మస్క్- మార్క్ జూకర్ బర్గ్ మ‌ధ్య ప్ర‌క‌ట‌న‌ల యుద్ధం

  • Publish Date - April 12, 2024 / 06:59 PM IST

* ఎక్స్- మెటాల మధ్య మాట‌ల యుద్ధం
* ఫేస్‌బుక్ గ‌ణాంకాల‌న్నీ ఫేక్ అంటున్న మ‌స్క్‌
* ఎక్స్ మాత్ర‌మే యాడ్స్‌కు ఎక్సెలెంట్ అంటూ సొంత డ‌బ్బా

న్యూయార్క్: వ్యాపార ప్ర‌క‌ట‌న‌ల రీచ్‌, రిజ‌ల్ట్‌లో తామంటే తాము గొప్ప అంటూ ఇద్ద‌రు సోష‌ల్ మీడియా టైకూన్ల మాట‌ల యుద్ధానికి దిగ‌డం సంచ‌ల‌నంగా మారింది. మెటా అధినేత జూక‌ర్ బ‌ర్గ్‌, ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మ‌స్క్‌ల మ‌ధ్య గ‌త కొంత కాలంగా సాగుతున్న ఈ వివాదం చిలికి చిలికి గాలివాన‌గా మారే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మ‌స్క్ దీనిపై ఎక్స్ వేదిక‌గా చేసిన ట్వీట్ ఈ యుద్ధానికి మ‌రింత ఆజ్యం పోసింది. మార్క్ జుకర్ బర్గ్ అధీనంలోని మెటా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ (ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, థ్రెడ్స్‌) తమ వ్యాపార ప్రకటనల వివరాలను వాస్త‌వానికి భిన్నంగా మార్చి చూపుతున్నార‌ని ఆరోపించారు. మెటా వ్యాపార ప్రకటనల వాస్తవ గణాంకాలను ప్రపంచానికి తెలియజేయ‌డం లేద‌ని కూడా పేర్కొన్నారు. కానీ ఎక్స్ ప్లాట్ ఫామ్ మాత్రం, ఫేస్ బుక్‌కు మించిన వ్యాపార ప్రకటనల లాభాలను ప్ర‌క‌ట‌న‌క‌ర్త‌ల‌కు చేకూర్చుతుందన్నారు.

మ‌స్క్ ఎక్స్ ట్వీట్‌పై ఎక్స్ ఫాలోవర్ ఒక‌రు ”ఎక్స్ వ్యాపార ప్రకటనల లాభాలను గ‌డించ‌డంలో మిగతా ఫ్లాట్‌ఫాంల‌క‌న్నాముందు ఉంద‌ని, అదే మెటాకు సంబంధించి వస్తే వ్యాపార ప్రకటనల లెక్కలు నమ్మదగినట్టు లేవని కామెంట్ చేశారు. ఈ కామెంట్‌పై స్పందించిన మ‌స్క్‌, ”ఇది నిజం. మీరు అనుకుంటున్నది, మేం చేస్తున్నది వాస్తవంగా రెండు ఒకటే. ఈ విషయంలో ఎక్స్ నిజాయితీగా ప్రజలకు సేవలు అందిస్తున్నది. వాస్తవ విషయాలనే మా కంపెనీ ప్రజలకు తెలియపరుస్తున్నది. అదే మెటా (ఫేస్బుక్) విషయానికి వస్తే, వాళ్లు చేస్తున్నది ఒకటి, ప్రపంచానికి చూపుతున్నది మరొకటి. వారి వ్యాపారానికి, ప్రజల మనోభావాలకు మధ్య‌ పెద్ద అగాధం ఉంది. అయితే ఈ విషయాన్ని మెటా మ‌సిపూసి మారేడుకాయ చేయ‌డానికి ప్రయత్నిస్తుంద”ని స‌మ‌ర్థించారు.
”మా వ్యాపార ప్రకటనల నాణ్యత బాగా పెరిగింది. దానితోపాటే మా కంపెనీకి వచ్చే వ్యాపార ప్రకటనల సంఖ్య కూడా విస్తృతంగా పెరిగిందని”’మస్క్ ఉత్సాహంతో జవాబు ఇచ్చారు.

మరొక ఎక్స్ యూజర్ ఒక పోస్ట్ చేస్తూ మెటాలో వ్యాపార ప్రకటనల ఖర్చు బాగా పెంచేశార‌ని, మరొకవైపు వ్యాపార ప్రకటనలపై అయిన ఖర్చుకు త‌గ్గ ప్ర‌తిఫ‌లం (ఆర్ఓఏఎస్ -రిటర్న్ ఆన్ అడ్వర్టైజ్మెంట్ స్పెండ్ ) ప్ర‌క‌ట‌న‌క‌ర్త‌ల‌కు రావ‌డం త‌గ్గిపోతోంద‌ని, మెటాలో ఈ ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే ప్ర‌క‌ట‌న‌క‌ర్త‌ల ప‌రిస్థితి అధ్వాన్నంగా త‌యారుకావ‌చ్చ‌ని కామెంట్ చేశారు. అందుకే మెటా నుండి ప్ర‌క‌ట‌న‌క‌ర్త‌లు క్రమంగా తొలగిపోతు, ఎక్స్ సోషల్ మీడియా వైపు ఆకర్షితులవుతున్నారు.

దీనికి జవాబుగా మస్క్ ఈ ఏడాది ఫిబ్రవరి లో ఎక్స్ లో ప్ర‌క‌ట‌న‌ల‌కు అనుమ‌తించామ‌న్నారు. వ్యాపార ప్రకట నలు ఇచ్చేవాళ్లు ప్రకటనలు తయారుచేసి క్రియేటర్ టార్గెటింగ్ ప్రోగ్రాం ద్వారా సోషల్ మీడియాలో పెట్టవచ్చు అని తెలిపారు. ఎక్స్ సీఈవో లిండా ఎక్కారినో ఈ సందర్భంగా మాట్లాడుతూ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో గత సంవత్సరం నవంబర్లో అనేకమంది వ్యాపార ప్రకటనల ఖాతాదారులు ఎక్స్ ప్లాట్ ఫామ్ ను వదిలి వేశారని, దానికి కారణం ఎలెన్ మస్క్ చేసిన ఒక‌ ప్రకటన యూరోపియన్లను (యాంటీ- సెమెటిక్) అవమానపరిచే విధంగా ఉండటంతో, చాలామంది వ్యాపార ప్రకటనల ఖాతాదారులు నిస్పృహలకు లోనై కంపెనీ నుండి వైదొలిగార‌ని చెప్పారు. ఈ పరిస్థితి మళ్లీ రాకుండా ఎక్స్ ప్లాట్ ఫారం తగిన జాగ్రత్తలు తీసుకొని క్రియేటర్ మార్కెటింగ్ ప్రోగ్రాంను రూపొందించిందని తెలిపారు.
ప్రపంచంలో సోషల్ మీడియాకు చెందిన రెండు ప్రముఖ దిగ్గజ కంపెనీలైన ఎక్స్ మరియు మెటా ల మధ్య ఇప్పటివరకు నడుస్తున్న కోల్డ్ వార్ రానురాను ర‌చ్చ‌కెక్కుతోంద‌నేది ఈ ట్వీట్ల ద్వారా వెల్ల‌డైంది. దీనికి వారిద్దరి మధ్య కంటే కూడా ఈ రెండు కంపెనీల మధ్య పెరుగుతున్న వ్యాపార పోటీగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

Latest News