తెలంగాణ అప్పు రూ.6 లక్షల 71,757 కోట్లు: ఉప ముఖ్యమంత్రి భట్టి

తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుధవారం శాసన సభలో శ్వేత పత్రం ప్రకటించింది

  • Publish Date - December 20, 2023 / 08:35 AM IST
  • మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు
  • బీఆరెస్ ప్రభుత్వంపై భట్టి విమర్శలు

విధాత : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుధవారం శాసన సభలో శ్వేత పత్రం ప్రకటించింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క 42 పేజీల శ్వేత పత్రాన్ని సభలో ప్రవేశపెట్టారు. దీనిని సభ లఘు చర్చకు స్వీకరించింది. ఎన్నో కలలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పాలనలో ఆర్థిక అరాచడం, విధ్వంసం సాగిందని భట్టి ఆరోపించారు. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా 2014-15లో మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని తొమ్మిదిన్నర ఏళ్ల బీఆరెస్ పాలనలో ఏకంగా 6లక్షల 71వేల 757కోట్ల అప్పుల పాలు చేశారని ప్రభుత్వం ఈ శ్వేత పత్రంలో ఆందోళన వ్యక్తం చేసింది. ఎఫ్‌ఆర్‌బీఎం సిఫార్సు మేరకు 25శాతం పరిధిలో ఉండాల్సిన రుణ-జీఎస్డీపీ నిష్పత్తి 36.9 శాతంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో 17 ఎస్‌పీవీలు, సంస్థల బడ్జెటేతర రుణాలు 1,85,029 కోట్లుగా ఉన్నాయని, వాటి బకాయిలు 1లక్ష 27వేల 208కోట్లుగా ఉందని తెలిపింది.


అలాగే 14 ఎస్‌పీవీలు, సంస్థలు ప్రభుత్వం హామీల ద్వారా 1,18,557కోట్ల రుణాలు సేకరించాయని, వాటి అసలు, వడ్డీని తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్నాయని, వీటిలో 95,462కోట్లు, ప్రభుత్వం చెల్లించని, హామీలేని రుణాలు 59,414కోట్లు కూడా కలిపి మొత్తం అప్పు 6,71,757 కోట్లుగా ఉందని ప్రభుత్వం వెల్లడించింది. రుణాల చెల్లింపు భారం నానాటికీ పెరిగిపోతుందని, రుణ చెల్లింపుల భారం బడ్జెటేతర రుణాల చెల్లింపులతో పోల్చి చూస్తే 2014-15లో 4శాతంగా ఉంటే 2023-24లో 39 శాతానికి పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. రెవెన్యూ రాబడిలో రుణ చెల్లింపుల భారం 2014-15లో 14శాతంగా ఉంటే 2023-24లో 34శాతానికి పెరిగిందని, రాష్ట్రం ఆదాయంలో సింహభాగం రుణాల చెల్లింపులకే సరిపోతుందని తెలిపింది. ప్రస్తుతం 2023 డిసెంబర్ నాటికి ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సరఫరాదారులు, ఇతరులకు 40,154 కోట్లతో 4,78,168 బిల్లులను క్లియర్ చేయాల్సివుందని వెల్లడించింది.


2014-15లో జీతాలు, పెన్షన్ల వ్యయం 17,130 కోట్లుగా ఉండగా, 2021-22లో 48,809కోట్లకు పెరిగిందని, రాబడిలో 38శాతం వాటాను అవి కల్గివున్నాయని తెలిపింది. ఇది రాబోయే వేతన సవరణ సంఘం సిఫారసులు, ఖాళీల భర్తీ, అలవెన్సుల చెల్లింపులతో మరింత పెరుగనుంది. 2014-15లో 303రోజులు నగదు నిల్వలుండగా, 2023-24లో 328 రోజులు కూడా అడ్వాన్సులు, ఓవర్ డ్రాఫ్టుల మీదనే సాగుతున్న తీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డొల్లతనానికి నిదర్శనమని తెలిపింది. రెవెన్యూ లోటు 0.3శాతంగా, ద్రవ్య లోటు 19శాతంగా ఉందన్నారు. రాష్ట్ర ఆదాయం 2014-15లో వ్యయం కంటే 9,410కోట్లు మాత్రమే తగ్గగా, 2021-22లో 5రేట్లు పెరిగిందని తెలిపింది. ద్రవ్యలోటు- జీఎస్డీపీ నిష్పత్తి దేశంలోని 18రాష్ట్రాలతో పోల్చితే 4.1 శాతంతో తెలంగాణ 16వ స్థానంలో ఉందని శేతపత్రం పేర్కొన్నది.


ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 57 సంవత్సరాల కాలంలో 4.98లక్షల కోట్లు ఖర్చు చేసి రోడ్లు, నీటి పారుదల ప్రాజెక్టులు, ఆసుపత్రులు, విద్యుత్తు ఫ్లాంట్లు, ఐటీ రంగాలను నెలకొల్పాగా, గత పదేళ్లలో చేసిన ఖర్చుకు తగ్గ ఆస్తులు, సౌకర్యాలు సృష్టించలేదని ప్రభుత్వం ఆరోపించింది. రాష్ట్ర బడ్జెట్, బడ్జెటేతర రుణం గణనీయంగా పెరిగి, రుణ చెల్లింపుల భారం రాష్ట్ర రెవెన్యూ రాబడిలో 34శాతానికి పెరిగిందని పేర్కొన్నది. రెవెన్యూ రాబడిలో 35శాతం వాటా ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం వినియోగిస్తున్నట్టు తెలిపింది. కచ్చితంగా చేయాల్సిన ఈ వ్యయం వల్ల సమాజంలోని పేద వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, వృద్ధి పెరుగుటకు ఆర్థిక వెసులుబాట్లు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం విద్య, ఆరోగ్య వంటి రంగాలపై ఇప్పటిదాకా చేసిన ఖర్చు దేశంలోనే అత్యల్పంగా ఉందన్నారు.


మొత్తంగా మిగులు రాష్ట్రం గత పదేళ్లలో అప్పుల ఉబిలో కూరుకుపోయిందని, బడ్జెటేతర రుణాలు పెరిగిపోవడం ఇందుకు ప్రధాన కారణమని శ్వేతపత్రం ఆరోపించింది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తమ ప్రభుత్వం రాష్ట్ర వనరులను పెంచడానికి, నిరుపేదలను ఉద్ధరించడానికి, ప్రత్యక్ష వ్యయాలను పెంచడానికి, అనవసరమైన ఖర్చులను తగ్గించడానికి ప్రతి ప్రయత్నం చేస్తుందని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజలు మార్పు కోసం ఇచ్చిన ఆదేశాన్ని, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల హామీలను నెరవేర్చడానికి ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వం దృఢ చిత్తంతో ముందుకెళుతుందని భట్టి విక్రమార్క చెప్పారు.