హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగార్థులకు గవర్నర్ తమిళిపై భరోసా కల్పించారు. ఏడాది లోపు మా ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తుందని, ఆరు నెలల్లో మెగా డీఎస్సీ నిర్వహించి, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.
ఎన్నికల సందర్భంగా యువతకు మేం ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చుతాం అని గవర్నర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్న టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన ఇప్పటికే ప్రారంభమైంది. అణిచివేత, వివక్షకు గురైన ప్రతి వర్గానికి మా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది. వారికి అండగా ప్రభుత్వం ఉంటుంది.
రైతులు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ, యువత, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులు ఇలా ప్రతీ వర్గాన్ని పరిగణనలోకి తీసుకుని సంక్షేమం, అభివృద్ధి కార్యాచరణ ఉంటుంది. యువత జాబ్ క్యాలెండర్ విషయంలో చెప్పిన మాట ప్రకారం కార్యాచరణ ఉంటుందని గవర్నర్ స్పష్టం చేశారు.