Dharani | సమస్యల పుట్ట ‘ధరణి’.. రైతులకు, భూ యజమానులకు దూరంగా ‘రెవెన్యూ’

ప్రతి గ్రామంలో సగటున 200నుంచి 300 వరకు ధరణి తరువాత అదనంగా పెరిగిన భూ సమస్యలు పరిష్కరించే అధికారం కోల్పోయిన తహసీల్దార్లు డిజిటలీకరణ తరువాత మరింత జటిలంగా సమస్యలు రైతులకు, భూ యజమానులకు రెవెన్యూ వ్యవస్థ దూరం లంచాల కంటే అధికంగా ధరణి పోర్టల్లో ఫీజులు ఒక్కసారి తిరస్కరణకు గురైతే రాని డబ్బులు గ్రామానికో రెవెన్యూ అధికారి ఉండాలన్న ప్రజలు సులభతర రెవెన్యూ వ్యవస్థ ఉండాలంటున్న రైతులు విధాత గ్రౌండ్‌ రిపోర్ట్‌ Dharani । భూమి రికార్డుల్లో […]

  • Publish Date - April 19, 2023 / 07:23 AM IST

  • ప్రతి గ్రామంలో సగటున 200నుంచి 300 వరకు
  • ధరణి తరువాత అదనంగా పెరిగిన భూ సమస్యలు
  • పరిష్కరించే అధికారం కోల్పోయిన తహసీల్దార్లు
  • డిజిటలీకరణ తరువాత మరింత జటిలంగా సమస్యలు
  • రైతులకు, భూ యజమానులకు రెవెన్యూ వ్యవస్థ దూరం
  • లంచాల కంటే అధికంగా ధరణి పోర్టల్లో ఫీజులు
  • ఒక్కసారి తిరస్కరణకు గురైతే రాని డబ్బులు
  • గ్రామానికో రెవెన్యూ అధికారి ఉండాలన్న ప్రజలు
  • సులభతర రెవెన్యూ వ్యవస్థ ఉండాలంటున్న రైతులు
  • విధాత గ్రౌండ్‌ రిపోర్ట్‌

Dharani । భూమి రికార్డుల్లో అత్యంత పారదర్శకంగా వ్యవహరించేందుకు తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతున్న ధరణి పోర్టల్‌ సమస్యలను పరిష్కరించకపోగా రైతులకు గుదిబండగా మారింది. తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాపురిస్తున్నదని రైతులు వాపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న పాత సమస్యలు ధరణిలో పరిష్కారం కాలేదని, పైగా మరిన్ని సమస్యలకు ధరణి కారణమైందని న్యాయ నిపుణులు అంటున్నారు.

హైదరాబాద్, విధాత: ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన కోనేరు రంగారావు కమిషన్ ఆనాడు ప్రతి గ్రామంలో వంద వరకు భూమి సమస్యలు ఉంటాయని అంచనా వేసింది. నేడు తెలంగాణలో ప్రతి గ్రామంలో 200కు పైగా భూమి సమస్యలుంటాయని భూమి, వ్యవసాయ చట్టాల నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరణిలో సమస్యలే లేవని, నూటికి 99 శాతం భూమి రికార్డులు కరెక్టుగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నది. కానీ.. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తున్నది. భూమి, వ్యవసాయ చట్టాల నిపుణుడు భూమి సునీల్‌ చేపట్టిన కారవాన్-2లో క్షేత్ర స్థాయిలో విధాత ప్రతినిధి పాల్గొని చేసిన పరిశీలనలో రైతులు అనేక సమస్యలను ప్రస్తావించారు.

పేదవాడిని మరింత పేదను చేసిన ధరణి

రంగారెడ్డి జిల్లాల్లోని యాచారం, నల్లగొండ జిల్లాలోని మాల్, చింతపల్లి, మల్లేపల్లి, పాల్వాయి, గుర్రంపోడు, కొప్పోల్, అప్పాజిపేట తదితర గ్రామాలలో రైతులను ‘విధాత’ కలిసింది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ… ‘ధరణి పేదవాడిని మరింత పేదవాడిని చేసింది. ధనవంతుడిని మరింత ధనవంతుడిని చేసింది. ధరణి బ్రోకర్లకే వరంగా మారింది కానీ రైతులకు కాదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి సమస్యలు లేని తెలంగాణ కావాలన్న లక్ష్యంతో తీసుకువచ్చిన ధరణి ప్రాజెక్టు ఆ లక్ష్యానికి చేరుకోలేదని క్షేత్ర స్థాయి పరిశీలనలో అవగతం అయింది.

గతంలో తహసీల్దార్లకు సమస్యను పరిష్కరించే అధికారం ఉండేది. కానీ ధరణిలో తహసీల్దార్లకు సమస్యలను పరిష్కరించే అధికారం తీసి వేశారు. గ్రామ స్థాయిలో సమస్యను పరిశీలించి తహసీల్దార్‌కు సమస్యను తెలియజేసే వీఆర్వో, పట్వారీ వ్యవస్థనే లేకుండా పోయింది. దీంతో ఒక సమస్య వస్తే ఎలా పరిష్కరించుకోవాలో.. ఎక్కడకు వెళ్లాలో తెలియని పరిస్థితి తెలంగాణలోని పల్లెల్లో ఏర్పడింది. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత ఉమ్మడి రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 12 లక్షల సాదాబైనామా దరఖాస్తులలో 6 లక్షల దరఖాస్తులు మాత్రమే పరిష్కారం అయ్యాయి. రికార్డుల ప్రక్షాళన ప్రక్రియ ప్రయత్నం మాత్రమే జరిగింది కానీ, పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరుగలేదని న్యాయనిపుణులు చెపుతున్నారు.

క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన ధరణి సమస్యలు ఇవే..

1. ధరణి రికార్డుల్లో వివరాలు తప్పులుగా…
2. భూమి విస్తీర్ణం తక్కుగా, తప్పుగా నమోదు కావడం
3. మిస్సింగ్‌ సర్వే నంబర్లు
4. నిషేధిత జాబితాలో చేరడం
5. భూమి స్వభావం తప్పుగా పడడం (ఉదాహరణకు పట్టా భూమి అసైన్డ్‌ భూమిగా..)
6. భూమిపై హక్కులు లేని వారి పేర్లు ధరణిలో కొనసాగడం
ఎ. భూమిని అమ్ముకున్న ఏండ్ల తరువాత తిరిగి భూమిని అమ్ముకున్న వారి పేరుతో పాస్‌బుక్కులు రావడం, రైతు బంధు, బీమా సొమ్ము భూమి లేని వ్యక్తి ఖాతాలోకి వెళ్లడం.
బి. ఒక వ్యక్తి దగ్గర భూమిని కొనుక్కొని, రిజిస్టర్ చేసుకొని, ఆ తరువాత మ్యూటేషన్‌ కూడా అయిన భూమి తిరిగి ధరణిలో అమ్మిన వ్యక్తి పేరుతో రావడం, అతనికే పాస్ బుక్, రైతు బంధు, రైతు బీమా అమలు కావడం.
7. వీటితో పాటు పాత సమస్యలు కూడా అలాగే ఉన్నాయని తేలింది.

నెరవేరని లక్ష్యం

ధరణి లక్ష్యం రికార్డులన్నీ సమగ్రంగా ఆన్‌లైన్‌లో ఉండటం. వాస్తవానికి అద్దం పట్టేలా రికార్డులుండాలి. కానీ దీనికి విరుద్ధంగా పరిస్థితి ఉన్నది. ఒక రెవెన్యూ అధికారి చెప్తున్న లెక్కల ప్రకారం ఒక్క గుర్రంపోడు మండలంలోనే ధరణిలో 500 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ధరణిలో వచ్చిన దరఖాస్తులలో పరిష్కరించిన దాని కంటే తిరస్కరించినవే ఎక్కువగా ఉన్నట్లు రైతులు చెబుతున్నారు.

రైతులకు భారంగా ధరణి

భూమి సమస్య పరిష్కారానికి ధరణిలో దరఖాస్తు ఫీజులు భారంగా ఉన్నాయని రైతులు వాపోయారు. పాత వ్యవస్థలో భూమికి సంబంధించిన ఏ సమస్యకైనా దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఫీజులు ఉండేవి కాదన్నారు. ఆనాడు ప్రభుత్వ సేవలు ఉచితంగా లభించేవని చెప్పారు.

ఏదైనా ఒక సమస్య జటిలంగా మారి, రెవెన్యూ కోర్టుకు వెళితే నామమాత్రంగా రూ.10 నుంచి రూ.20 వరకు ఫీజు ఉండేదని తెలిపారు. ఇది ఏనాడూ రైతులకు భారంగా మారలేదన్నారు. నేడు ఏ చిన్న సమస్య అయినా ధరణిలో దరఖాస్తు చేసుకోవాల్సిందే.

అధికారికంగా ఒక చిన్న సమస్య పరిష్కారానికి టీఎం-33 మాడ్యూల్లో ఒకసారి దరఖాస్తుకు రూ.1000, మీ-సేవ కేంద్రం నిర్వాహకుడికి రూ.100 అయితే ఒక్కో చోట రూ.1500 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తున్నారని రైతులు చెప్పారు. దరఖాస్తు ఒక్క సారి రిజక్ట్ అయి, మరోసారి దరఖాస్తు చేస్తే వెయ్యి రూపాయలు కట్టాల్సిందే.

ఇలా ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకుంటే అన్ని సార్లు వెయ్యి చొప్పున చెల్లించాల్సిందేనని రైతులు వాపోతున్నారు. రైతుల భూమి సమస్యల పరిష్కారం కోసం దేశంలో ఫీజులు వసూలు చేస్తున్న రాష్ట్రం ఏదీలేదని, మొదటి సారిగా తెలంగాణలోనే ఫీజులు వసూలు చేస్తున్నారని న్యాయనిపుణులు చెబుతున్నారు.

అధికారుల తప్పులకు రైతులపై భారమేంటి?

ధరణి నిజానికి హక్కులు కల్పించే పత్రం కాదని, ప్రభుత్వం తన కోసం రూపొందించుకున్న ఒక రికార్డు మాత్రమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ధరణి ఎలాంటి టైటిల్‌ని నిర్థారించే హక్కు పత్రం కాదు. అలాంటి ధరణిలో తప్పులు జరిగితే అధికారులే పరిశీలించి నిర్థారించుకొని సరి చేయాలి కానీ ఇక్కడ అధికారులు తప్పులు చేసి, రైతులను ఇబ్బందులకు గురి చేయడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

అధికారులు చేసిన తప్పులను సరి చేయడానికి రైతుల ముక్కు పిండి ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేయడాన్ని వ్యవసాయ చట్టాల నిపుణులు తప్పుపడుతున్నారు. పైగా కోర్టుకు వెళ్లి పరిష్కరించుకోమని ఉచిత సలహాలు ఇస్తుండటాన్ని విమర్శిస్తున్నారు. ధరణితో ఇబ్బందులను అనుభవిస్తున్న ప్రజలు దీని కంటే పాత వ్యవస్థనే మేలు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

హక్కులు లేని వారికి హక్కులు

ధరణిలో భూమి అమ్మకాలు, కొనుగోళ్లు శరవేగంగా జరుగుతున్నాయి. కానీ దీని వల్ల హక్కులు లేని వారికి హక్కులు వస్తున్నాయని రైతులు అంటున్నారు. తెలంగాణలోని చాలా పల్లెల్లో అన్నదమ్ములు ఉంటే భాగ పంపకాలకు ముందు ఇంటి పెద్ద కొడుకు పేరునే భూములుండేవి.

కాస్తులో తమ్ముళ్ల పేర్లు ఉండేవి. ఇప్పుడు కాస్తు కాలం తీసి వేయడంతో ఆ భూములకు పెద్దవాడి పేరుతో పాస్‌పుస్తకాలు రావడంతో ఇంటి పెద్దనే వాటిని అమ్ముకుంటూ తమ్ముళ్లను రోడ్డు పాలు చేస్తున్న సంఘటనలున్నాయని ఒక రైతు తెలిపారు. ఇలా చాలా పంచాయతీలు తమ గ్రామాల్లో నడుస్తున్నాయని వెల్లడించారు.

2014లో రైతులు, ప్రజలు, మేధావులు భూమి సమస్య పరిష్కారం కోసం ఏం కోరుకున్నారంటే…
భూమి పంచాయతీలు లేని సమాజం కావాలంటే..

  • తెలంగాణ భూములను సర్వే చేయాలి.
  • భూములు ఉండి హక్కులు రాని వాళ్లందరికీ పట్టాలు ఇవ్వాలి.
  • సాదాబైనామాలను క్లియర్‌ చేయాలి.
  • 38(ఇ)రాని వాళ్లకు 38(ఇ) సర్టిఫికెట్లు ఇవ్వాలి.
  • ఇనాం భూములకు ఓఆర్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి.
  • ప్రభుత్వ భూమిలో ఉండి దున్నుకుంటున్న వాళ్లకు పట్టాలు ఇవ్వాలి (కానీ తెలంగాణ వచ్చిన తరువాత లావణి పట్టాలు ఇవ్వలేదు) లావణి పట్టాతో ఉన్న భూములను కూడా ప్రభుత్వ అసవరాల పేరిట తిరిగి తీసుకున్నారు.
  • తమ గ్రామానికి ఒక్క రెవెన్యూ మనిషి ఉండాలి. ఆ రెవెన్యూ మనిషి తమ ఊర్లోనే ఉండాలని, అతనికి రెవెన్యూ శాఖ పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని కోరుకున్నారు. అజమాయిషీ పూర్తిగా మండల రెవెన్యూ అధికారి చేతిలో ఉండాలని కోరుకున్నారు.

ఇది జరిగితే.. సగం సమస్యలు గ్రామంలోనే తీరేవి

నాడు తెలంగాణ ప్రజలు కోరుకున్న ఈ విధానం అమలు అయితే సగం భూమి సమస్యలు గ్రామంలోనే తీరేవని రైతులు అంటున్నారు. కానీ దీనికి భిన్నంగా గ్రామానికి అందుబాటులో ఉన్న వీఆర్వోను కూడా ఈ ప్రభుత్వం ఊడబీకిందంటున్నారు. ఆనాడు కొన్ని మండలాల్లో పారాలీగల్‌ వ్యవస్థ ఉండేదని, ఇప్పుడా వ్యవస్థ లేకుండా పోయిందని తెలిపారు.

బ్రోకర్లకే వరం

ధరణి పేదవాడిని మరింత పేద వాడిని చేసింది. ధనవంతుడిని మరింత ధనవంతుడిని చేసింది. ధరణి బ్రోకర్లకే వరంగా మారింది.. రైతులకు కాదు. అన్నదమ్ముల మధ్య పంచాయితీ పెట్టింది. భూమి లేని వాడికి పట్టాదార్‌ పాస్‌ పుస్తకం ఇచ్చింది. అతనికే రైతు బంధు, రైతు బీమా వెళుతున్నాయి. రైతు వెళ్లి తన భూమిని తన పేరున రాయమంటే తిరిగి డబ్బులు అడుగుతున్నారు. భూమి గుంజు కోవడం లేదు కదా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఊరునిండా పంచాయితీలే.

– అంజయ్య, అప్పాజిపేట గ్రామం, నల్లగొండ నియోజకవర్గం

Latest News