Site icon vidhaatha

Gurugram | వాట్సాప్‌లో న్యూడ్‌ కాల్‌.. దుస్తులు విప్పేసిన మహిళ! కళ్లు తిరిగి పడిపోయిన యువకుడు.. అసలీ స్కామ్‌ ఏంటీ?

Gurugram |

గురుగ్రామ్‌: దేశంలో నానాటికీ సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. తెలియకుండా డబ్బు లక్షలకు లక్షలు కొట్టేసేది కొందరైతే.. ట్రాప్‌లోకి లాగి.. బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు గుంజుతున్న కేసులూ నమోదు అవుతున్నాయి. పార్ట్‌టైమ్‌ జాబ్‌తో డబ్బు సంపాదించుకోవచ్చని, చాలా సింపుల్‌ అని చెప్పి లింకులు పంపించి.. బ్యాంక్‌ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. పాన్‌కార్డుతో లింకు చేయాలని చెప్పి ఓటీపీలు అడిగి.. బురిడీ కొట్టేస్తున్న వారూ ఉన్నారు.

ఒక విధంగా చెప్పాలంటే ఆన్‌లైన్‌లో ఎంతో అప్రమత్తంగా ఉంటే తప్ప మోసాలను తప్పించుకోలేం. ఈ మధ్య న్యూడ్‌ వీడియో కాల్స్‌ చేస్తూ.. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. గురుగ్రామ్‌లో ఒక వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. రిటైర్డ్‌ సెషన్స్‌ జడ్జి కుమారుడికి అపరిచిత నెంబర్‌ నుంచి వాట్సాప్‌ వీడియో కాల్‌ వచ్చింది. తండ్రి కార్యాలయంలో ఉండగా వచ్చిన కాల్‌ను అతడు ఆన్సర్‌ చేశాడు.

అందులో ఒక యువతి.. తన దుస్తులు విప్పేస్తూ కనిపించింది. దీంతో కంగారుపడిపోయిన యువకుడు.. ఒక్కసారిగా స్పృహ తప్పాడు. ఆ తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. అటువైపు నుంచి అశ్లీల ఫొటోలు రావడం మొదలైంది. దానితో పాటు స్క్రీన్‌ షాట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తానంటూ బెదిరింపులు వచ్చాయి.

‘నా కుమారుడు మా ఆఫీస్‌లో ఉండగా వీడియో కాల్‌ వచ్చింది. దాన్ని చూడగానే స్క్రీన్‌ నుంచి తప్పుకొన్నాడు.. సృహ తప్పి పడిపోయాడు. కానీ.. సదరు మహిళ అసభ్య ఫొటోలు పంపిస్తూ బ్లాక్‌ మెయిలింగ్‌ మెసేజ్‌లు పంపింది. అప్పటి నుంచి నా కుమారుడు భయపడి పోతున్నాడు’ అని బాధితుడి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్నట్టు బాధితుడు న్యాయవాది కూడా. తన కుమారుడి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు ఆయన మొబైల్‌ను హ్యాక్‌ చేసి, డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వీడియోకాల్‌ స్కామ్‌ అంటే ఏమిటి?

ఇదేమీ కొత్త సైబర్‌ నేరం కాదు. దేశంలో అనేక మంది ఇటువంటి నేరస్థుల బారిన పడ్డారు. పడుతూనే ఉన్నారు. కొన్ని కేసులలో స్కామర్లు.. అంతర్జాతీయ నెంబర్ల నుంచి కాల్స్‌ చేస్తున్నారు. కొంత మంది ఆకర్షణీయమైన ప్రొఫైల్‌ పిక్చర్లు పెట్టుకుని.. బుట్టలో పడేస్తున్నారు. మనం కాల్‌ లిఫ్ట్‌ చేశామంటే చాటు.. ఇక స్కామర్లు బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగుతారు.

ఈ వాట్సాప్‌ వీడియో కాల్స్‌ సమయంలో నేరస్థులు మరో రహస్య కెమెరా ద్వారా బాధితులను రికార్డ్‌ చేస్తుంటారు. తెలియక వారి బుట్టలో పడితే.. డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోలను మీ కాంటాక్టులకు పంపిస్తామంటూ బెదిరింపులకు దిగారు.

ఇటువంటి నేరాల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. అందుకు కొన్ని పాటించాలి. మీకు తెలియని లేదా మీకు నమ్మకం కుదరని నెంబర్ల నుంచి/అకౌంట్ల నుంచి వచ్చే ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్‌ చేయకండి. ప్రత్యేకించి తెలియని నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్‌ కాల్స్‌ను అస్సలు అటెండ్‌ చేయవద్దు.

మిస్డ్‌కాల్‌ ఉన్నదని కాల్‌బ్యాక్‌ చేయడం లేదా, మెసేజ్‌లకు రిప్లై ఇవ్వటం చేయకండి. సామాజిక మాధ్యమాల్లో మీ ప్రైవసీ సెట్టింగ్స్‌ సరిచేసుకోండి. మీ వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్లకుండా చూసుకోండి.

మీకు తెలియని నంబర్ల నుంచి అవాంఛనీయమైన వీడియోకాల్స్‌ లేదా మెసేజ్‌లు వస్తే.. ఆన్సర్‌ చేయకండి. రిప్లై ఇవ్వకండి. ఒక వేళ మీరు నేరస్థుల బారిన పడితే.. వెంటనే మీకు దగ్గరలో ఉన్న సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి.

Exit mobile version