ప్రాంతీయ పార్టీలు పేరు మార్చుకున్నంత మాత్రాన జాతీయ పార్టీలు అయిపోవని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న మల్లిఖార్జున ఖర్గే అన్నారు. టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన పార్టీ ప్రతినిధుల మద్దతు కోసం రాష్ట్రానికి వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి సహా పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం గాంధీ భవన్‌లో పీసీసీ ప్రతినిధులతో ఖర్గే సమావేశమయ్యారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ పార్టీలో ఎన్నిక జరుగుతుందని, బీజేపీ చరిత్రలో ఇలాంటి ఎన్నిక ఎప్పుడూ జరగలేదన్నారు. మోడీ, అమిత్‌షా దేశాన్ని నాశనం చేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. 60 ఏళ్లలో మేం ఏం చేశామంటున్నారని.. మేము దేశాన్ని ధాన్య భాండాగారంగా తీర్చిదిద్దాం, ప్రాజెక్టులు నిర్మించాం, పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశామన్నారు.
మేము నెలకొల్పిన వాటిని ఒకదాని తర్వాత మరొకటి బీజేపీ, దాని వెనక ఉన్న ఆర్ఎస్ఎస్ అమ్మేస్తూ వస్తున్నాయి. కొందరిని కుబేరులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మోడీ పాలనలో రూపాయి విలువ రూ. 82.82 పడిపోయిందన్నారు. బీజేపీ పాలనలో నిత్యావసర వస్తువులైన బియ్యం, పప్పులు, నూనె. పెట్రోల్, డీజిల్ ధరలు జీఎస్టీ కారణంగా పెరిగిపోయాయి.
మా హయాంలో రూ.414 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర రూ.1100 దాటింది. మహిళలకు ఇచ్చే ఉచిత పథకాలనూ లేకుండా చేశారు. పాలు, పెరుగు, చిన్నపిల్లలు వాడే పెన్సిళ్లు, రబ్బర్ల మీద కూడా జీఎస్టీ బాదారని ఖర్గే విమర్శించారు. నిరుద్యోగితను తగ్గిస్తానన్న ప్రధాని మోడీ మాట ఏమైంది? అని ప్రశ్నించారు. కోట్లాది మంది ఉద్యోగాలు పోయి నిరుద్యోగిత మరింత పెరిగింది. దేశంలో ఇలాంటి పరిస్థితులపై పోరాడేందుకు నేను అధ్యక్ష ఎన్నికల్లో నిలబడుతున్నాన్నారు.
బీజేపీకి ప్రజాస్వామ్యంపై నమ్మకమే లేదు. అద్వానీ, గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా, నడ్డాలను ఎన్నికలు జరిపే ఎన్నుకున్నారా? పైగా నడ్డా పదవీ కాలాన్ని పొడిగించారు. ముందు మీరు పాటించకుండా ఇతరుల గురించి మాట్లాడటమెందుకని ఖర్గే ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విధానం కాకుండా ఏక ఛత్రాధిపత్యంతో వ్యవహరించే బీజేపీకి ఇతరుల గురించి మాట్లాడే హక్కులేదన్నారు.