పేదరిక నిర్మూలనకు రెండు శతాబ్దాలు..

ప్రపంచ వ్యాప్తంగా బిలియనీర్ల సంపద నానాటికి పెరిగిపోతుంటే.. పేదలు మరింత పేదరికంలో మగ్గిపోతున్నారు.

  • Publish Date - January 16, 2024 / 01:33 PM IST

  • నాలుగేళ్లలోనే రెట్టింపైన ఐదుగురు బిలియనీర్ల సంపద
  • 2020లో 405 బిలియన్‌ డాలర్లు.. ఇప్పుడు 869 బిలియన్‌ డాలర్లు..
  • గంటకు 14 మిలియన్‌ డాలర్ల పెరుగుదల
  • అసమానతలకు ప్రమాదకర సంకేతం
  • సూపర్‌ రిచ్‌ ఆదాయాలపై పన్నులు వేయాలి
  • సీఈవోల జీతాలపై పరిమితి విధించాలి
  • కంపెనీల గుత్తాధిపత్యాన్ని నిరోధించాలి
  • ఆక్స్‌ఫా ప్రపంచ వార్షిక నివేదిక

దావోస్‌: ప్రపంచంలో రానున్న రోజుల్లో మరిన్ని ఆర్థిక అసమానతలు పెచ్చరిల్లే అవకాశం ఉన్నదని ఆక్స్‌ఫాం తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ప్రపంచంలో ఐదుగురు సంపన్న వ్యక్తుల సంపద 2020 నుంచి రెట్టింపునకు మించి పెరిగిందని తెలిపింది. ఇదే సమయంలో.. ప్రపంచంలో పేదరికం పోవాలంటే ఇంకా 229 ఏళ్లు పడుతుందని పేర్కొన్నది. ఐదుగురు అతి సంపన్నుల సంపద 2020లో 405 బిలియన్‌ డాలర్లు ఉంటే.. అది అది ఇప్పుడు 869 డాలర్లకు పెరిగిందని తెలిపింది. అంటే.. వారి సంపద గంటకు 14 మిలియన్‌ డాలర్ల చొప్పున పెరుగుతూ వస్తున్నదని వివరించింది. ఒక దశాబ్ద కాలంలోపే ప్రపంచంలో తొలి ట్రలియనీర్‌ అవతరిస్తాడని అంచనా వేసింది. మరోవైపు ప్రపంచ బ్యాంకు నిర్దేశిత దారిద్ర్య రేఖ (రోజుకు 6.85 డాలర్లలోపు (రూ.569.29) సంపాదించేవారు) దిగువున ఉన్నవారి సంఖ్య సున్నాకు చేరుకోవడానికి ఇంకా 229 సంవత్సరాలు పట్టవచ్చని అంచనా వేసింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశాల్లో భాగంగా హక్కుల సంస్థ అయిన ఆక్స్‌ఫాం తన వార్షిక ఆర్థిక అసమానతల నివేదికను వెల్లడించింది.


టాప్‌ 5 జాబితాలో ఆ ఐదుగురు

ఫోర్బ్స్‌ రియల్‌టైమ్‌ గ్లోబల్‌ బిలియనీర్ల జాబితాలో ఎలాన్‌ మస్క్‌ (టెస్లా, స్పేస్‌ ఎక్స్‌), బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ కుటుంబం (ఎల్‌వీఎంహెచ్‌), జెఫ్‌ బెజోస్‌ (అమెజాన్‌), ల్యారీ ఎల్లిసన్‌ (ఆరకిల్‌), మార్క్‌ జుకెర్‌బర్గ్‌ (మెటా) తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు. ప్రపంచంలోని 50 అతిపెద్ద పబ్లిక్‌ కార్పొరేషన్లలో 34 శాతం వరకూ బిలియనీర్లు ప్రధాన పెట్టుబడిదారులుగా లేదా సీఈవోలుగా ఉన్నారని ఆక్స్‌ఫాం నివేదిక తెలిపింది. అందులోనూ టాప్‌ టెన్‌ ప్రపంచ అతిపెద్ద కార్పొరేషన్లలో ఏడింటికి బిలియనీర్‌ సీఈవో లేదా బిలియనీర్‌ ప్రధాన షేర్‌ హోల్డర్‌గా ఉన్నారని పేర్కొన్నది. కార్మికులకు కాకుండా సంపన్నులకు ప్రతిఫలాలు అందించడం, పన్నుల ఎగవేత, ప్రజాసేవల ప్రైవేటీకరణ, పర్యావరణ విధ్వంసం ద్వారా కార్పొరేట్‌ శక్తులు ఆర్థిక అసమానతలకు ఆజ్యం పోస్తున్నాయని వెల్లడించింది.


కష్టాలు జనానికి లాభాలు బిలియనీర్లకు

కొత్త దశాబ్ది మొదట్లో విరుచుకుపడిన కరోనా విశ్వమారి, ద్రవ్యోల్బణం, యుద్ధాలు వంటివాటి భారాన్ని వందల కోట్ల మంది ప్రజలు మోస్తున్నారని, బిలియనీర్లు మాత్రం నానాటికీ సంపదను పెంచుకుంటూ పోతున్నారని ఆక్స్‌ఫాం తాత్కాలిక ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అమితాబ్‌ బెహర్‌ అన్నారు. ఈ అసమానత ఆకస్మికంగా సంభవించింది కాదని, ఇతరులు చెల్లించుకుంటున్న మూల్యంతో బిలియనీర్లు మరింత సంపద పోగేసుకుంటున్నారని చెప్పారు.


సూపర్‌ రిచ్‌ ఆదాయాలకు కళ్లెం వేయాలి

సూపర్‌ రిచ్‌ సెక్షన్ల ఆదాయాలు, ఆకస్మిక ధన లాభాలపై పన్నులు పెంచడం, కంపెనీ సీఈవోలకు చెల్లింపులపై సీలింగ్‌ విధించడం ద్వారా రాజ్యాలకు కొత్త శక్తిని నింపటంపై ప్రభుత్వాలు కృషి చేయాలని ఆక్స్‌ఫాం కోరింది. కార్మికుల ప్రయోజనాల కోసం పనిచేసే ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించాలని పేర్కొన్నది. కార్పొరేట్‌ కంపెనీల గుత్తాధిపత్యాన్ని తొలగించాలని, కార్మికులకు సాధికారత కల్పించాలని, అతి సంపన్నుల భారీ లాభాలపై పరిమితులు విధించాలని, ఈ దిశగా ఆయా దేశాల ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని బెహర్‌ అన్నారు.

Latest News