కొండలను, గోల్కొండను దాచి పెడతాయని అయితే సోషల్ మీడియా అందుకు భిన్నంగా ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తే సరిపోతుందని పాశం అన్నారు.
ప్రజా వార్తలను.. పత్రికలు ప్రచురించవు..
సోషల్ మీడియా క్రిటికల్ థాట్ ఎవరిని తిట్టాల్సిన పని లేదని ఎథికల్, లీగల్ జర్నలిజం పాటించాలని పాశం సూచించారు. సోషల్ మీడియా సోషల్ ఎకానమీ, సామాన్యులతో భాగస్వామి కావాలని పాశం అన్నారు. భోపాల్ గ్యాస్ లీక్ మారణహోమం గురించి ఏ పత్రిక వార్తలను వ్రాయలేదు అంటే ప్రజలకు సంబంధించిన వార్తలు పత్రికలు ప్రచురించవు అని తేలిపోయిందని ఆరోపించారు.
పెట్టుబడికి, కట్టుకథలకు పుట్టినిల్లు, విష పుత్రికలు పత్రికలు అని శ్రీశ్రీ ఊరికనే అనలేదని పాశం అన్నారు. నోబడి రైట్స్ ఎడిటోరియల్స్, ఎవ్రీబడి రైట్స్ ప్రొప్రైటర్స్ అంటే ఏ ఎడిటర్ తన స్వంత అభిప్రాయాలు వ్రాయరని, యాజమాన్యాల అభిప్రాయాలు వ్రాస్తారని ఐఎఫ్ డబ్ల్యూజె ఫౌండర్, నేషనల్ హార్డ్ పత్రిక ఎడిటర్ చలపతిరావు తేల్చి చెప్పారని పాశం అన్నారు.
ఆంక్షలు లేని సోషల్ మీడియా..
అచ్చు యంత్రాలదే పత్రికా స్వాతంత్ర్యమని అది మాఫియాగా మారిందని చలపతిరావు ఆరోజలలోనే చెప్పారని, సోషల్ మీడియాలకు అలాంటి ఆంక్షలు లేవని చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంటే చాలని, మన స్వంత అభిప్రాయాలు మనమే చూపించవచ్చని పాశం కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. సోషల్ మీడియా మాఫియా వాయిస్ కాకుండా ప్రజల వాయిస్ గా ఉండాలని పాశం పిలుపు నిచ్చారు. జర్నలిజానికి కేంద్ర బింధువుగా ఎవరు ఉండరని తుప్పు పట్టిన జర్నలిజాన్ని యాసిడ్ పోసి కడగాలని ఆయన సోషల్ మీడియాలను ఆదేశించారు. కూలి నాలి, రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు చుట్టూ సోషల్ మీడియా పరుగెత్తాలని పాశం కోరారు.
కార్యక్రమంలో వర్ధన్నపేట మాజీ శాసన సభ్యులు, దివీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ వన్నాల శ్రీరాములు, ఐజేయూ కార్యవర్గ సభ్యులు దాసరి కృష్ణారెడ్డి, కర్నాకర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రాదాకృష్ణా, డాక్టర్ వన్నాల వెంకట రమణ, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం జనరల్ సెక్రటరీ శోభన్ బాబు, మేడారం టివీ సీఈవో పరకాల సమ్మయ్య గౌడ్, టిఎజెఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆర్వీ ప్రసాద్, అక్షరశక్తి ఎడిటర్ మునుక రవి, ప్రతి పక్షం టివి సీఈవో వి సతీష్, వేకువ ఎడిటర్ దుర్గాప్రసాద్, జన్ను ప్రమీల, ఎస్ రామారావు, కుమార్, కిషోర్, నాంపల్లి, వేణు, ధనలక్ష్మి, ముతేష్, కెడల ప్రసాద్, శ్రీహరి, రాజు, జి.స్వామి, శ్రీనివాస్, ఖుర్షిద్ తదితరులు పాల్గొన్నారు.