విధాత: అమెరికాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో( US Shooting)ముగ్గురి పోలీసు అధికారులు మరణించారు(Police Officers Killed). అమెరికా పెన్సిల్వేనియాలోని నార్త్ కొడరస్ టౌన్‌షిప్‌లో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు దుండగుడిని కాల్చి చంపారు(gunman killed). గృహ హింసకు సంబంధించిన ఒక కేసు విచారణ కోసం వెళ్లిన వారిపై దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.
ఘటనపై పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన అధికారులు పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ, ప్రస్తుతం నిలకడగా ఉందని ఆయన తెలిపారు. ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం సేవ చేసిన ముగ్గురు అమూల్యమైన ప్రాణాలను కోల్పోయాం” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మరణించిన అధికారులు, నిందితుడి వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని పెన్సిల్వేనియా స్టేట్ పోలీస్ కమిషనర్ క్రిస్టొఫర్ పారిస్ తెలిపారు.