Dharani |
గతంలో భూ రికార్డుల, భూ సరిహద్దులు, ఇతర ఏ విధమైన వివాదం వచ్చినా మండల, డివిజన్, జాయింట్ కలెక్టర్ల స్థాయిలో రెవెన్యూ కోర్టులు ఉండేవి. ఏదో ఒక కోర్టులో రైతుకు న్యాయం జరిగేది. రాష్ట్రంలో రెవెన్యూ కోర్టులను తెలంగాణ సర్కార్ రద్దుతో రైతుకు న్యాయం దక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఏ చిన్న వివాదం వచ్చినా సివిల్ కోర్టులకు పోవాల్సి వస్తున్నది. దీంతో దూరాభారంతో పాటు ఖర్చు భారీగా పెరిగిపోయిందని రైతులు వాపోతున్నారు. రెవెన్యూ కోర్టుల్లో ఉన్న కేసులను ట్రిబ్యునళ్లకు అప్పగించి, ప్రభుత్వం చేతులు దులుపుకొన్నది. ట్రిబ్యునళ్లు సివిల్ కోర్టులకే పొమ్మంటూ ఉచిత సలహాలను ఇస్తుండటంతో రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లా కేంద్రంలో శాశ్వత రెవెన్యూ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. తర్వాత విస్మరించింది. – బూడిద సుధాకర్, విధాత హైదరాబాద్ ప్రతినిధి
రాష్ట్రంలో భూ సమస్యలను తెలుసుకునేందుకు, పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులను పెడతామని గతంలో అప్పటి సీఎస్ ప్రకటించారు. కానీ వెంటనే వెనక్కి తగ్గి, మళ్లీ తేదీలను ప్రకటిస్తామన్నారు. నెలలు గడుస్తున్నప్పటికీ రెవెన్యూ సదస్సుల మాటే ఎత్తడం లేదు. ధరణిలో దొర్లిన తప్పులతోనే రైతులంతా ఇబ్బందులు పడుతున్నారు. ధరణి పోర్టల్ విషయంలో ముఖ్యమంత్రి చెప్పే మాటలకు, జరుగుతున్న దానికి పొంతన లేకుండా పోయింది.
కొన్ని అంశాలను పరిశీలిస్తే..
కేసీఆర్ మాట..
ధరణి పోర్టల్ రాక ముందు రిజిస్ట్రేషన్ అయిన భూములను రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ఆధారంగా కొన్నవారి పేరిట జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మ్యుటేషన్ చేయాలి. దీనికోసం మీ సేవ ద్వారా మ్యుటేషన్ దరఖాస్తులు స్వీకరించి, ప్లాట్లు, కేటాయించాలి.
జరుగుతున్నది
ధరణి రాకకు ముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి పేర్ల మీదకు రికార్డులు ఇంకా మారలేదు. పాత యాజమానుల పేర్లే ధరణిలో ఉండటంతో కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు. తమ పేరు మీదకు మార్చాలని దరఖాస్తు పెట్టుకుంటే కొన్ని పెండింగ్‌లో ఉంటున్నాయి. మరికొన్ని తిరస్కరణకు గురవుతున్నాయి. అందుకు కారణం పాత పట్టడారుడు వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలనే నిబంధనలే కారణం.
కేసీఆర్ మాట..
సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి యాజమాన్య హక్కులను ఖరారు చేయాలి. క్రమబద్ధీకరించిన సాదాబైనామాల ప్రకారం భూముల వివరాలను ధరణిలో నమోదు చేయాలి. పట్టాదారు పాస్ బుక్కులు ఇవ్వాలి.
జరుగుతున్నది
అసలు సాదా బైనామాల ముచ్చటనే పట్టించుకోవడం లేదు. సాదా బైనామాల క్రమబద్ధీకరణ ఊసే లేదు.
కేసీఆర్ మాట
కోర్టుల విచారణలో ఉన్నవి మినహా, భూ రికార్డుల సమగ్ర సర్వే సందర్భంగా పార్ట్-బీలో పెట్టిన వ్యవసాయ భూములకు సంబంధించిన అంశాలన్నింటినీ కలెక్టర్లు 60 రోజుల్లో పరిష్కరించాలి. అవసరమైన సందర్భాల్లో కలెక్టర్లు క్షేత్ర స్థాయి లో విచారణ జరిపి నిర్ణయాలు తీసుకోవాలి. యాజమాన్య హక్కులను ఖరారు చేయాలి.
జరుగుతున్నది
వేల సంఖ్యలో వస్తున్న దరఖాస్తులను పరిష్కరించే సమయం కలెక్టర్లకు లేదు. డాష్ బోర్డును ఖాళీ చేసుకునే ఉద్దేశంతో.. కారణం చెప్పకుండానే దరఖాస్తులు తిరస్కరించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ మాట
కొన్ని చోట్ల ఒకే సర్వే నంబరులో ప్రభుత్వ, ప్రైవేటు భూములున్నాయి. ఆ సర్వే నంబరును నిషేధిత జాబితా (22/ఏ) లో పెట్టారు. అలా పెట్టిన చోట్ల కలెక్టర్లు విచారణ జరిపి, ఏది ప్రభుత్వ భూమి? ఏది ప్రైవేటు భూమి? అనేది నిర్ణయించాలి. అర్హుల వివరాలను ధరణిలో చేర్చి, పాస్ పుస్తకాలు ఇవ్వాలి.
జరుగుతున్నది
నిషేధిత భూముల జాబితాలకు పట్టా భూములు చేరాయనే ఫిర్యాదులు వేల సంఖ్యలో వస్తున్నాయి. రైతులు ఎన్నిసార్లు దరఖాస్తులు చేసినా వీటిని పరిష్కరించడం లేదు.
కేసీఆర్ మాట
అసైన్ చేసిన భూములు అనుభవిస్తున్న రైతులు మరణిస్తే, వారి చట్టబద్ధ వారసులకు ఆ భూములను బదలాయించాలి.
జరుగుతున్నది
ఏళ్లుగా సాగు చేసుకుంటున్న అసైన్‌మెంట్ భూములు ఇప్పుడు ప్రభుత్వ భూములుగా చూపిస్తోంది. తమ పేర్ల మీదకు మార్చాలని చేసుకుంటున్న దరఖాస్తులు వృథానే తప్ప పరిష్కారం కావడం లేదు.
కేసీఆర్ మాట
ఇనామ్ భూములను సాగు చేసుకుంటున్న హక్కుదారులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇచ్చి, ఆ వివరాలను ధరణిలో నమోదు చేయాలి.
జరుగుతున్నది
ధరణి వచ్చిన తర్వాత అసలు ఇనామ్ భూముల గురించి ప్రభుత్వం ఆలోచించిన పాపాన పోలేదు.
సమస్యలు సవాలక్ష