Dharani | దారి తప్పిన ధరణి.. ఢిల్లీ ‘ఆధార్’.. ఉప్పుగూడ ‘సిమ్‌కార్డ్‌’.. 10 ఎకరాలు మటాష్

Dharani ఢిల్లీ ఆధార్.. ఉప్పుగూడ సిమ్‌కార్డ్‌.. 10 ఎకరాలు మటాష్ జాడ తెలియని యజమాని వసంత వసంత ధరణిలో 4 దరఖాస్తులు.. మూడింటిని తిరస్కరించిన తహసీల్దార్‌ రంగంలోకి దిగిన ఓ శాసన సభ్యుడు వసంత కేరాఫ్ నారాయణరావు పేర నకిలీ సిమ్‌కార్డ్‌, ఆధార్‌ కార్డుల సృష్టి బినామీ పేర్లపై రిజిస్ట్రేషన్‌.. అమ్మకం యాదాద్రి జిల్లా కొండమడుగులో సిత్రం ‘పట్టాదారుల ప్రమేయం లేకుండా ఇంచు భూమిపై కూడా క్రయవిక్రయాలు చేయలేరు. పట్టాదారుల వేలిముద్రలు, కంటి చూపులు సరిపోలితేనే ధరణిలో […]

  • Publish Date - June 9, 2023 / 06:18 AM IST

Dharani

  • ఢిల్లీ ఆధార్.. ఉప్పుగూడ సిమ్‌కార్డ్‌.. 10 ఎకరాలు మటాష్
  • జాడ తెలియని యజమాని వసంత
  • వసంత ధరణిలో 4 దరఖాస్తులు.. మూడింటిని తిరస్కరించిన తహసీల్దార్‌
  • రంగంలోకి దిగిన ఓ శాసన సభ్యుడు
  • వసంత కేరాఫ్ నారాయణరావు పేర నకిలీ సిమ్‌కార్డ్‌, ఆధార్‌ కార్డుల సృష్టి
  • బినామీ పేర్లపై రిజిస్ట్రేషన్‌.. అమ్మకం
  • యాదాద్రి జిల్లా కొండమడుగులో సిత్రం

‘పట్టాదారుల ప్రమేయం లేకుండా ఇంచు భూమిపై కూడా క్రయవిక్రయాలు చేయలేరు. పట్టాదారుల వేలిముద్రలు, కంటి చూపులు సరిపోలితేనే ధరణిలో యాజమాన్య హక్కులు మార్పులు చేర్పులు జరుగుతాయి. ఎంత పెద్దల్యాండ్ గ్రాబర్ వచ్చినా, రౌడీలు వచ్చినా.. స్వయంగా ఈ రాష్ట్ర పరిపాలకుడిగా నేనే వచ్చినా.. తెలంగాణలో భూములున్న పట్టాదారుడు ప్రపంచంలో ఎక్కడా ఉన్నా అతని అనుమతి లేకుండా అతని భూరికార్డును చెడిపేయలేం.

ప్రపంచంలోనే అత్యంత పాదర్శకత ఉన్న ధరణి ఓ అద్భుతం.” ఇవి ధరణి పోర్టల్‌ ప్రారంభ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ.. కొందరు యజమాని లేని పదెకరాల భూమిని దర్జాగా రిజిస్ట్రేషన్ చేయించి.. అమ్మకాలు కూడా మొదలు పెట్టేశారు. దీని వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం ఉన్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదీ ఆ కథాకమామిషు!

విధాత, హైదరాబాద్ ప్రతినిధి:

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బీబీనగర్ మండలంలో గల కొండమడుగు గ్రామంలో ధరణి పోర్టల్‌ దారి తప్పిందన్న విమర్శలు వెలువడుతున్నాయి. కొండమడుగు గ్రామ రెవెన్యూ పరిధిలోని 591, 592, 595 సర్వే నెంబర్లలో వరంగల్ జాతీయ రహదారి పక్కనే రాంపల్లి ఈశ్వరయ్య అనే వ్యక్తికి 10.02 1/2 ఎకరాల భూమి ఉంది.

ఆ భూమిని వసంత అనే మహిళ 1982లో కొనుగోలు (డాక్యుమెంట్ నెంబర్-721/1982) చేశారు. ఆ తరువాత వసంత జాడా లేకుండా పోయారు. ఆమె సంబంధీకులు కూడా ఆ భూమివైపు కన్నెత్తి చూడలేదు. అయితే కొనుగోలు చేసినప్పటి నుంచి నేటి వరకు పహాణీలలో, ధరణి రికార్డులలో కూడా వసంత పేరే నమోదై ఉంది.

ధరణి అమల్లోకి రావడంతో…

2018లో తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. రైతులకు కొత్త పాస్‌బుక్‌లు జారీ చేసింది. వసంత దొరైస్వామిపేర ధరణిలో 10.02 ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ అధికారులు జారీ చేసిన 1బీ-ప్రొసీడింగ్‌ను ఆమె తరఫున ఎవరూ స్వీకరించలేదని సమాచారం. ఆధార్ కార్డుతో పాటు ఇతర వివరాలను సమర్పించి, కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోనందున వసంత పేరు ధరణిలో ఉన్నప్పటికీ.. అధికారులు పాసుపుస్తకం జారీ చేయలేదు. రెవెన్యూ అధికారులు సేల్‌ డీడ్‌లో పేర్కొన్న అడ్రస్‌కు (చిక్కడపల్లి) నోటీసులు పంపినా అక్కడ ఆ పేరుతో ఎవ్వరూ లేరని తెలిసింది. అయితే విచిత్రంగా.. తానే వసంతనంటూ నలుగురు ముందుకు వచ్చారు. తనకే కేవైసీ చేయాలని ధరణిలో దరఖాస్తు చేసుకున్నారు.

తొలుత తిరస్కరణ.. ఎమ్మెల్యే ఎంట్రీతో క్లియర్‌

ఒకే భూమిపై తమకే కేవైసీ చేయాలంటూ నలుగురు వసంతలు దరఖాస్తులు సమర్పించడంతో బీబీనగర్ తహసీల్దార్ తొలుత ముగ్గురి దరఖాస్తులను తిరస్కరించారు. కానీ కానీ.. ఒక ఎమ్మెల్యే ఎంట్రీ ఇవ్వడంతో తహసీల్దార్ తోకముడిచారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ విషయంలో పెద్ద మొత్తంలో డబ్బు కూడా చేతులు మారిందని అంటున్నారు. ఢిల్లీ అడ్రస్‌తో ఉన్న వసంత పేరు మీద ఆధార్ కార్డు, ఆధార్‌ను జత చేసేందుకు హైదరాబాద్ పాతబస్తీలోని ఉప్పగూడ నుంచి ఓ సిమ్‌కార్డు రిజిస్ట్రేషన్ రోజునాడే పరిగెత్తుకొచ్చాయి. దాంతో 10.02 1/2 ఎకరాలను బీబీనగర్ తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేశారు.

వెను వెంటనే క్రయవిక్రయాలు!

ధరణిని దారి తప్పించి, పట్టాలు పొందిన భూమిపై వెను వెంటనే క్రయవిక్రయాలు చేసేందుకు నకిలీ పట్టాదారులు ఏర్పాట్లు చేశారు. దీని వెనుక సదరు ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేకు నమ్మిన బంటుగా ఉన్న ఓ మండల స్థాయి లీడర్ ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించాడని సమాచారం.

2023 ఏప్రిల్ 10వ తేదీన 595 సర్వే నెంబర్‌లో ఉన్న 4.23 1/2 ఎకరాలలో కృష్ణమూర్తి యాదవ్ అనే వ్యక్తికి ఒక ఎకరం (పాస్ బుక్ నెంబర్ – టీ 30060051283), 2023 ఏప్రిల్ 21వ తేదీన కందారి సుహాసిని అనే మహిళ పేర 3.23 ఎకరాలను (పాస్‌బుక్‌ నెంబర్ -టీ30060051286) రిజిస్ట్రేషన్ చేశారు. కానీ ఇందులో 2.03 1/2 ఎకరాలకు మాత్రమే తహసీల్దార్ డిజిటల్ సంతకం జరిగింది.

అడ్డం తిరిగిన అక్రమం

1982లో తమకు తెలియకుండా తమ చిన్నాయన ఈ భూమిని వసంత దొరైస్వామి అనే మహిళకు విక్రయించాడని, ఇందులో తమకూ వాటా ఉందంటూ రాంపల్లి రమేష్ అనే వ్యక్తి బీబీనగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో హల్చల్ చేశాడు. ఈ భూములపై మళ్లీ రిజిస్ట్రేషన్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటానంటే మండల కార్యాలయంలో హంగామా చేయడంతో ఈ క్రయవిక్రయాల ప్రక్రియకు బీబీనగర్ తహసీల్దార్ తాత్కాలికంగా బ్రేకులు వేశారు.

ముందుకు తిరస్కరించి.. తర్వాత ఆమోదించి.!

సాధారణంగా భూముల రిజిస్ట్రేషన్లు, భూ యాజమాన్య హక్కుల మార్పిడి ప్రక్రియ సమయంలో క్రయవిక్రయదారులు సమర్పించే ప్రతిపత్రాన్ని అత్యంత నిశితంగా పరిశీలించి ప్రక్రియను కొనసాగించాల్సి ఉంటుంది. అంతకు ముందు ఒకే భూమిని తమదేనంటూ ముగ్గురు వసంతలు రావడంపై అభ్యంతరం చెప్పిన తహసీల్దార్‌.. కేవైసీ కోసం సమర్పించిన ఆధార్ కార్డును ఎందుకు పరిశీలించలేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో ఇలా ఉండేది..

గతంలో భూమి ఉండి ఆ భూమి యజమానితో పాటు ఎలాంటి వారసులు కూడా లేనైట్లెతే ఆ భూమిపై పంచనామ చేసి సరిహద్దు రైతుల సంతకాలు, వాగ్మూలం తీసుకొని (Andhra Pradesh Excheats and Bona Vacantia Act, 1974) (Act35/1974) ప్రకారం బోనావేకేన్షియా భూములుగా నమోదు చేసేవారు. సీసీఎల్ఏ, జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో స్థానిక వీఆర్ఓ, ఎమ్మార్వో పరిరక్షించేవారు.

కానీ ప్రస్తుతం ఈ ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం చరమగీతం పాడటంతో తాహసీల్దార్లు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నట్టయింది. దీంతో ఇలా వారసులు లేని భూములను రాజకీయ నాయకుల బినామీలు, కబ్జాకోరులు నకిలీ పత్రాలతో తమ తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒక్కో డాక్యుమెంట్‌లో ఒక్కో రకంగా..

ధరణిలో రిజిస్ట్రేషన్‌ కోసం వసంత పేరిట ఉన్న ఒరిజనల్‌ సేల్‌డీడ్‌లో వసంత తండ్రి పేరు దొరైస్వామి అని ఉన్నది. ధరణి రికార్డులో వసంత తండ్రి పేరు నారయణరావు అని ఉన్నది. అలాగే వసంతకు సంబంధించిన ఆధార్‌ కార్డులో వసంత కేరాఫ్‌ నారాయణ రావు అని ఉంది. ఇన్ని తేడాలున్నా డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ కావడం గమనార్హం.

ధరణి పేరుతో కొల్లగొడుతున్నారు

ధరణి వచ్చినప్పటి నుంచి అధికార బీఆర్ఎస్ నాయకులు విలువైన భూములను కొల్లగొడుతున్నారు. కొండమడుగులోని భూములను కూడా నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు క్రయ విక్రయాలు చేస్తున్నారు. ఇప్పటికైనా సీసీఎల్ఏ ఉన్నతాధికారులు, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఈ అంశంపై విచారణ చేసి, బాధ్యుడైన ఎమ్మెల్యే, అతని అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామ‌ని యాదాద్రి-భువనగిరి బీజేపీ ఉపాధ్యక్షులు పిట్టల అశోక్ అన్నారు.

  • బూడిద సుధాకర్‌

Latest News