Dharani |
అవి ప్రభుత్వ భూములు. ఆ భూములను చాలా సంవత్సరాల కిందట సాగు చేసుకునేందుకు భూమి లేని రైతులకు కేటాయించారు. ఆ రైతులు అసైన్డ్ భూములను ఇతరులకు విక్రయించారు. అసైన్డ్ చట్టాన్ని దుర్వినియోగం చేశారని పీవోటీ చట్టం కింద ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
అదే భూమిని తెలంగాణ క్రీడా ప్రాంగణానికి కేటాయించింది. కానీ తాజాగా ధరణిలో అసైన్డ్‌దారులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ అయ్యాయి. మరో రెండు సర్వే నంబర్లలో ఉన్న అసైన్డ్‌దారులు కూడా అసైన్డ్ చట్టాన్ని దుర్వినియోగం చేయడంతో ఆ భూములను స్వాధీనం చేసుకుని అటవీ శాఖకు కేటాయించారు.
కానీ ఆ భూములను మరో వ్యక్తి కొనుగోలు చేసి వెంచర్ చేయడంతో పాటు సబ్ రిజిస్ట్రార్ వద్ద వందల మందికి రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు ఆ భూములు ప్రభుత్వానివా? అటవీ శాఖవా? అసైన్డ్‌దారులవా? వెంచర్‌గా మారిన సమయంలో ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లవా? మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండల అంకుషాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో జరిగిన ధరణి గందరగోళంపై విధాత ప్రత్యేక కథనం..
విధాత, హైదరాబాద్ ప్రతినిధి: ఘట్‌కేసర్ మండల పరిధిలోని అంకుషాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 196లో సుమారు 18.34 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని సాగుచేసుకునేందుకు చాలా సంవత్సరాల కిందట గంగి జగన్‌తోపాటు మరికొంత మందికి అసైన్ చేశారు. కానీ అసైన్డ్ నిబంధనలకు విరుద్ధంగా గంగి జగన్, మరికొందరు భూములను ఘట్‌కేసర్ సబ్ రిజిస్ట్రార్ వద్ద ఎస్ వెంకటేశ్వర్లు (సేల్ డీడ్ నంబర్ – 14385-2008) అనే వ్యక్తికి విక్రయించారు.
విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఆ భూములను పీవోటీ యాక్టు కింద స్వాధీనం (పీవోటీ ఫైల్ నంబర్ బీ/11/2009) చేసుకుని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ సూచిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఈ భూమిని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంలో 2011లో కుసుమ అనే మహిళకు విక్రయించారు. కానీ రెవెన్యూ అధికారులు కొద్ది రోజుల కిందటే ఈ భూమిని తెలంగాణ క్రీడా ప్రాంగణానికి కేటాయించి ఘట్‌కేసర్ ఎంపీడీవోకు అప్పగించారు.
ఈ క్రమంలోనే తెలంగాణ క్రీడా ప్రాంగణ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు మంత్రి మల్లారెడ్డి రావడంతో ఈ భూమి నాదని, నా వద్ద తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పట్టాదార్ పాస్ పుస్తకం కూడా ఉన్నదని గంగి జగన్ అనే వ్యక్తి మంత్రి వద్ద వాపోయాడట. పీవోటీ కింద స్వాధీనం చేసుకున్న భూమికి ధరణిలో పట్టా ఎలా జారీ చేశారని అధికారులపై గుర్రుమన్న మంత్రి చివరకు శంకుస్థాపన చేయకుండానే వెనుదిరిగాడని స్థానిక ప్రజలు తెలిపారు. అలాగే ప్రభుత్వ భూమిని అసైన్డ్‌దారులు విక్రయిస్తే ఘట్‌కేసర్ సబ్ రిజిస్ట్రార్ సేల్‌డీడ్ ఏ నిబంధనల ప్రకారం చేశాడో అంతుచిక్కని ప్రశ్న.
అటవీ శాఖకు కేటాయించినా…
అంకుషాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 210లో 11.38 ఎకరాల భూమి, 211 సర్వే నంబర్‌లో 9.6 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని గతంలో అంజయ్య, బద్దం యాదిరెడ్డి, గంగి దశరథ, సీహెచ్ సర్వయ్య, పాండాల నర్సింహ్మతో పాటు మరికొంత మంది రైతులకు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం కేటాయించింది. కానీ అసైన్డ్‌దారులు చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూమిపై వెంచర్ చేసి ఇతరులకు విక్రయించడంతో ప్రభుత్వం పీవోటీ చట్టం ప్రకారం (పీవోటీ ఫైల్ నంబర్ బి/11/2009) స్వాదీనం చేసుకోవడం జరిగింది.
అనంతరం 210, 211 సర్వే నంబర్లలో ఉన్న సుమారు 21 ఎకరాల భూమిని ప్రభుత్వం అటవీ శాఖకు (ఎల్‌సీ-1080-2017) కేటాయిస్తూ 2018 జూలైలో 3వ తేదీన ఆర్డర్ జారీ చేశారు. కానీ గతంలో అసైన్డ్ భూమిపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్లు నేటి వరకు రద్దు చేయని కారణంగా ధరణిలో అటవీ భూమిగా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రం ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన సేల్ డీడ్‌లు దర్శనం ఇస్తున్నాయి.
అంకుషాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని 193 సర్వే నంబర్‌లో బత్తుల సత్యనారాయణతో పాటు మరికొంత మందికి అసైన్డ్ చట్టం ప్రకారం భూమి కేటాయించారు. ఈ భూమిపై వెంచర్లు చేసి 1993 నుంచి 2009 వరకు సుమారు 240 మందికి ప్లాట్లుగా విక్రయించారు. విచారణ చేసిన ప్రభుత్వం పీవోటీ చట్టం ప్రకారం ఈ భూములను కూడా పీవోటీ యాక్టు (ఫైల్ నంబర్ బీ/11/2003) ప్రకారం స్వాధీనం చేసుకున్నది.
కానీ తాజాగా ధరణిలో అసైన్డ్‌దారులకు పట్టాదార్ పాస్‌బుక్కులు జారీ అయ్యాయి. దీంతో గతంలో అసైన్డ్ చట్టాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తులకు మళ్లీ ధరణిలో పట్టాదారు పాసు పుస్తకాలు రావడంపై విమర్శలు వస్తున్నాయి. పీవోటీ చట్టం ప్రకారం మాత్రం రెవెన్యూ రికార్డులలో ఇవి ప్రభుత్వ భూములుగా నమోదు చేసి ఉన్నాయని రెవెన్యూ అధికారులు తెలిపారు.
ఎన్నో యేండ్ల కిందట అసైన్డ్‌దారుల నుంచి పీవోటీ కింద స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములపై ధరణిలో మళ్లీ పట్టాదార్ పాస్ పుస్తకాలు రావడం కొసమెరుపు. ఇప్పుడు ఈ భూములు ప్రభుత్వానివా..? అటవీ శాఖవా..? అసైన్డ్‌దారులవా..? వెంచర్‌గా మారిన సమయంలో ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులవా తేల్చాలని అంకుషాపూర్ గ్రామ ప్రజలు రెవెన్యూ అధికారులను కోరుతున్నారు.