విధాత, హైదరాబాద్ : నిధుల కొరత ఎదుర్కొంటున్న తెలంగాణ గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదల కావడం గమనార్హం. వాస్తవానికి పంచాయతీలకు కొన్ని నెలల క్రితమే ఈ నిధులు అందాల్సి ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఆలస్యం నేపథ్యంలో నిధుల విడుదల ఆగిపోయింది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తి కావడంతో తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిమంత్రి సీతక్క చొరవ తీసుకుని పంచాయతీరాజ్ శాఖ అధికారుల సంప్రదింపులతో నిధుల విడుదలకు కృషి చేశారు. తెలంగాణ పంచాయితీలకు కేంద్రం రూ.3 వేల కోట్ల దాకా బకాయిలు ఉన్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవతో కొద్ది కొద్దిగా నిధుల విడుదలకు కేంద్రం అంగీకరించింది.
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ చేసిన ప్రయత్నాలు ఫలించి పెండింగ్ లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. నిధుల విడుదలపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఇతర పెండింగ్ నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
16వ ఆర్థిక సంఘం ద్వారా మరిన్ని నిధులు
గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతానికి 16వ ఆర్థిక సంఘం కమిషన్ రూ.9,968 కోట్ల గ్రాంట్లను కేటాయించింది. దేశవ్యాప్త గ్రామీణ జనాభాలో తెలంగాణ వాటా, వైశాల్యం, స్థానిక సంస్థల పనితీరు ఆధారంగా ఈ నిధులు ఖరారయ్యాయి. 2026–27లో రూ.1,280 కోట్లతో మొదలై, ప్రతి ఏటా పెరుగుతూ 2030–31 నాటికి రూ. 2,601 కోట్లకు ఈ నిధులు చేరుతాయి. గతంలో 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన రూ.7,500 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 33% ఎక్కువ. ఈ నిధులలో 80% బేసిక్ గ్రాంట్లుగా అందుతాయి. మొత్తం నిధుల్లో 70శాతం పంచాయతీలకు కేటాయించనున్నారు.మండల పరిషత్‌లకు 20శాతం, జిల్లా పరిషత్‌లకు 10శాతం నిధులు కేటాయిస్తారు.
పట్టణ స్థానిక సంస్థలకు రూ.11,548 కోట్ల భారీ నిధిని కమిషన్ సిఫార్సు చేసింది. పట్టణ గ్రాంట్ల వాటాలో తెలంగాణకు 3.98 శాతం వెయిటేజీ ఇచ్చారు. 2026–27లో రూ.1,483 కోట్లు అందనుండగా.. చివరి ఏడాది నాటికి అది రూ.2,923 కోట్లకు పెరుగుతుంది. గత 15వ ఆర్థిక సంఘం రూ.8,200 కోట్లతో పోలిస్తే ఇది సుమారు రూ.3,348 కోట్లు అధికంగా పెంచింది. ఈ నిధులు హైదరాబాద్ వంటి మెట్రో నగరాలతో పాటు రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉపకరించనున్నాయి.
ఇవి కూడా చదవండి :
Chicken | నాన్ వెజ్ ప్రియులకు ఊరట.. తగ్గిన కోడి కూర ధరలు..!
Gold Silver Price Drop | మళ్లీ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
