Site icon vidhaatha

(క్లాసిక్స్‌) ఫస్ట్ గ్రేడర్ మూవీ రివ్యూ: నిజ జీవిత క‌థ‌

విధాత‌: మొట్ట మొదటి అక్షరాస్యుడిగా మారడానికి ఒక వృద్ధుడు చేసిన పోరాటమే ఈ ఫస్ట్‌ గ్రేడర్‌ సినిమా. ఆద్యంతం ఉద్వేగ భరితం. 2010 లో వచ్చిన ఈ సినిమా ఓ క్లాసిక్. 1953లో కెన్యాలో బ్రిటీషు పాలనకి వ్యతిరేకంగా కొన్ని తెగలు సాయుధ పోరాటం జరిపాయి. ఆ పోరాటంలో ఎందరో మరణించారు. వేల కొద్దీ జనం జైలు పాలయ్యారు. చిత్రహింసలు అనుభవించారు. ఎట్టకేలకి స్వాతంత్రం సిద్ధించినా చాలా మందికి కలిగిన కష్టనష్టాలు.. బాధలు.. గాయాలు మాత్రం అలాగే ఉండిపోయాయి.

ఓ గుడిసెలో నివ‌సిస్తున్న‌ ఎనభై ఏళ్ల ముసలాడిది ఒంటరి జీవితం. గతం తాలూకు జ్ఞాపకాలతో బతుకు తుంటాడు. ఈ క్ర‌మంలో కొత్త ప్రభుత్వం అందరికీ ఉచిత ప్రాథ‌మిక విద్య అని ప్రకటిస్తుంది. ఊరూరా స్కూళ్లు వెలుస్తాయి. ఎక్కడెక్కడి పిల్లలూ వాళ్ల తల్లిదండ్రులూ స్కూళ్లకి పరిగెత్తుతారు. వాళ్లతో పాటూ ఈ వృద్దుడు కూడా. ఆ విద్య పిల్లలకి మాత్రమే అంటారు. అందరికీ అని చెప్పారుగా రేడియోలో అంటాడు వృద్ధుడు.

ఉన్నవే యాభై బెంచీలూ.. జాయినయ్యింది రెండువందలమంది పిల్లలూ.. కాటికి కాళ్లు చాపిన ఈ ముసలాడిని ఎలా తీస్కుకుంటాం అంటాడో టీచరు. దానికి తోడూ పెన్సిల్‌, పుస్తకం లేనిది స్కూల్లోకి రావటం కుదరదు అంటాడు. ముసలాయన నిరాశగా వెనుదిరుగుతాడు. మరునాడు పెన్సిల్‌, పుస్తకంతో గేటు ముందు ప్రత్యక్షం. తాతయ్యా ఇంటికెళ్లవయ్యా.. ఇంటికెళ్లి ప్రశాంతంగా ఉండు అని స‌ల‌హా ఇస్తాడు టీచ‌ర్‌.

నేనింకా చావలేదు.. బతికే ఉన్నా.. నా పేరు ‘కిమానీ నాంగా మరుగే. ఓహో., సరే.. స్కూలు యూనిఫాం లేకుండా స్కూల్లోకి ఎంట్రీ లేదు మరి!! చెప్పాడా స్కూలు టీచరు. అయినా ఈ వయసులో నీకు చదువు వల్ల ఏమి ఉపయోగం ఉంటుంది చెప్పు అడిగింది జేన్ అక్కడి ప్రధానోపాద్యాయిరాలు.

నేను చదవటం నేర్చుకోవాలి అంటాడు. కానీ ఇప్పటికే ఎక్కువమంది పిల్లలు జాయిన్ అయ్యారు, ఇక వెళ్లు. దీంతో కసీ, కోపంతో వెనుదిరిగాడా వృద్దుడు. పోరాడే తత్వం అలవాటయ్యాక జీవితంలో ఎప్పటికైనా, దేనిలోనైనా గెలుపు తప్పదు. తెల్లారి చొక్కా లాగూ బూట్లూ వేసుకొని స్కూలు గేటుముందు నిలబడతాడు.

అతని పట్టుదలకి ముచ్చటేసిన జేన్ అతనికి ప్రవేశం కల్పిస్తుంది. అది మొదలు మరుగే అనే ఆ వృద్ధుడితో పాటు ప్రధానోపాధ్యాయురాలు జేన్ కు కూడా రకరకాల అడ్డంకులు.. అవాంతరాలు ఎదురవుతాయి. మరుగేని స్కూలు మానేయమని బెదిరిస్తారు. స్కూలు మీద కొచ్చి దాడీ చేస్తారు. జేన్ కి భర్తతో మనస్పర్థ‌లు వస్తాయి. అక్కడి నుంచి బదిలీ అవుతుంది. అన్నింటినీ దాటుకొని వాళ్లిద్దరూ తమ పోరాటంలో ఎలా గెలిచారూ అన్నదే సినిమా!

అయినా ఆ వయసులో మరుగే ఎందుకు చదువటం నేర్చుకోవాలనుకుంటున్నాడు అనేది ఆసక్తికరం.. భావోద్వేగ పూరిత అంశం. కెన్యాలోని ప్రాథమిక పాఠ‌శాలలో చేరి చదువునేర్చుకోవటానికి ఓ వృద్దుడు చేసిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ నేపథ్యంలో అతడు తన గ్రామస్తులతోనూ.. టీచర్లతోనూ.. రాజకీయ నాయకులతోనూ పోరాడి గెలిచి విద్య గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన ‘కిమానీ నాంగా మరుగే’ అనే ఎనభై నాలుగేళ్ల వృద్దుడి నిజజీవిత కథ ఈ సినిమా.

అయితే మరుగే గతం కానీ, ప్రస్తుత సమస్య కానీ ఎక్కువ లోతుల్లోకి వెళ్లలేదు దర్శకుడు. పైపై కథ చెపుతూ తేలికగా ముగించాడు. అయితే సినిమాకి కావలసింది భావోద్వేగాలు.. వాటినందించే కథనం. అవి చక్కగా అమరాయి కనక సినిమా ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. నిజ జీవిత కథని సినిమాటిక్ గా మలిచిన విధానం అభినందనీయం.

కెన్యా డ్రై లాండ్… పల్లె జీవితం, పరిసరాలు, అక్కడి జనాల జీవిత విధానాన్ని ఉన్నదున్నట్టుగా కళ్లముందుంచిన సినిమాటోగ్రఫీ అద్భుతం . ఆఫ్రికన్ ప్రాంతీయ సంగీతం బాగా ఆకట్టుకుంటుంది. మెరుగేగా నటించిన Musila Litondo, జేన్ గా నటించిన Naomie Harris చక్కగా రాణించారు. జీవిత స్పూర్తిని రగిలించే ఇలాంటి సినిమా తప్పకుండా చూడాలి.

Exit mobile version