విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: తనకు పార్టీలు మారాల్సిన అవసరం లేదని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తనపై దుష్ప్రచారం చేయడం తగదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఖండించారు. సోమవారం ఆయన నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ మార్పుపై వస్తున్న ఆరోపణలను మరోసారి ఖండించారు.
రాజ్యాంగబద్ధమైన శాసన మండలి చైర్మన్ పదవిలో ఉన్న తనకు ఏ పార్టీతో సంబంధం లేదన్నారు. చట్టబద్ధంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని చెప్పారు. కొత్త ప్రభుత్వానికి సహకారం అందిస్తూనే సలహాలు, సూచనలు చేస్తామన్నారు. నూతన ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకోవాలని సూచించారు. ప్రజలకు వాస్తవ పరిస్థితి వివరించి పథకాలు అమలు చేయాలని కోరారు.
ఎన్నికల్లో బీఆర్ యస్ ఓటమిపై పార్టీ అధిష్టానం విశ్లేషణ చేసుకొంటుందన్నారు. కేసీఆర్ పట్ల ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, ఆయన పట్ల ప్రజలకు ప్రేమ, విశ్వాసం అలాగే ఉన్నాయన్నారు. కేసీఆర్ రావాలి- మా ఎమ్మెల్యే పోవాలి అనేవిధంగా ప్రజలు ఓట్లు వేశారని అభిప్రాయమన్నారు. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చి ఉంటే మళ్ళీ బీఆర్ యస్ అధికారంలోకి వచ్చేదని, కాంగ్రెస్ 6 గ్యారెంటీలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని అనుకోవడం లేదన్నారు.
జీహెచ్ ఎంసీ పరిధిలో బీఆర్ యస్ ఎమ్మెల్యేలు, కేటీఆర్ పని తీరుకు ఓట్లు పడ్డాయన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు రెండు మంత్రి పదవులు రావడం సంతోషకరమని, జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. జిల్లాలో పెండింగ్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలన్నారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.