విధాత: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. కూతురు నిత్యం ఫోన్‌లో మాట్లాడుతుందనే కోపంతో ఆమె గొంతు నులిమి చంపాడు తండ్రి. అనంతరం ముషీరాబాద్ పోలీసుల ఎదుట తండ్రి లొంగిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఓ 17 ఏండ్ల యువతి నిత్యం ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని సవతి తండ్రి గమనించాడు. అర్ధరాత్రి సమయంలోనూ స్నేహితుడితో ఆమె ఫోన్‌లో మాట్లాడేది. ఫోన్ మాట్లాడటం తక్కువ చేయాలని పలుమార్లు కూతురును హెచ్చరించాడు.
అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో శనివారం రాత్రి కూతురు గొంతు నులిమి చంపాడు సవతి తండ్రి సాధిక్. అనంతరం ముషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.