అమెరికాలో కాల్పుల మోత.. పార్టీలో ఆగంతకుల కాల్పులు.. ఆరుగురు మృతి

అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఉత్తర మెక్సికోలో శుక్రవారం తెల్లవారు జామున ముగ్గురు ఆగంతకులు పార్టీలోకి చొరబడి కాల్పులు జరిపారు.

  • Publish Date - December 30, 2023 / 04:49 AM IST

Northern Mexico | అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఉత్తర మెక్సికోలో శుక్రవారం తెల్లవారు జామున ముగ్గురు ఆగంతకులు పార్టీలోకి చొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 26 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు 18 ఏళ్లలోపు ఉండగా.. గాయపడ్డవారిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.


మరో 13 మందికి స్వల్ప గాయాలు కాగా వారిని డిశ్చార్జి చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోనోరా స్టేట్‌లోని సియుడాడ్​ ఒబ్రెగాన్​ అనే నగరంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పార్టీకి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. ఇందులో చిన్నవయసు నుంచి పెద్ద వయస్కుల వరకు ఉన్నారు. పార్టీ ప్రారంభమైన కొద్దిసేపటికే ముగ్గురు ఆగంతకులు చొచ్చుకువెళ్లి కాల్పులు జరిపారు. నాలుగో ఆగంతకుడు అప్పటికే పార్టీలో ఉన్నాడని, మిగతా ముగ్గురు ఆగంతకులు రావడంతోనే కాల్పులకు దిగారు.


సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆగంతకులు ముగ్గురు పారిపోగా.. మరో ఆగంతకున్ని పోలీసులు కాల్చి చంపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. అయితే, సోనోరా రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు భారీగా పెరుగుతున్నాయి. పలు గ్యాంగ్‌వార్‌తో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులుపడుతున్నారు. ఇది గ్యాంగ్‌వార్‌ పనేనా..? మరేమైనా కారణాలు ఉన్నాయా? అన్నది తేలాల్సి ఉంది.

Latest News