Warangal | మృతదేహం కోసం తీరని దేవులాట.. వరద కుటుంబాలలో తీరని వ్యథ

Warangal | శవం లభ్యమైందంటే ఉలిక్కిపాటు వరద ప్రాంతాల్లో వీడని కన్నీటి నీడ గోదావరిలో మహిళ మృతదేహం బాధిత కుటుంబాల కన్నీరుమున్నీరు మాటలకు చేతలకు పొంతనలేదు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: దాదాపు 20 రోజులు కావస్తున్నా వరదలో తమవారిని పోగొట్టుకున్న కుటుంబాల దేవులాట తగ్గడం లేదు. మృతదేహం.. అంటే.. ఇప్పుడు వరద ప్రభావిత గ్రామాలు ఉలిక్కి పడుతున్నాయి. బాధిత గ్రామాలైన మోరంచపల్లి, బూర్గుపేట, మానేరు పరివాహాక ప్రాంతవాసులు ఆందోళనకు లోనవుతున్నారు. వరదలో గల్లంతై ఇప్పటికీ ఆచూకిలేని […]

  • Publish Date - August 16, 2023 / 11:36 AM IST

Warangal |

  • శవం లభ్యమైందంటే ఉలిక్కిపాటు
  • వరద ప్రాంతాల్లో వీడని కన్నీటి నీడ
  • గోదావరిలో మహిళ మృతదేహం
  • బాధిత కుటుంబాల కన్నీరుమున్నీరు
  • మాటలకు చేతలకు పొంతనలేదు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: దాదాపు 20 రోజులు కావస్తున్నా వరదలో తమవారిని పోగొట్టుకున్న కుటుంబాల దేవులాట తగ్గడం లేదు. మృతదేహం.. అంటే.. ఇప్పుడు వరద ప్రభావిత గ్రామాలు ఉలిక్కి పడుతున్నాయి. బాధిత గ్రామాలైన మోరంచపల్లి, బూర్గుపేట, మానేరు పరివాహాక ప్రాంతవాసులు ఆందోళనకు లోనవుతున్నారు. వరదలో గల్లంతై ఇప్పటికీ ఆచూకిలేని తమ వారి మృతదేహమైన లభిస్తుందేమోననే ఆశతో వెదుకులాడుతున్నారు. తమ వారి కోసం కన్నీరుమున్నీరవుతున్నారు.

వెంటాడుతున్న కాలరాత్రి

గత నెల 27వ తేదీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుకుటుంబాలకు కాలరాత్రిగా మిగిలింది. కుండపోత వర్షానికి పోటెత్తిన వరద జిల్లాలో 40 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్నది. భూపాలపల్లి, ములుగు జిల్లాలో 22 మంది ప్రాణాలు గంగపాలయ్యాయి. మోరంచపల్లి, బూర్గుపేట, కొండాయి గ్రామాలను వరద ముంచెత్తింది. ఈ వరదలో 22 మంది గల్లంతయ్యారు. పోలీసులు, స్థానికుల వెదుకులాట ఫలించి వరదలో చాలా దూరం కొట్టుకపోయిన మృతదేహాలు రెండు మూడు రోజుల తర్వాత కూడా కొన్ని లభించాయి.

గోదావరిలో మహిళ మృతదేహం లభ్యం

గోదావరి శాంతించడంతో.. తాజాగా బుధవారం ఏటూరునాగారం మండల కేంద్రంలోని గోదావరి ఒడ్డున కుళ్లిపోయిన స్థితిలో గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన కొంతమంది స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.

మృతురాలు ఆరెంజ్ కలర్ చీర, స్వెట్టర్ ధరించి ఉందన్నారు. ఆమె వయసు సుమారుగా 35-40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ మృతదేహం లభ్యం కావడంతో మోరంచ నుంచి బూరుగుపేట, కొండాయి, మానేరు ప్రాంతాల్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది.

ఆచూకిలేని ముగ్గురు వ్యక్తులు

వరదలో గల్లంతైన వారి మూడు మృతదేహాలు ఇప్పటికీ లభించలేదు. మోరంచపల్లిలో నలుగురి మృతదేహాలు గల్లంతుకాగా, మూడు లభ్యమయ్యాయి. గడ్డం మహాలక్ష్మి మృతదేహం ఇప్పటికీ లభ్యంకాలేదు. బూరుగు పేట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వరదలో కొట్టుకపోగా ఒక్కరి మృతదేహాం మాత్రమే లభ్యమైంది. బండ్ల సారమ్మ, సమ్మక్క మృతదేహాలిప్పటికీ దొరకలేదు.

మృతదేహం కోసం ఆరాటం

గోదావరి ఒడ్డున బుధవారం లభ్యమైన మృతదేహం సమాచారం తెలిసి బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనకు లోనయ్యాయి. ఆ శవం తమవారిదే అయిఉంటుందనే దేవులాట ప్రారంభమైంది. అయితే మృతదేహం బాగా చెడిపోయింది.

ఆ మృతదేహ వద్ద లభ్యమైన దుస్తులతో తమవారి ఆనవాళ్ళతో పోల్చుకుంటూ బాధితకుటుంబాల వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమకు తెలిసిన వారిని వివరాలు అడుగుతున్నారు. పోలీసులను ఆశ్రయించి తమ వారేమోనని తెలుసుకుంటున్నారు. తమ వారితో శవం పోలికలు లేకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

20 రోజులైన తమ వారి ఆచూకి లభిస్తేచాలంటున్నారు. కనీసం మృతదేహం లభ్యమైన అంతిమ సంస్కారాలు నిర్వహించుకునే వారమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎందుకంటే చనిపోయారనే అభిప్రాయం బలంగా ఉన్నప్పటికీ, ఇప్పటికీ సంప్రదాయ కర్మకాండలు పూర్తి చేసినప్పటికీ కనీసం ఏ స్థితిలోనైనా తమ వారి మృతదేహం లభిస్తే బాగుంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ బాధిత కుటుంబాలు శవం లభ్యమైందంటే అక్కడ వాలిపోయి వివరాలు తెలుసుకుంటున్నారు. ఎన్నాళ్ళీ దేవులాటో చెప్పలేము.

మాటలకు చేతలకు పొంతనలేదు

స్వాతంత్రదినోత్సవం సందర్భంగా గోల్కండ కోట నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ వరదను కలిసికట్టుగా ఎదుర్కొన్నామని, బాధితులకు అండగా నిలువడంతో ముందున్నామంటూ ఆర్భాటంగా ప్రకటించారు. ఇప్పటి వరకు వరద బాధితుల సంగతి పక్కనపెడితే మృతుల కుటుంబాలకు రూ.10వేలు చెల్లించారు.

20 రోజులైతున్నా రూ.4లక్షల పరిహారం చెల్లించలేదు. బాధితకుటుంబాలు ఆసరా కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితికి పూర్తి బద్ద వ్యతిరేకంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా త్వరలోనే బాధితులకు పరిహారం చెల్లిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి.