Eatela Rajender |
విధాత: బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణరావులు బీజేపీలోకి వచ్చే అవకాశాలు లేవని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatela Rajender) అన్నారు. సోమవారం ఆయన నగరంలోని ఒక హోటల్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. వారు తనకే తనకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారన్నారు.
అయితే ప్రతి రోజు వారితో మాట్లాడడం వల్ల ఇప్పటి వరకు కాంగ్రెస్‌లోకి వెళ్లకుండా ఆపగలిగానన్నారు. ప్రస్తుత పరిస్థితిలో వారు బీజేపీలోకి వచ్చేలా లేరని, అయితే కాంగ్రెస్‌లోకి వెళ్లకుండా ఆపగలిగే పరిస్థితి కూడా తనకు లేదన్నారు. బీజేపీలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులున్నయన్నారు. చేరికల కమిటీ చైర్మన్‌గా తాను ప్రతి రోజు వారితో మాట్లాడుతున్నానని తెలిపారు. రెండు సార్లు పొంగులేటిని, జూపల్లిని కలిశానన్నారు.
అయితే ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ భావాజాలం ఉన్న ప్రాంతమని, అక్కడ బీజేపీకి ఆదరణ ఉండదన్న అభిప్రాయంతో వారు ఉన్నట్లు తెలిపారు. దేశానికే కమ్యూనిస్ట్ సిద్దాంతం నేర్పిన గడ్డ తెలంగాణ అని అన్నారు. ఖమ్మం జిల్లాలో వామపక్షాలు, కాంగ్రెస్, టీడీపీలు ఉంటాయి కానీ బీజేపీకి చాలా కష్టమన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పొంగులేటి అప్పట్లో ప్రియాంక గాంధీని కలిసినట్లు తెలిసిందన్నారు.