Dharani Portal | ధరణితో.. బ్రోకర్లు బాగు పడుతున్నారు: హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

Dharani సమస్యలు పరిష్కారం కాకపోగా.. పెరిగాయి కోర్టుకు రోజూ 30, 40 పిటిషన్లు వస్తున్నాయి ఈ సమస్యలను మీరు ఎలా పరిష్కరిస్తారు? CCLAకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రశ్న నాలుగు వారాల్లో ధరణి సమస్యలు పరిష్కరిస్తాం హైకోర్టుకు హామీ ఇచ్చిన సీసీఎల్‌ నవీన్‌ మిట్టల్‌ విధాత: ధరణి (Dharani Portal ) వల్ల సమస్యలు తీరకపోగా, బ్రోకర్లు బాగుపడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. భూక్రయవిక్రయాలు జరిగినప్పుడు సంబంధిత వ్యక్తులకు సేల్‌డీడ్‌ సర్టిఫైడ్‌ కాపీలు ఇవ్వడం లేదన్న అంశంపై వేర్వేరుగా […]

  • Publish Date - April 25, 2023 / 03:53 AM IST

Dharani

  • సమస్యలు పరిష్కారం కాకపోగా.. పెరిగాయి
  • కోర్టుకు రోజూ 30, 40 పిటిషన్లు వస్తున్నాయి
  • ఈ సమస్యలను మీరు ఎలా పరిష్కరిస్తారు?
  • CCLAకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రశ్న
  • నాలుగు వారాల్లో ధరణి సమస్యలు పరిష్కరిస్తాం
  • హైకోర్టుకు హామీ ఇచ్చిన సీసీఎల్‌ నవీన్‌ మిట్టల్‌

విధాత: ధరణి (Dharani Portal ) వల్ల సమస్యలు తీరకపోగా, బ్రోకర్లు బాగుపడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. భూక్రయవిక్రయాలు జరిగినప్పుడు సంబంధిత వ్యక్తులకు సేల్‌డీడ్‌ సర్టిఫైడ్‌ కాపీలు ఇవ్వడం లేదన్న అంశంపై వేర్వేరుగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కే లక్ష్మణ్‌ మంగళవారం విచారణ జరిపారు.

సోమవారం ఇదే అంశంపై జరిగిన విచారణ సందర్భంగా ఈ అంశంలో సీసీఎల్‌ఏ చీఫ్‌ కమిషనర్‌ స్వయంగా కోర్టుకు హాజరై, వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చీఫ్ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ మంగళవారం కోర్టుకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కోర్టుకు వివరణ ఇస్తూ.. 4 వారాల్లోగా మాడ్యూల్స్‌ తెరుచుకుంటాయని, అన్ని సమస్యలూ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు సర్టిఫైడ్‌ కాపీలు ఇవ్వకపోతే అది సరైందా? లేదా? అని ధ్రువీకరించుకునేందుకు ప్రజలు ఎక్కడికి పోవాలని న్యాయమూర్తి ప్రశ్నించారు.

సక్సెషన్‌, పార్టిషన్‌ సర్టిఫికెట్‌లు ఇవ్వడం లేదని, రిజెక్టెడ్‌ అనే ఒకే ఒక్క పదంతో దరఖాస్తును తిరస్కరిస్తున్నారని పేర్కొన్న న్యాయమూర్తి.. ఎందుకు తిరస్కరించారో కారణాలు మాత్రం చెప్పడం లేదని వ్యాఖ్యానించారు.

నాలుగైదు గుంటల విషయంలో కూడా మాడ్యూల్‌ రిజెక్ట్‌ చేస్తున్నదని తన వద్దకు వచ్చిన ఆదిలాబాద్‌ వ్యక్తి కేసును న్యాయమూర్తి ఉదహరించారు. 45 రోజులు అయినా పని కాకపోతే తన దగ్గరకు పిటిషన్‌ వచ్చిందని తెలిపారు. రెండు వారాల్లో క్లియర్‌ చేయాల్సినవి కూడా చేయడం లేదని అన్నారు.

ధరణి(Dharani) ద్వారా సమస్యలు పరిష్కారం అవడం లేదని, పైగా బ్రోకర్ల వద్దకు వెళ్లేలా పరిస్థితి తయారైందని, ఫలితంగా బ్రోకర్లే లాభపడుతున్నారని వ్యాఖ్యానించారు. ధరణిలో సమస్యలు ఉండటంతో తమ వద్దకు రోజు 30 నుంచి 40 కేసులు వస్తున్నాయని, దాంతో కోర్టుపై ఎంతో భారం పడుతున్నదని అన్నారు.

దీనిని ఎలా పరిష్కరిస్తారని నిలదీశారు. దీనికి నవీన్‌ మిట్టల్‌ స్పందిస్తూ.. నాలుగు వారాల్లోగా ధరణి (Dharani)లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని, మాడ్యూల్స్‌ అన్నీ ఓపెన్‌ చేస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. భూముల క్రయవిక్రయాల్లో మరింత పారదర్శకత, వేగంగా పని కావడం అనే ఆలోచనతో ధరణి పోర్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.

అయితే అనేక అంశాల్లో అది సరిగ్గా పనిచేయకపోవడంతో సమస్యలు ఎక్కడ ఉన్నవి అక్కడే అన్నట్టు తయారైంది. ఏదైనా క్రయవిక్రయం జరిగినప్పుడు సేల్‌డీడ్‌ సర్టిఫైడ్‌ కాపీని పొందడం సంబంధిత వ్యక్తుల హక్కు. దీనిని ఇండియన్‌ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ కల్పించింది. 300 రూపాయలు ఫీజు చెల్లించి ఎవరైనా వాటిని పొందవచ్చు.

అది పబ్లిక్‌ డాక్యుమెంట్‌. సర్టిఫైడ్‌ కాపీని నిరాకరించడానికి ఏ అధికారికీ అధికారం లేదు. కానీ.. ప్రభుత్వం చాకచక్యంగా వారి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ధరణిలో జరిగిన క్రయవిక్రయాలకు సంబంధించిన సర్టిఫైడ్‌ కాపీలు ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇవే కాకుండా సక్సెషన్‌ కాపీలు, పహాణీలు కూడా ఇవ్వకపోవడంతో అనేక మంది కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే సీసీఎల్‌ఏను కోర్టుకు పిలిపించారు. ఆయన నాలుగు వారాల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు.

Latest News