Site icon vidhaatha

Gurugram Incident | గురుగ్రామ్‌.. రెస్టారెంట్‌ను తగలబెట్టిన మూకలు, లూటీలు

Gurugram Incident

గురుగ్రామ్‌: రెండో రోజు కూడా గురుగ్రామ్‌లో హింస చోటు చేసుకున్నది. మంగళవారం మధ్యహ్నం బాద్షాపూర్‌లో ఒక రెస్టారెంట్‌ను తగులబెట్టిన మూకలు.. ఒక మతానికి చెందిన దుకాణాలను లూటీ చేశారు. లూటీలు ఆపేందుకు పోలీసులు వచ్చేలోపే వారంతా అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు రెస్టారెంట్‌కు నిప్పుపెట్టిన వార్త తెలియగానే అగ్నిమాపక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తెచ్చాయి.

రెస్టారెంటుకు నిప్పుపెట్టిన మూకలు.. బాద్షాపూర్‌లోని మసీదు ఎదుట నిలబడి.. జై శ్రీరాం అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో బాద్షాపూర్‌ మార్కెట్‌ను కూడా పోలీసులు మూసివేశారు. లూటీలకు సంబంధించి పలువురు వ్యక్తులను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.

తొలి రోజు హింసలో నలుగురు చనిపోగా.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకున్న మరో ఘటనలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఒక మతానికి చెందిన ప్రార్థనాస్థలంపై దాడి చేసిన దుండగులు దానికి నిప్పుపెట్టడంతో ఒకరు చనిపోయారని, మరొకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

గురుగ్రామ్‌లో అన్ని ప్రార్థనాస్థలాల వద్ద భద్రతను పెంచామని చెప్పారు. విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శన సందర్భంగా హింస చోటు చేసుకున్నది.

Exit mobile version