గజ్వేల్ లో ఈటల నామినేషన్

  • Publish Date - November 7, 2023 / 02:24 PM IST

– హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

– తరలివచ్చిన బీజేపీ శ్రేణులు

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: గజ్వేల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ మంగళవారం నామినేషన్ వేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలసి ఈటల దంపతులు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకు ముందు గజ్వేల్ లోని కార్యసిద్ధి హనుమాన్, కోట మైసమ్మ మహాంకాళీమాత ఆలయంలో పూజలు నిర్వహించారు. నామినేషన్ కు

వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, అభిమానులు గజ్వేల్ కు తరలివచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈటల రాజేందర్ గెలుపు ఖాయమైందన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రజలు రెస్ట్ ఇవ్వనున్నారని జోస్యం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు దోచుకొని, దాచుకొన్నరని విమర్శించారు. అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గం కంటే … గజ్వేల్ నియోజకవర్గంలోనే మెజార్టీ ఎక్కువ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఇంటికి పంపనున్నారనీ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తామన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, ప్రసాద్ రావు పాల్గొన్నారు.

దుబ్బాకలో రఘునందన్ నామినేషన్

దుబ్బాక నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు జితేందర్ రెడ్డితో కలసి రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకొని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ గెలుపు ఖాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో దుబ్బాక నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని, దుబ్బాక ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు.