Eatala Rajender | ఆత్మరక్షణలో ఈటల అండ్‌ కో.. ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఈటల వర్గం

Eatala Rajender | బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఒక్కటే అనేలా రాజకీయ పరిణమాలు పార్టీ బలోపేతం కోసం చేస్తున్న ప్రయత్నాలకు అడుగడుగుల అడ్డంకులు ఇంకా బీజేపీలోనే ఉంటే రాజకీయంగా ఇబ్బందులే అంటున్న వారి అనుచరులు ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఈటల వర్గం విధాత: కేసీఆర్‌ వైఖరితో విభేదించి పార్టీ వీడిన ఈటల రాజేందర్‌ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందా? కొంతకాలంగా జరుగుతున్న రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఆయనను ఆత్మరక్షణలో పడేశాయా? బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అని ఆరోపిస్తున్న […]

  • Publish Date - May 30, 2023 / 07:30 AM IST

Eatala Rajender |

  • బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఒక్కటే అనేలా రాజకీయ పరిణమాలు
  • పార్టీ బలోపేతం కోసం చేస్తున్న ప్రయత్నాలకు అడుగడుగుల అడ్డంకులు
  • ఇంకా బీజేపీలోనే ఉంటే రాజకీయంగా ఇబ్బందులే అంటున్న వారి అనుచరులు
  • ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఈటల వర్గం

విధాత: కేసీఆర్‌ వైఖరితో విభేదించి పార్టీ వీడిన ఈటల రాజేందర్‌ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందా? కొంతకాలంగా జరుగుతున్న రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఆయనను ఆత్మరక్షణలో పడేశాయా? బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నేతల ఆరోపణలు నిజమేనా? బీజేపీ, బీఆర్‌ఎస్‌లు గల్లిలో కొట్లాడటం.. ఢిల్లీలో రాజీపడటం వంటి అంశాలు ఈటల అండ్‌ కో మింగుడుపటడం లేదా? అంటే ఔననే సమాధానం వస్తున్నది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను అరెస్టు అయితేనే ప్రజలు బీజేపీని విశ్వసిస్తారని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఇది రాజకీయంగా బీజేపీని ఇబ్బందికి గురిచేసింది. దీంతో వెంటనే దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆయన చేతనే ప్రెస్‌మీట్‌ పెట్టించి తన వ్యాఖ్యలకు వివరణ ఇప్పించారు.

దీంతో కేసీఆర్‌పై కోపంతో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన వారికి మింగుడు పడటం లేదు. అంతేకాదు ఈటల పార్టీలో చేరిన తర్వాత కూడా ఆయనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆయనకు చేరికల కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించినా.. రాష్ట్ర నాయకత్వం నుంచి ఆయన సరైన సహకారం లభించడం లేదు.

ఈటల కొన్నిరోజులుగా బీఆర్‌ఎస్‌ మాజీ నాయకులైన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. అయినా వారు ఇప్పటికీ ఆపార్టీలో చేరేందుకు సముఖత వ్యక్తం చేయడం లేదని ఈటలనే స్వయంగా మీడియా ప్రతినిధులకు వెల్లడించారు.

దీనికి కారణం బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ ఘర్షణకు ఢిల్లీలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహనకు పొంతన కుదరడం లేదన్న ప్రచారం జరుగుతుండడమే కారణమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. దీంతో బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ టీమ్‌ అనే వాదనలు వాస్తవమే అనేలా ప్రస్తుత పరిణామాలు ఉండటం గమనార్హం.

ఈటల రాజేందర్‌, కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గడ్డం వివేక్‌ వెంకట స్వామి, రఘునందన్‌రావు, ఏనుగు రవీందర్‌రెడ్డి లాంటి నేతలు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. బీజేపీలో వాళ్లు ఇమడలేకపోతున్నారనేది బహిరంగ రహస్యమే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

పార్టీ బలోపేతం కోసం వీరు చేస్తున్న ప్రయత్నాలకు బండి సంజయ్‌ గండి కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రోజుల కిందట ఈటల నేతృత్వంలోని బృందం ఫలు దఫాలుగా పొంగులేటి, జూపల్లితో చర్చలు జరిపింది. పార్టీలోకి రావాలని ఆహ్వానించింది. బీజేపీ అధిష్ఠానం సూచన మేరకే చేరికల కమిటీ కన్వీనర్‌గా తన బాధ్యతను ఆయన నిర్వర్తించారు.

కానీ బండి సంజయ్‌ దీనిపై మాట్లాడుతూ…తనకు సమాచారం లేదని మీడియా ముందు మాట్లాడారు. దీంతో రాష్ట్ర నాయకత్వంలో కొత్త , పాత నేతల మధ్య విభేదాలు ఉన్నాయన్నది స్పష్టమైంది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా కొట్లాడాలనుకుంటున్న వీరందరికీ సొంత పార్టీ నుంచే షాక్‌ల మీద షాక్‌లు తగుతులున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఈటల రాజేందర్‌ అండ్‌ కో ఉన్నట్టు తెలుస్తోంది.

ఆ మధ్య టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి, బీఆర్‌ఎస్‌ నుంచి వెళ్లిన నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. వాళ్లకు తన వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా అధిష్ఠానంతోనే మాట్లాడుకోవచ్చన్నారు. పార్టీ కోసం, ప్రజల కోసం తాను పది మెట్లు దిగడానికి కూడా సిద్ధమని ప్రకటించారు.

అలాగే రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ పార్టీనే అన్నది ప్రజాభిప్రాయం. ఎన్నికలకు దగ్గర పడుతున్న ఈ సమయంలో బీజేపీలోనే ఉండి కేసీఆర్‌కు వ్యతిరేకంగా చేసే ఏ ప్రయత్నమైనా ఫలించేలా లేదనే ఆలోచనలో ఈ నేతలంతా ఉన్నారని సమాచారం. త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకుని బైటికి రాకుంటే రాజకీయంగా దెబ్బతినడమే కాకుండా ప్రజల్లో తమపై ఉన్న కొద్దిపాటి విశ్వాసం కూడా పోయే ప్రమాదం ఉన్నదని అనుకుంటున్నారట.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ల అధిష్ఠానాల మధ్య ఉన్న అవగాహనపై ఏదో నిర్ణయం తీసుకుని బైటికి రావడం మినహా మరే గత్యంతరం లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మరి ఈటల అండ్‌ కో ఏం చేయబోతున్నారనే చర్చ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నది.