విధాత: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధమైంది. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అధ్యక్ష స్థానం కోసం ఓటింగ్ జరగడం ఇది ఆరోసారి. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక బరిలోకి లేకపోవడంతో 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధేతర నేత ఏఐసీసీ పగ్గాలు చేపటనున్నారు. సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ మధ్య పోటీ నెలకొన్నది.
సుమారు 9 వేలకు పైగా పీసీసీ ప్రతినిధులు వీళ్ల భవితవ్యాన్ని తేల్చనున్నారు. సోమవారం ఈ ఎన్నిక జరుగుతుంది. ఈ నెల 19న ఫలితాలు వెలువడుతాయి. రెండు దశాబ్దాల తర్వాత గాంధేతర వ్యక్తి ఏఐసీసీ అధ్యక్షుడు కాబోతున్నాడు. దేశంలోని అన్ని పీసీసీ కార్యాలయాల్లో, ఏఐసీసీ కార్యాలయంలో, భారత్ జోడోయాత్ర క్యాంప్‌లో కూడా సోమవారం పోలింగ్ జరగనున్నది.
భారత్ జోడో యాత్ర క్యాంప్‌లో రాహుల్ సహా పలువురు ముఖ్య నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధ్యక్ష ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాటు చేసింది. ప్రతి రాష్ట్రానికి ఒక రిటర్నింగ్, ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఎంపిక చేసింది.
తెలంగాణకు రిటర్నింగ్ అధికారిగా కేరళ నేత రాజమోహన్, ఢిల్లీకి రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యవహరించనున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో ఉన్న మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ అన్ని రాష్ట్రాల్లో పర్యటించిన పీసీసీ ప్రతినిధుల మద్దతు కోరారు.
మల్లిఖార్జున ఖర్గే అధ్యక్ష ఎన్నికల్లో ఫేవరేట్‌గా ఉన్నారు. ఎక్కువమంది సీనియర్లు ఆయనకే మద్దతు ఇస్తున్నారు. ఈ విషయంలో శశిథరూర్ విమర్శించినా తాము తటస్ఠంగా ఉన్నామని ఎవరి పక్షాన లేమని గాంధీ కుటుంబం ఇప్పటికే ప్రకటించింది.